
రుద్రవనం అనే ఊరి దగ్గర్లోని అడవిలో ఉండే రకరకాల జంతువులు ఉండేవి. ఆ అడవిలో ఒక్కోసారి ఒక్కో చోట రాత్రుళ్లు వెలుతురుతో నిండిపోతూ ఉండేది. ఆ వెలుతురులో వేటగాళ్లు జంతువులను వేటాడేస్తూ ఉండేవారు. ఆ వెలుగుకు కారణం అధిక సంఖ్యలో ఉన్న మిణుగురు పురుగులు! ప్రతిరోజు ఈ ఇబ్బందిని భరించలేక అడవిలో ఉన్న జంతువులన్నీ ఒకరోజు మృగరాజు వద్దకు వెళ్లి తమ గోడు వినిపించుకున్నాయి. దాంతో ‘‘రాబోయే పౌర్ణమి నాడు సమావేశంలో ఈ సమస్య గురించి ప్రస్తావిద్దాం’’ అన్నాడు మృగరాజు.
ఆరోజు రానే వచ్చింది. జంతువులన్నీ సమావేశానికి హాజరయ్యాయి. అయితే మిణుగురు పురుగులు మాత్రం రాలేదు. దాంతో కొంగ వాటిని వెతుకుతూ కొంతదూరం వెళ్లిన తర్వాత దూరంలో సమావేశమైన మిణుగురులు కనిపించాయి. వాటి దగ్గరకు వెళ్లి ‘‘ఏంటి మీరు ఇక్కడ సమావేశం అయ్యారు? మృగరాజు మనందరికి సమావేశం ఏర్పాటు చేశారు కదా?’’ అంది కొంగ.
‘‘లేదు లేదు మిత్రమా మేమంతా వస్తున్నాం’’ అన్నాయి మిణుగురులు. ‘‘త్వరగా రండి అందరూ వచ్చేశారు. మీ కోసం ఎదురుచూస్తున్నారు’’ అని చెప్పి వెళ్ళిపోయింది కొంగ. దాంతోపాటే మిణుగురులు కూడా సమావేశ ప్రాంతానికి చేరుకున్నాయి.‘‘ఏంటి సమావేశానికి ఆలస్యంగా వచ్చారు? ఏమిటి మీ ఉద్దేశం’’ అని కోపంగా గర్జించాడు మృగరాజు. ‘‘క్షమించండి మృగరాజా.. మేము మీ ముందు ఒక విషయం చెప్పాలని నిర్ణయించుకుని దాని విషయమై చర్చించుకున్నాం. అందుకే ఆలస్యమైంది’’ అన్నాయి.
‘‘ఏమిటా విషయం?” అడిగాడు మృగరాజు. ‘‘అదే మృగరాజు ఈ అడవిలో ఉంటున్న మా జాతి అంతా ఈ అడవిని వదిలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాం’’ అనగానే మృగరాజుతో సహా అక్కడ ఉన్న జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. ‘‘ఎందుకు వెళ్లిపోవాలనుకుంటున్నారు?’’ అని అడిగాడు మృగరాజు. ‘‘మృగరాజా.. ప్రతిరోజు రాత్రిపూట మా నుంచి వచ్చే వెలుగు వల్ల అడవిలో ఉన్న చాలా జీవులు వేటగాళ్లకు చిక్కుతున్నాయి.
చాలా జంతువులు మమ్మల్ని తిట్టుకుంటున్నాయి. ఆ విషయం మేము గమనించాం. ఇతరులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు లేదు కనుక మేము వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాం’’ అన్నాయి. ‘‘కనీసం కొంతమంది అయినా ఉండండి’’ అన్నాడు మృగరాజు. ‘‘లేదు రాజా మేము ఎక్కడ ఉన్నా అందరం కలిసే ఉంటాం. మాకు అనుకూలమైన అడవికి వెళ్తాం.. సెలవు’’ అని వెళ్ళిపోయాయి. వారు అనుకున్నది ఇబ్బంది లేకుండా జరిగేసరికి జంతువులన్నీ ఆనందపడిపోయాయి.
కొన్నిరోజులు గడిచాయి. అడవిలో ఉన్న జంతువులన్నీ మరో కొత్త సమస్యతో బాధపడసాగాయి. అవన్నీ కలిసి మళ్ళీ మృగరాజు వద్దకు వెళ్లి మృగరాజుకు తమ సమస్యను చెప్పాయి.‘‘సమూహంలో కలిసి ఉన్నప్పుడు ఇతరుల వల్ల కొన్ని లాభ నష్టాలు ఉంటాయి. వాటిని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. లాభం ఉన్నప్పుడు బాగుంది కదా అని ఉంచుకుని, నష్టాలు వచ్చినప్పుడు వారిని తిట్టడం వారిని దూరంగా పంపించడం మంచి పద్ధతి కాదు’’ అని హితవు పలికాడు మృగరాజు.
ఇంతకీ జంతువులు మృగరాజుకు ఏం చెప్పాయంటే ? ‘‘వెలుగు లేకపోవడం వలన రాత్రి చీకట్లో జంతువులన్నీ ముళ్ళకంచెల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఊబి, గుంటల్లో పడిపోతున్నాయి. కనుక మీరు మన అడవి నుంచి వెళ్ళిపోయిన మిణుగురులను తిరిగి రప్పించండి” అని ప్రాధేయపడ్డాయి. ‘‘చూడండి మిత్రులారా! ఈ లోకంలో అన్ని జీవులకు జీవించే హక్కు ఉంది. వాటికి అనుగుణంగా మనం సర్దుకుపోవాలి’’ అని మృగరాజు హిత బోధ చేశాడు.
కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రాత్రి మిణుగురులను తిరిగి అడవికి వచ్చేశాయి. దగ్గరగా వచ్చిన మిణుగురులకు స్వాగతం పలుకగా ‘‘మిత్రులారా మేము కూడా ఇకనుంచి ఈ అడవిలో ఒకే చోట ఉంటాం. దానివల్ల మీకు ఇబ్బంది ఉండదు. మాకు ఇబ్బంది ఉండదు. మేము ఎక్కడికి వెళ్లి ఈ సమస్య మాతోనే వస్తుంది. అందుకని ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టి మన అడవికి తిరిగి వచ్చేశాం’’ అన్నాయి మిణుగురులు. మిణుగురులు తిరిగి రావడంతో జంతువులన్నీ ఆనందించాయి.