నిర్వాసితులకు అండగా ఉంటాం.. పేదల భూములు కార్పొరేట్లకు అప్పగిస్తున్న కేసీఆర్

నిర్వాసితులకు అండగా ఉంటాం.. పేదల భూములు కార్పొరేట్లకు అప్పగిస్తున్న కేసీఆర్

జగదేవపూర్ (వర్గల్) వెలుగు:  పేదల భూములను  కార్పొరేట్ సంస్థలకు  కట్టబెట్టి సీఎం కేసీఆర్ సొమ్ము చేసుకుంటున్నారని  ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విమర్శించారు. వర్గల్ మండలంలోని అవుసులోనిపల్లి,  రామక్కపేట, నగరం తండాలో నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీటీసీ యాదయ్య ఆధ్వర్యంలో చేస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటించారు. శుక్రవారం   కాంగ్రెస్​కిసాన్ సెల్  జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి , పీసీసీ కార్యదర్శి ప్రమోద్ కుమార్ , సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డితో కలిసి ఆందోళనకారులతో మాట్లాడారు.  కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో పేదలకు  భూములు పంచామని,  ఆ భూములను  ప్రభుత్వం లాక్కుని పేదలను  నిరాశ్రయులను చేస్తోందని ఆరోపించారు.

వైస్సార్ సీఎంగా ఉన్నప్పుడు  ఉమ్మడి మెదక్ జిల్లాలో 24 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు పంచామని, ఆభూములపై  ప్రస్తుతం  కేసీఆర్ కన్ను పడిందన్నారు.  వ్యవసాయ అనుబంధ పరిశ్రమల  పేరిట వర్గల్ ప్రాంతంలో సుమారు 1,500 ఎకరాల భూమిని  సేకరించి తన అనుచరులకు కట్టబెడుతున్నారని విమర్శించారు .  ఈ భూముల్లోకి  ఎవరినీ  అడుగుపెట్టనీయవద్దని , 4నెలల తర్వాత  కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతులకు ఆ భూములను తిరిగి అప్పగిస్తామని చెప్పారు.    అభివృద్ధి పేరిట రాష్ట్రాన్ని  కేసీఆర్ అప్పుల పాలు చేశారని,   వారి కుటుంబం  మాత్రం లక్షల కోట్లు సంపాదించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ నాయకులు  నాయిని యాదగిరి,  గోపాలరావు ,  ప్రభుదాస్ గౌడ్ ,  సందీప్ రెడ్డి , మోహన్  తదితరులు పాల్గొన్నారు .