మే 17న జేఈఈ అడ్వాన్స్డ్.. ఏప్రిల్ 23 నుంచి రిజిస్ట్రేషన్లు షురూ

మే 17న జేఈఈ అడ్వాన్స్డ్.. ఏప్రిల్ 23 నుంచి రిజిస్ట్రేషన్లు షురూ
  • జూన్ 1న ఫలితాలు.. 2 నుంచి జోసా కౌన్సెలింగ్
  • పూర్తి షెడ్యూల్ విడుదల చేసిన ఐఐటీ రూర్కీ

హైదరాబాద్, వెలుగు: దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘జేఈఈ అడ్వాన్స్డ్–2026’ పూర్తి షెడ్యూల్ రిలీజ్ అయింది. వచ్చే ఏడాది మే 17న ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ఐఐటీ రూర్కీ ప్రకటించింది.

జేఈఈ మెయిన్స్ ఫలితాలు వచ్చిన వెంటనే.. అర్హత సాధించిన అభ్యర్థులకు ఏప్రిల్ 23 నుంచి అడ్వాన్స్ డ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలుకానున్నది. ఈ మేరకు పూర్తి స్థాయి ఎగ్జామ్ షెడ్యూల్ ను ఐఐటీ రూర్కీ రిలీజ్ చేసింది.

జేఈఈ మెయిన్స్–2026లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఏప్రిల్ 23 ఉదయం 10 గంటల నుంచి మే 2 రాత్రి 11.59 గంటల వరకు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఫీజు చెల్లించడానికి మే 4 వరకు గడువు ఇచ్చారు.

మే 11 నుంచి 17వ తేదీ వరకు వెబ్‌‌‌‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. మే17న 2 సెషన్లలో పరీక్ష జరగనున్నది. పేపర్ 1 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటుంది. 

జూన్ 1న రిజల్ట్స్
పరీక్ష ముగిసిన తర్వాత మే 21న రెస్పాన్స్ షీట్లు, మే 25న ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల చేయనున్నారు. దీనిపై అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం.. జూన్ 1న ఫైనల్ ఆన్సర్ కీతో పాటు జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలను రిలీజ్ చేయనున్నారు.

రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజు నుంచే.. అంటే జూన్ 2 నుంచే జాయింట్ సీట్ అలోకేషన్ (జోసా) ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఆర్కిటెక్చర్ చేయాలనుకునే వారికి జూన్ 4న ‘ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఆట్)’ నిర్వహిస్తారు. దీని ఫలితాలు జూన్ 7న వస్తాయి.