ఈఎస్జీ నిబంధనలకు కట్టుబడి ఉండాలి : జయేశ్ రంజన్

ఈఎస్జీ నిబంధనలకు కట్టుబడి ఉండాలి : జయేశ్ రంజన్
  • స్పెషల్​ చీఫ్​ సెక్రటరీ జయేశ్ రంజన్

పద్మారావునగర్, వెలుగు: ఎన్విరాన్​మెంటల్, సోషల్, గవర్నెన్స్ (ఈఎస్​జీ) నిబంధనలకు కట్టుబడి ఉన్నప్పుడే అంతర్జాతీయ మార్కెట్లలో నిలదొక్కుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్​ చీఫ్​ సెక్రటరీ జయేశ్ రంజన్ అన్నారు.హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం బేగంపేటలోని హోటల్ ప్లాజాలో శుక్రవారం జరిగిన ఈఎస్‌జీ లీడర్​షిప్ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యూరోపియన్ దేశాలు ఈఎస్‌జీ ప్రమాణాలపై కఠినంగా వ్యవహరిస్తున్నాయని, వాటిని పాటించని ఉత్పత్తులపై నిషేధం విధించే పరిస్థితి ఉందన్నారు. 

ఫార్మా, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ రంగాల్లో తెలంగాణ ఉత్పత్తులు 93 దేశాలకు ఎగుమతి అవుతున్నాయని, అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగాలంటే ఈఎస్‌జీ తప్పనిసరన్నారు. ఎగుమతుల ద్వారానే తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యాన్ని సాధించగలదని, రాబోయే 22 ఏళ్లలో ఎగుమతులు పది రెట్లు పెరుగుతాయని తెలిపారు. నలంద విశ్వవిద్యాలయ మాజీ వీసీ సునయనా సింగ్, హెచ్ఎంఏ ఉపాధ్యక్షుడు శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.