బీహార్‌లో సంకీర్ణ సర్కార్.. 

బీహార్‌లో సంకీర్ణ సర్కార్.. 

బీహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీతో బంధం తెంచుకున్న జేడీయూ నేత నితీష్ కుమార్.. ఆర్జేడీ, కాంగ్రెస్‌ పార్టీలతో కూడిన మహా కూటమితో జతకట్టారు. ఆ కూటమి సారథిగా నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ ఫాగూ చౌహాన్‌.. నితీష్ కుమార్ చేత ప్రమాణం చేయించారు. బీహార్‌ సీఎంగా నితీష్ బాధ్యతలు చేపట్టడం ఇది 8వ సారి. కూటమిలోని కీలక పార్టీ అయిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. 

అంతకుముందే ఏం జరిగిందంటే...?
బీహార్ లో జేడీయూ, బీజేపీ ప్రభుత్వ స్నేహానికి ఎండ్ కార్డ్ పడింది. నితీష్ కుమార్ బీజేపీతో తెగదెంపులు చేసుకునే ముందు..గవర్నర్ ను కలిసి తన రాజీనామా లేఖ సమర్పించారు. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలోనే నితీష్ ఆ పార్టీకి డిప్యూటీ సీఎం పదవితో పాటు పలు కేబినెట్ పోర్ట్ ఫోలియోలు ఇచ్చారు. అయితే.. ముఖ్యమంత్రిగా నితీష్ రాజీనామా చేయడంతో కేబినెట్ కూడా పూర్తిగా రద్దయ్యింది. తన మంత్రివర్గంలో ఉన్న బీజేపీ సభ్యుల పదవులు పోతాయి కాబట్టే నితీష్ వెళ్లి రాజీనామా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో పరిస్థితులపై కొద్ది రోజులుగా నితీష్ కుమార్ పార్టీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో చర్చలు నిర్వహించారు. రాజీనామా చేసే ముందు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ నేతలతో మంతనాలు జరిపారు. ఆ తర్వాతే రాజ్ భవన్ కు వెళ్లి రాజీనామా లేఖ ఇచ్చారు. ఎన్డీఏ నుంచి బయటకు రావాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలంతా తనకు సూచించారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని నితీష్ కుమార్ చెప్పారు. రాజీనామా చేసిన తర్వాత నేరుగా లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటికెళ్లి.. ప్రభుత్వ ఏర్పాటుపై తేజస్వి, తేజ్ ప్రతాప్ యాదవ్ తో నితీష్ కుమార్ చర్చించారు. గతంలో జరిగినవి మరిచిపోయి.. కొత్త అధ్యాయం మొదలుపెడతామని వారిని ఒప్పించారు. 

గతంలో ఆర్జేడీ, కాంగ్రెస్‌ తో కలిసి దోస్తీ
గతంలో ఆర్జేడీ, కాంగ్రెస్‌ తో కలిసి బీహార్‌ లో నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పుడు తేజస్వీ డిప్యూటీ సీఎంగా ఉండగా.. లాలూ మరో కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ మంత్రిగా పని చేశారు. వీరి దోస్తీ రెండేళ్లకే ముగిసిపోయింది. 2017లో ఆర్జేడీ, కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకున్న నితీష్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ, జేడీయూ కలిసి పోటీ చేశాయి. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలోని ఆర్జేడీ 75 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ, మ్యాజిక్ ఫిగర్ ని చేరుకోలేకపోయింది. దీంతో నితీష్ కుమార్, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 

కొద్దిరోజులుగా బీజేపీతో వైరం


కొద్దిరోజులుగా నితీష్ కుమార్, బీజేపీ మధ్య విభేదాలు పెరుగుతూ వచ్చాయి. తాను సీఎంగా ఉన్నా.. ప్రభుత్వాన్ని నడపడానికి తనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం లేదనే ఆవేదనతో నితీష్ ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతూ వచ్చారు. తనకున్న ఫేమ్ తో రాష్ట్రంలో బీజేపీ బలపడాలని చూస్తోందని, జేడీయూ కేడర్ ను తిప్పుకుంటోందనే విమర్శలు వచ్చాయి. 2025లో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అయితే ఆ లోపే బీజేపీ తమ అభ్యర్థిని సీఎం చేసేందుకు తెర వెనక ప్రయత్నాలు చేస్తుందనే ప్రచారం సాగింది. 

జేడీయూని వీడిన RCP సింగ్ 


బీహార్‌ అసెంబ్లీ స్పీకర్‌ గా ఉన్న బీజేపీ నాయకుడు విజయ్‌ కుమార్‌ సిన్హాను ఆ పదవి నుంచి తొలగించాలని నితీశ్ కుమార్ ప్రయత్నించారు. కానీ, అది సాధ్యపడలేదు. అప్పటి నుంచి భాగస్వామ్యపక్షాల మధ్య పోరు మొదలైంది. అంతేకాదు.. జేడీయూ నుంచి ఒక్కరికే కేంద్రమంత్రి పదవి ఇచ్చారు. RCP సింగ్ ను కేబినెట్ లోకి తీసుకున్నారు. అయితే.. ఇది నితీశ్ కుమార్ కు ఇష్టం లేకుండానే జరిగిందనే ప్రచారం ఉంది. బీజేపీ ముఖ్యనేతలతో RCP సింగ్ కు ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే కేంద్ర మంత్రి పదవి వచ్చిందని చెప్పారు. అందుకే ఆర్సీపీ సింగ్ ను రెండోసారి రాజ్యసభకు నితీష్ పంపలేదు. దీంతో ఆయన కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కేంద్రమంత్రి పదవి నుంచి దిగిపోయాక.. ఆర్సీపీ సింగ్ ఆస్తుల వివరాలు జేడీయూ అడిగింది. దీంతో ఆయన పార్టీని వీడారు. నితీశ్ కుమార్ పై, జేడీయూ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. 

ముఖ్య కార్యక్రమాలకు దూరంగా నితీష్
బీహార్ లో వరుస సంఘటనల తర్వాత నితీశ్ కుమార్ తన అసంతృప్తిని ప్రతిసారి వ్యక్తం చేస్తూనే వచ్చారు. కరోనా నియంత్రణపై సీఎంలతో మోడీ నిర్వహించిన సమావేశానికి దూరంగా ఉన్నారు. మోడీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్‌ భేటీకి హాజరుకాలేదు. జులై 17న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశానికి కూడా హాజరుకాలేదు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు వీడ్కోలు పలుకుతూ జులై 22న ప్రధాని మోడీ ఇచ్చిన విందుకు దూరంగా ఉన్నారు. కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారోత్సవంలోనూ నితీష్ పాల్గొనలేదు. చాలారోజులుగా బీజేపీతో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. కులాల వారీగా జనగణన, జనాభా నియంత్రణ, అగ్నిపథ్‌ పథకం వంటి కీలక అంశాల్లో కేంద్ర ప్రభుత్వంతో విభేదించారు. 

చిరాగ్ పాశ్వాన్ తోనూ నితీష్ కు వైరం


మరోవైపు లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ తో నితీశ్ కుమార్ కు పొసగడం లేదు. చాలా కాలంగా వీరిద్దరి మధ్య వైరం నడుస్తోంది. గత ఎన్నికల టైంలో ఇది క్లియర్ గా కనిపించింది. నితీశ్ కుమార్ కు వ్యతిరేకంగా చిరాగ్ పాశ్వాన్ ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ఓ వైపు జేడీయూతో స్నేహం కలిపిన బీజేపీ.. అటు చాలాసార్లు చిరాగ్ ను ఢిల్లీకి పిలిచి మాట్లాడారు. ఈ మధ్య బీజేపీ నేతలతో చిరాగ్ పాశ్వాన్ కనిపించడంతో.. ఏదో కుట్ర జరుగుతోందన్న భావన నితీశ్ కుమార్ కు కలిగిందనే చర్చ సాగింది. అందుకే బీజేపీతో దోస్తీకి గుడ్ బై చెప్పాలని ఫిక్స్ అయ్యి రాజీనామా చేశారు. తన పాత మిత్రులైన ఆర్జేడీ, కాంగ్రెస్ లతో జట్టు కట్టారు. 

నితీష్ కుమార్ ఎన్డీఏ నుంచి వెళ్లిపోవడంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆర్జేడీ అవినీతిపై మాట్లాడిన నితీశ్ కుమార్ ఇప్పుడు ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని కేంద్రమంత్రి ఆర్కే సింగ్ ప్రశ్నించారు. నితీశ్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. అధికారం కోసం విలువలు లేని రాజకీయ క్రీడ ఆడుతున్నారని ఆరోపించారు. మొదటి నుంచి నితీశ్ కుమార్ ను వ్యతిరేకిస్తున్న చిరాగ్ పాశ్వాన్.. ఆయనకు ఓ సవాల్ విసిరారు. నిజంగా జనబలం ఉంటే ఎన్నికలకు వెళ్లాలన్నారు. నితీశ్ తన నైతికత కోల్పోయారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో జేడీయూకు ఒక్క సీటు కూడా రాదన్నారు.

తేజస్వీ కుటుంబ సభ్యుల ఆనందం
నితీష్ కుమార్ .. ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో ఆనందం వెల్లువిరుస్తోంది. నితీష్ ముఖ్యమంత్రిగా, తేజస్వీ యాదవ్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి లాలూ కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు.