327 కోట్ల గవర్నమెంట్‌‌‌‌ సబ్సిడీలో  ఒక్క పైసా రాలే!

327 కోట్ల గవర్నమెంట్‌‌‌‌ సబ్సిడీలో  ఒక్క పైసా రాలే!

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి/ ఏటూరు నాగారం, వెలుగు: బిల్ట్‌‌‌‌ ఫ్యాక్టరీ తెరిచి కార్మికులకు న్యాయం చేస్తామని రాష్ట్ర సర్కారు ఇచ్చిన హామీ నెరవేరలేదు. ప్రచార ఆర్భాటానికే గవర్నమెంట్‌‌‌‌ పరిమితమైంది. కార్మికుల సంక్షేమం కోసం రాయితీ పేరిట ఏటా రూ.327 కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఆరేళ్లుగా ఒక్క పైసా కూడా విడుదల కాకపోవడంతో ఉపాధి లేక కార్మిక కుటుంబాలు వీధిన పడ్డాయి. 72 నెలలుగా  జీతాలు లేక కార్మికులు పస్తులుంటున్నారు. బిల్ట్‌‌‌‌ ఫ్యాక్టరీ తెరవాలంటూ మళ్లీ కార్మికులు పోరుబాట పట్టారు. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపూర్‌‌‌‌లో శనివారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. 

స్వరాష్ట్రంలో మూసేసిన ఫస్ట్‌‌‌‌ ఫ్యాక్టరీ  

మంగపేట మండలం కమలాపూర్ గ్రామంలో 1975లో అవంతా గ్రూప్ ఆఫ్ కంపెనీకి  చెందిన బల్లార్పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(బిల్ట్) సంస్థ పేపర్‌‌‌‌ గుజ్జు తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. 2,705 మంది కార్మికులు ప్రత్యక్షంగా పని చేసేవారు. పరోక్షంగా ఈ పరిశ్రమపై ఆధారపడి 10 వేల కుటుంబాలకు పైగా జీవించేవి. నాలున్నర దశాబ్ధాలపాటు సేవలందించింది. ఇక్కడ ఉత్పత్తి చేసే పేపర్ గుజ్జు కంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే గుజ్జు చాలా తక్కువ ధరకు లభిస్తుండటంతో ఇక్కడ తయారయ్యే ముడి సరుకును కొనుగోలు చేయడానికి సంస్థలు ముందుకు రాలేదు. దీంతో 2013‒14 ఆర్థిక సంవత్సరంలో రూ.57.21 కోట్లు,  2014 ఏప్రిల్‌‌‌‌ నాటికి రూ.4.6 కోట్ల నష్టం రావడంతో 2014 ఏప్రిల్ 5న బిల్ట్‌‌‌‌ ఫ్యాక్టరీని మూసేశారు.  దీంతో 705 మంది పర్మినెంట్‌‌‌‌ కార్మికులు, సుమారు 2 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు, పరిశ్రమపై ఆధారపడి జీవించే వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి.   

తెరిపిస్తామంటూ సీఎం కేసీఆర్​హామీ

మూసేసిన బిల్ట్ ఫ్యాక్టరీని తెరిపిస్తామంటూ సీఎం కేసీఆర్‌‌‌‌ హామీ ఇచ్చారు. పరిశ్రమను తెరిపించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.327 కోట్లు రాయితీ ఇస్తామంటూ 2015లో జీవో జారీ చేసింది. అయినా గత ఆరేళ్లుగా గవర్నమెంట్‌‌‌‌ నుంచి ఒక్క పైసా విడుదల కాలేదు. దీంతో బిల్ట్​ ఫ్యాక్టరీ సమస్య ఎటూ తేలలేదు. ఫ్యాక్టరీని తెరవడానికి యాజమాన్యం ముందుకు రాకపోవడంతో కార్మికులు ఉపాధి లేక పస్తులుంటున్నారు. బిల్ట్‌‌‌‌ ఫ్యాక్టరీని తెరిపించాలని పోరాటం చేస్తూ ఇప్పటికే 38 మంది పైగా కార్మికులు మృతిచెందారు. ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో నడిచే  విద్యా సంస్థను మూసేశారు. దీంతో కార్మికుల పిల్లల చదువులు అటకెక్కాయి. 

మళ్లీ పోరుబాట 

2014 జూన్ నెలలో  లే ఆఫ్‌‌‌‌‌‌‌‌కు దరఖాస్తు చేసిన యాజమాన్యం, అక్టోబర్ నెలలో బిల్ట్‌‌‌‌‌‌‌‌ క్లోజ్ చేయడానికి దరఖాస్తు చేసింది. ఈ రెండింటిని కూడా కార్మిక శాఖ అంగీకరించలేదు. పర్మినెంట్ కార్మికులకు నెలవారీ జీతాలు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. అయినా బిల్ట్ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. బిల్ట్​ఫ్యాక్టరీలో పనిచేసే పర్మినెంట్ కార్మికులకు 72 నెలలుగా యాజమాన్యం వేతనాలు చెల్లించడం లేదు. నేషనల్‌‌‌‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌‌‌‌ కోర్టులో(ఎన్‌‌‌‌సీఎల్‌‌‌‌టీ) కేసు వేసినప్పటికీ పరిష్కారం కాలేదు. దీంతో బిల్ట్‌‌‌‌ ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతూ, కార్మికుల హక్కులను కాలరాస్తోందని, స్టేట్‌‌‌‌ గవర్నమెంట్‌‌‌‌ కూడా పట్టించుకోవడం లేదంటూ కార్మికులు శనివారం మరోసారి పోరుబాట పట్టారు. కమలాపూర్‌‌‌‌లో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. బిల్ట్ ఫ్యాక్టరీని మూసేసిన 2014లో కార్మికులు తొలిసారి 362 రోజులు, రెండోసారి ఏడాదికి పైగా దీక్షలు చేశారు. ఇప్పుడు ఇది మూడోసారి.

గవర్నమెంట్‌‌‌‌ నుంచి పైసా రాలే  

బిల్ట్ ఫ్యాక్టరీని తెరిపించడానికి ప్రభుత్వం రాయితీలిస్తామని గొప్పలు చెప్పిందేకానీ ఇప్పటివరకు ఒక్క పైసా ఇవ్వలే. సంవత్సరాల తరబడి పనులులేక కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో చస్తున్నారు. మేనేజ్​మెంట్​ జీతాలు ఇవ్వకపోవడంతో చికిత్స చేయించుకునే ఆర్థిక స్థోమత లేక అనారోగ్యంతో చనిపోయారు.  స్టేట్‌‌‌‌ గవర్నమెంట్‌‌‌‌ బిల్ట్​ ఫ్యాక్టరీని తెరిస్తేనే కార్మికులకు న్యాయం జరుగుతుంది.  
‒ లింగంపల్లి శ్రీనివాస్‌‌రావు‌‌, బిల్ట్‌‌‌‌ కార్మిక సంఘాల నేత

ఉపాధి లేక రోడ్డున పడ్డం

బిల్ట్ ఫ్యాక్టరీని మూసేయడంతో మేమంతా రోడ్డున పడ్డాం. గత ఆరేళ్లుగా జీతాలు రావట్లేదు. తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమత మవు తున్నాం. స్కూల్‌‌‌‌ మూసేయడంతో పిల్లల చదువులు ఆగం అయినయ్‌‌‌‌. కుటుంబ పోషణ కోసం చాలామంది కార్మికులు వ్యవసాయ కూలీలుగా మారారు. బిల్డింగ్‌‌‌‌ లేబర్‌‌‌‌ వర్క్‌‌‌‌లు కూడా చేస్తున్నాం. 
– కాసోజు వెంకటాచారి, బిల్ట్‌‌‌‌ కార్మికుడు

మిషన్లు తుప్పు పడుతున్నయ్​

ఆరేళ్లుగా బిల్ట్‌‌‌‌ ఫ్యాక్టరీ తెరవకపోవడంతో రూ. కోట్లు విలువ చేసే మిషన్లు తుప్పు పడుతు న్నాయి. ఈ ఫ్యాక్టరీ తొలినాళ్లలో రోజుకు 130 టన్నుల పల్ప్ ఉత్పత్తి  జరిగేది. 1994‒95 లో జపాన్, ఫిన్లాండ్, స్వీడన్ దేశాల నుంచి రూ.కోట్ల విలువచేసే కొత్త మిషనరీని తీసు కొచ్చి ఫ్యాక్టరీని ఆధునీకరించారు. ఆ తర్వాత రోజుకు 267  టన్నుల పేపర్ గుజ్జు ఉత్పత్తి జరిగేది. 2014 ఏప్రిల్‌‌‌‌లో ఫ్యాక్టరీ మూసిన నాటి నుంచి మిషన్లను పట్టించుకుంటలేరు. 
‒ కత్తి శ్రీనివాస్, బిల్ట్‌‌‌‌ కార్మికుడు