‘క్యారెక్టర్ ఆర్క్‌లో ఏదైనా చాలెంజ్ ఉంటేనే ఏ నటుడికైనా చాలా ఎక్సయిటింగ్‌గా ఉంటుంది. ‘గాయపడ్డ సింహం’ చిత్రంలో అలాంటి పాత్రే పోషించాను’ అన్నారు నటుడు జేడీ చక్రవర్తి. తరుణ్ భాస్కర్ లీడ్ రోల్‌లో కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పవన్ సాధినేని సమర్పణలో కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ భన్సల్ నిర్మించారు. మే 1న సినిమా విడుదల సందర్భంగా జేడీ చక్రవర్తి ఇలా ముచ్చటించారు.
‘‘ ఇందులో ధర్మ అనే బ్రూటల్ క్యారెక్టర్ చేశా. ఒకే క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్‌లో ఒక షేడ్, సెకండ్ హాఫ్‌లో మరో షేడ్ ఉండటం మామూలే. కానీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండింటిలో ఒకే విధంగా కనిపిస్తూ, రెండు షేడ్స్‌లో కనిపించడం నన్ను చాలా ఎక్సయిట్ చేసింది. నాది సీరియస్ క్యారెక్టర్ అయినా స్క్రీన్‌పై చేసే పనులు ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తాయి. కథలోనే ఆ బలం, మ్యాజిక్ కుదిరింది. నా క్యారెక్టర్ గ్లింప్స్ రిలీజ్ అయినప్పుడు ఒక విషయం చెప్పాను. కమల్ హాసన్ గారు చేసిన క్యారెక్టర్లు ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదు.
అయితే ఈ సినిమాతో నటుడిగా కాక పాత్ర పరంగా ఆయనకు రాని అదృష్టం నాకు వచ్చిందని భావిస్తున్నా. ఇందులో తరుణ్ భాస్కర్ గాయపడ్డాడు, నేను గాయపడ్డాను, ఇంకో సింహం కూడా గాయపడింది. ఆ సింహం ఎవరో త్వరలో రివీల్ చేస్తాం. ఇవన్నీ కలిసే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కథను చాలా కొత్తగా ప్రెజెంట్ చేశాడు కశ్యప్. తనకు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లు చేసిన అనుభవం ఉంది. తన స్టైల్ నాకు నచ్చింది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటాడు. రియలిస్టిక్, హిలేరియస్ హ్యూమర్‌తో సినిమా తీశాడు. ఇందులో నేను, తరుణ్ భాస్కర్, పవన్ సాధినేని లాంటి పలువురు దర్శకులు ఉన్నాం. అందుకే ఇది డైరెక్టర్స్ ఫిల్మ్. అయినా కశ్యప్‌కు మేం ఎలాంటి ఇన్‌పుట్స్ ఇవ్వలేదు. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. హీరో, విలన్ అని బేరీజు వేసుకోను. అలాగే కెరీర్‌లో ఎప్పుడూ గబగబా సినిమాలు చేయలేదు. కథ కొత్తగా ఉంటే చేస్తాను”.

