వరదలతో రాష్ట్రవ్యాప్తంగా 10 వేల కోట్ల నష్టం: జీవన్ రెడ్డి

వరదలతో రాష్ట్రవ్యాప్తంగా 10 వేల కోట్ల నష్టం: జీవన్ రెడ్డి
  • పోయినేడు ప్రకటించిన పరిహారం ఇంకా ఇవ్వలేదని ఫైర్ 
  • వరద సాయానికి రూ.500 కోట్లిచ్చినం: మంత్రి ప్రశాంత్​ రెడ్డి
  • గ్రేటర్ వరంగల్ లో ఆక్రమణలు తొలగించాలి: కడియం 
  • మండలిలో వరదలపై వాడీవేడి చర్చ

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. వానలు, వరదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.10 వేల కోట్ల నష్టం జరిగిందని ఆయన చెప్పారు. చైర్మన్‌‌ గుత్తా సుఖేందర్‌‌ రెడ్డి అధ్యక్షతన మండలి సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు వర్షాలు, వరదలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. వర్షాలు, వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత రైతులను ఆదుకోవాలని కోరారు. ‘‘పోయినేడాది వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. 

గతేడాది జులై 17న సీఎం కేసీఆర్ భద్రాచలంలో పర్యటించి రూ.వెయ్యి కోట్లు విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు” అని ఫైర్ అయ్యారు. వానలకు దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జీలు, కల్వర్టుల రిపేర్లు వెంటనే చేపట్టాలని.. ఇండ్లు కూలిపోయిన పేదలకు కొత్తవి కట్టివ్వాలని డిమాండ్ చేశారు. కడెం ప్రాజెక్టుకు అదనపు గేట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆ సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతున్నదని, నిధులు ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. 

నాలాల విస్తరణ చేపట్టాలి: కడియం 

వరంగల్, హనుమకొండ జంట నగరాల్లో నాలాలు ఆక్రమణకు గురయ్యాయని.. వాటిని తొలగించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కోరారు. ‘‘చిన్న వర్షాలకు కూడా వరంగల్ ముంపునకు గురవుతున్నది. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. ఆక్రమణలు తొలగించి నాలాల విస్తరణ చేపట్టాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలి. ఇందుకోసం అవసరమైతే భూసేకరణ చేయాలి” అని సూచించారు. వర్షాలు, వరదల వల్ల ఇండ్లు కోల్పోయిన బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వరదలకు భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి ఆగమైందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నయ్: తాతా మధు 

వరద సహాయ కార్యక్రమాలపైనా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఎమ్మెల్సీ తాతా మధు మండిపడ్డారు. ‘‘ఖమ్మంలో మున్నేరుకు ఎన్నడూ లేని రీతిలో ఈసారి వరద వచ్చింది. కానీ ప్రతిపక్షాలు కనీసం వరద బాధితులను పరామర్శించలేదు. భద్రాచలం ప్రాంతంలో వరద ప్రభావం తగ్గిన తర్వాత వెళ్లి.. ఫొటోలకు పోజులిచ్చి, సెల్ఫీలు దిగారు” అని విమర్శించారు. ఖమ్మంలో పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఫోన్ లో వివరాలు తెలుసుకున్నారని చెప్పారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ నిధులను కేంద్ర ప్రభుత్వం సక్రమంగా విడుదల చేయాలని కోరారు. 

 కేంద్రం నిధులివ్వాలి: నర్సిరెడ్డి 

డిజాస్టర్ మేనేజ్ మెంట్ నిధులను కేంద్రం వెంటనే విడుదల చేయాలని టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ‘‘రాష్ట్రం దగ్గర రూ.800 కోట్ల విపత్తు నిధులు ఉన్నాయి. కానీ అందులో కేవలం 10 శాతం (రూ.80 కోట్లు) మాత్రమే వాడుకునే వీలుంటుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. గుజరాత్ లో వరదలొస్తే ప్రధాని మోడీ,  అమిత్ షా వెళ్లారు. కానీ తెలంగాణకు ఎందుకు రాలేదు. ఇక్కడికి రాకపోయినా ఫర్వాలేదు.. కానీ సాయం చేయాలి” అని కోరారు.