తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి అద్దం పట్టేలా బతుకమ్మ పండుగ : జయేశ్ రంజన్

తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి అద్దం పట్టేలా బతుకమ్మ పండుగ : జయేశ్ రంజన్
  • ఏర్పాట్లపై సాంస్కృతిక శాఖ స్పెషల్​ సీఎస్ జయేశ్ ​రంజన్  సమీక్ష 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టేలా బతుకమ్మ పండుగ నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో  ఏర్పాట్లు చేయాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్​ చీఫ్​ సెక్రటరీ జయేశ్​రంజన్​ సూచించారు. బతుకమ్మ పండుగ-2025 నిర్వహణ ఏర్పాట్లపై బుధవారం  బేగంపేట్ హరిత ప్లాజా హోటల్​లో ఆయన వివిధ శాఖల ఉన్నతాధికారుల అభిప్రాయాలు సూచనలు, సలహాలు స్వీకరించారు. 

ఈ సందర్భంగా జయేశ్​రంజన్​ మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి బతుకమ్మ పండుగ నిర్వహణకు సంబంధించి అన్ని శాఖల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్టు చెప్పారు. హైదరాబాద్ మహానగరంతో పాటు వరంగల్ మరికొన్ని జిల్లాల్లో  బతుకమ్మ పండుగ సంబురాలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు.  అంతర్జాతీయ స్థాయిలో బతుకమ్మ పండుగ ఖ్యాతిని పెంచేదిశగా ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన తెలిపారు. 

బతుకమ్మ పండుగ వాల్ పోస్టర్లు, పండుగ సంప్రదాయం, వేడుకల నిర్వహణ విధి విధానాలు, స్వయం సహాయక సంఘాల పాత్ర, కుల వృత్తుల వారు తయారుచేసిన వస్తువుల విక్రయాలు, కళా ప్రదర్శనలు  తదితర అంశాలపై శాఖల వారీగా అభిప్రాయాలను స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ నిర్వహణకు గతం కంటే ఎక్కువ నిధులు కేటాయించనున్నట్టు తెలిపారు.