గంజాయి మత్తులో..తల్లిని చంపిన పెంపుడు కొడుకు

గంజాయి మత్తులో..తల్లిని చంపిన పెంపుడు కొడుకు
  • జీడిమెట్లలో ఘటన

జీడిమెట్ల, వెలుగు : మూడు నెలల పసికందును తెచ్చి 32 ఏండ్లు పెంచితే అన్నంపెట్టిన తల్లినే దారుణంగా చంపాడో పెంపుడు కొడుకు. జీడిమెట్లలోని కుత్బుల్లాపూర్​ గ్రామానికి చెందిన పెద్ది జయమ్మ (63), పెద్ది స్వామి దంపతులకు ఐదు మంది ఆడపిల్లలు. ఇక, మగపిల్లలు పుట్టరని భావించిన దంపతులు.. వృద్ధాప్యంలో  తమకు అండగా ఉంటాడని 3 నెలల పసికందు అయిన వేణును తెచ్చి పెంచుకున్నారు.  ఆ తర్వాత వారికి మగబిడ్డ పుట్టినా వేణును అందరితోపాటు సమానంగా పెంచారు. 

వేణును జయమ్మ అల్లారుముద్దుగా 32 ఏండ్లు పెంచి పెండ్లి కూడా చేసింది. అతనికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఆ ముసలి దంపతులకు అండగా నిలవాల్సిన వేణు మాత్రం గంజాయికి బానిసయ్యాడు. నిత్యం తల్లిదండ్రులు, భార్యతో గొడవడేవాడు. దాంతో అతని భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. అయినప్పటికీ వేణు మారలేదు. డబ్బుల కోసం తల్లిదండ్రులతో తరుచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి గంజాయి తాగి మత్తులో ఇంటికి వచ్చి డబ్బుల కోసం తల్లిని వేధించాడు. 

జయమ్మను విచక్షణారహితంగా కొట్టి, డోరు వెనుక వైపు ఉంచే ఇనుప చువ్వతో ఆమె తలలో పొడిచి హత్యచేశాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా.. జయమ్మ సొంత కొడుకు వినోద్​ (24) ఏడాదిన్నర క్రితం అదృశ్యమయ్యాడు. ప్రస్తుతం వేణు పెంపుడు తల్లిని హత్య చేయడంతో వినోద్​ను కూడా అతడే  ఏమైనా చేశాడా? అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.