బైక్​ స్టంట్స్​ సూపర్

బైక్​ స్టంట్స్​ సూపర్

సైన్యంలో చేరాలనేది ఆమె చిన్పప్పటి కల. అనుకున్నట్టుగానే నాలుగేండ్ల క్రితం బోర్డర్​ సెక్యూరిటీ ఫోర్స్​లో చేరి తన కలని నిజం చేసుకుంది. అంతటితోనే ఆమె ఆగిపోలేదు. రిపబ్లిక్​ డే పరేడ్​ కోసం రిస్క్​తో కూడిన బైక్​ స్టంట్స్  కూడా నేర్చుకుంది. ఈసారి రిపబ్లిక్​ డే పరేడ్​లో మొదటిసారి బైక్​ స్టంట్స్​ చేయబోతోంది పి. జయంతి. ‘సీమా భవానీ’ గ్రూప్​లో మెంబర్​ అయిన ఆమె సొంతూరు కేరళలోని కొల్లాం.  


బీఎస్​ఎఫ్​లో కానిస్టేబుల్​గా పనిచేస్తోంది జయంతి. ఢిల్లీలోని రాజ్​పథ్​​లో రిపబ్లిక్​ డే సందర్భంగా మహిళా సైనికులతో కూడిన ‘సీమా భవానీ’ గ్రూప్​ బైక్​ స్టంట్స్​ చూసి ఇన్​స్పైర్​ అయింది. తను కూడా బుల్లెట్​ బండి మీద దూసుకెళ్తూ అబ్బుర పరిచే విన్యాసాలు చేయాలనుకుంది. అందుకోసం ‘సీమా భవానీ’ గ్రూప్​లో చేరింది.  బుల్లెట్​ బండి నడపడం, బండి మీద వెళ్తూ ఒళ్లు గగుర్పొడిచే స్టంట్స్​ చేయడంలో ఏడు నెలలు ట్రైనింగ్​ తీసుకుంది. ఈ గ్రూప్​లోని110 మందిలో జయంతి ఒకరు. జయంతి భర్త కూడా బీఎస్​ఎఫ్​లోనే ఇన్​స్పెక్టర్.  

‘సీమా భవాని’ సాహసం

బీఎస్​ఎఫ్​లో ‘సీమా భవాని’ టీమ్​ని 2016లో ఏర్పాటుచేశారు. 2018 రిపబ్లిక్​ డే వేడుకల్లో బైక్​ స్టంట్స్​ చేశారు ఈ టీమ్​ మెంబర్స్​. బుల్లెట్​ బండి మీద ‘పిరమిడ్​ స్టంట్స్​’తో పాటు ‘శక్తిమాన్​’, ‘ఫిష్​ రైడింగ్’, ‘బుల్​ ఫైటింగ్​’, ‘సీమ ప్రహరి’... ఇలా 16 రకాల విన్యాసాలతో అబ్బురపరుస్తారు వీళ్లు. రిస్క్​తో కూడిన ఈ స్టంట్స్​ చేసేందుకు చాలా కష్ట పడతారు. పొద్దున్నే 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్లీ సాయంత్రం 3:30 నుంచి 5:30 వరకు బైక్​ స్టంట్స్​ ప్రాక్టీస్​ చేస్తారు. వీళ్లకో కోడ్​ లాంగ్వేజ్​ ఉంటుంది. పరేడ్​ జరుగుతున్నప్పుడు టీమ్​లోని వాళ్లతో ఏమైనా మాట్లాడాలనుకుంటే కోడ్​ లాంగ్వేజ్​తోనే చెప్తారు. దాంతో చిన్న పొరపాటు కూడా జరగకుండా స్టంట్స్ కంప్లీట్​​ చేస్తారు.