Moral Stories: కాళ్లను చూసి నేర్చుకోండి.. ఈర్ష్య... గర్వం రెండూ ప్రమాదమే

Moral Stories:  కాళ్లను చూసి నేర్చుకోండి.. ఈర్ష్య... గర్వం రెండూ ప్రమాదమే

‘నడుస్తున్న కాళ్లు మనకు ఎన్నో నేర్పిస్తాయి. ముందున్న కాలికి గర్వం లేదు తాను ముందు ఉన్నానని. వెనకున్న కాలికి అవమానం లేదు. తాను వెనుకబడ్డానని. ఎందుకంటే ఆ రెండింటికీ తెలుసు వాటి స్థానం క్షణాల్లో మారుతుందని. మానవ జీవితం కూడా అంతే...మన కన్నా ముందు ఉన్నవాళ్లను చూసి ఈర్ష్య పడకూడదు. మన కన్నా వెనుక ఉన్నవారిని చూసి గర్వపడకూడదు. రెండూ ప్రమాదమే. ఎందుకంటే అవి ఏ క్షణమైనా మారిపోవచ్చు’ అని పెద్దలు చెబుతారు.

మనిషి నడవాలంటే రెండు కాళ్లూ అవసరమే. ఒక కాలు ముందుకి, మరో కాలు వెనక్కి... తారుమారు అవుతూనే ఉంటాయి. రెండూ అవసరమే. రెండు కాళ్లను ముందుకు ఒకేసారి ఉంచలేము. అలాగే రెండు కాళ్లనూ ఒకేసారి వెనక్కి ఉంచలేము. కాని రెండు కాళ్లను నిటారుగా ఒకేసారి ఉంచగలము. అదే స్థితప్రజ్ఞత. కష్టసుఖాలను సమానంగా చూడటం.

పంచతంత్రంలోని ‘కుందేలు – తాబేలు కథ’ మనకు మంచి నీతిని బోధిస్తుంది.

ఒక అడవిలో కుందేలు తాబేలు ఉన్నాయి. అవి ఎంతో స్నేహంగా ఉంటూ ఆడుకునేవి. అయితే ఒకరోజు తాబేలుని చూసి కుందేలు వెక్కిరించింది. ‘‘నువ్వు ఇంత నెమ్మదిగా నడుస్తావు, అసలు ఎక్కడికైనా వెళ్ళగలవా? నాతో పందేనికి వస్తే, నిన్ను చాలా తేలికగా ఓడించేస్తాను’ అని విర్రవీగింది. కాని తాబేలు ఏమాత్రం బాధపడకుండా పరుగు పందేనికి అంగీకరించింది. వారి పందెం కోసం ఒకరోజును నిశ్చయించారు. ఆ పోటీ చూడటానికి అడవిలోని జంతువులన్నీ అక్కడ సమావేశమయ్యాయి.

 కుందేలు చాలా ధైర్యంగా ఉంది. పందెం జరిగే స్థలానికి  గర్వంతో విర్రవీగుతూ వచ్చింది. తాబేలు మాత్రం ఎంతో వినయంగా వచ్చింది. జరగబోయే పందెంలో ఎలా గెలవాలా అని ఆలోచిస్తూ.. అక్కడకు చేరుకుంది. ఇద్దరూ పందేనికి గీసిన గీతల మీద నిలబడ్డారు. కోతిని న్యాయనిర్ణేతగా పెట్టుకున్నారు. కోతి ఆదేశాల మేరకు తాబేలు, కుందేలు తమ పరుగు ప్రారంభించాయి. కుందేలుకి తాను గెలుస్తానన్న ధీమా ఎక్కువగా ఉండటంతో, నెమ్మదిగా నడుస్తూ, కొంత దూరం వెళ్లాక వెనక్కు తిరిగి చూసింది.

►ALSO READ | అడివంతా వెలుగంట: ఎవరు పని వారు చేస్తారు.. అడ్డుకుంటే ఇబ్బందులే..

 కనుచూపు మేరలో తాబేలు కనపడలేదు. ఇక తాబేలు ఓడిపోతుందిలే అనే నిర్లక్ష్యంతో కుందేలు కొద్దిసేపు చెట్టు నీడలో నిద్రించింది. తాబేలు మాత్రం తన లక్ష్యం మీద మనస్సు కేంద్రీకరించి, నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి, కుందేలు నిద్రిస్తున్న చెట్టును దాటేసింది. అలా గమ్యం చేరుకుంది. కుందేలు ఇంకా నిద్రపోతూనే ఉంది. 

కుందేలు మేల్కొని పరుగుపరుగున వచ్చేసరికి తాబేలు గెలిచేసింది. చుట్టూ చేరిన జంతువులన్నీ తాబేలుని అభినందించాయి. తాబేలు గర్వించలేదు, అలాగే తాను తక్కువ అని బాధ పడనూ లేదు. లక్ష్య సాధన మీద మాత్రమే మనసు లగ్నం చేసింది. అందుకే మన వెనక ఉన్న వారిని చూసి గర్వపడద్దు అన్నారు పెద్దలు.

ఇటువంటిదే రామాయణంలో వాలి కథ...

వాలికి వెయ్యి ఏనుగుల బలం ఉందని చెబుతారు. అంతటి మహాయోధుడైన వాలి... మరింత బలం ఉన్న లంకానగరాధిపతి రావణాసురుడిని చంకలో పెట్టుకుని గిరగిర తిప్పేశాడు. అంతటి బలశాలి వాలి. తన బలం చూసుకుని వాలి విర్రవీగేవాడు. తనను ఎదుర్కొని, ఓడించే శక్తి ఎవ్వరికీ లేదని అహంకారంతో మెలిగేవాడు. ఆ వాలి తన సోదరుడైన సుగ్రీవుని మీద కోపగించుకుని రాజ్యం నుండి వెళ్లగొట్టాడు. అప్పుడు సుగ్రీవుడు ఋశ్యమూక పర్వతం మీద తల దాచుకున్నాడు.

 సీతాదేవిని అన్వేషిస్తూ రామలక్ష్మణులు ఋశ్యమూక పర్వత ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ రామునికి సుగ్రీవునితో మైత్రి ఏర్పడింది. సుగ్రీవుడు.. తన అన్న వాలి నుంచి తనకు ముప్పు ఉందని, ఆ వాలిని సంహరిస్తే సీతాదేవిని వెతికి అప్పగిస్తానని వాగ్దానం చేశాడు. అంగీకరించాడు రాముడు. వాలిసుగ్రీవులను యుద్ధం చేయమన్నాడు.

 ఆ యుద్ధంలో వాలిని యమసదనానికి పంపాడు రాముడు. అంతటి రావణాసురుడిని చంకలో పెట్టుకుని గిరగిరా తిప్పిన వాలిని, మానవమాత్రుడైన రాముడు సంహరించాడు. తలను తన్నేవాడు ఒకడుంటే.. తాడిని తన్నేవాడు మరొకడు ఉంటాడనే సామెత తెలిసిందే. మహాబలవంతుడైన రావణాసురుడిని ఒంటి చేత్తో ఎత్తేసిన వాలిని, రాముడు ఒక్క బాణంతో సంహరించాడు. అందువల్ల మనిషి ఎక్కడా అహంకారం లేకుండా  స్థితప్రజ్ఞతతో వ్యవహరించాలని ఇటువంటి కథలు మనకు బోధిస్తున్నాయి.

- డా. పురాణపండ వైజయంతి-