ఎన్నికల్లో ఓట్ల కోసమే జీవన్ రెడ్డి మౌనం : ధర్మపురి అర్వింద్​

 ఎన్నికల్లో ఓట్ల కోసమే జీవన్ రెడ్డి మౌనం : ధర్మపురి అర్వింద్​
  •  అవినీతికి అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

నిజామాబాద్​: ఇతర దేశాలకు చెందిన ముస్లింలకు మనం పౌరసత్వం ఇస్తే ప్రత్యేకంగా ముస్లిం దేశాలు ఎందుకు ఉన్నట్లు అని  బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్​అన్నారు. ఇవాళ ఉదయం ఆర్మూర్ పట్టణంలో మనది మోదీ కుటుంబంలో భాగంగా  చాయ్​పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఏఏను 2019లో తెస్తే కాంగ్రెస్ లొల్లి పెట్టిందన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముస్లింలకు సైతం పౌరసత్వం ఇవ్వాలని ఆందోళన చేశాడన్నారు.

 కానీ ఇప్పుడు సీఏఏ అమలు చేస్తుంటే ఎన్నికలు ఉన్నాయని హిందువుల ఓట్ల కోసం జీవన్ రెడ్డి మౌనంగా ఉన్నాడని విమర్శించారు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కింద  నిజామాబాద్ జిల్లాకు పసుపు, జగిత్యాల జిల్లాకు మామిడిని ఎంపిక చేశామని తెలిపారు. ఈ రెండు పంటల ఎగుమతులపై కేంద్రం చర్యలు తీసుకుందన్నారు. పసుపును ఇతర దేశాలకు ఎగుమతి చేయడంతో మంచి ధర లభించిందన్నారు.

 పసుపు బోర్డు వస్తే విత్తనాలు, భూసార పరీక్షలు, గోదాములు, పసుపు శుద్ది కర్మాగారాలు మొదలైనవి వస్తాయన్నారు.  రైతుల కోసం మోదీ అనేక చర్యలు తీసుకున్నాడన్నారు.  అవినీతి కారణంగానే చక్కెర పరిశ్రమలు తెరుచుకోవడం లేదన్నారు.  మోదీ రాక ముందు వరికి మద్దతు ధర రూ.1,300 ఉంటే.. ఇపుడు రూ.2 వేలు దాటిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి కొమ్ము కాస్తోందని ఆరోపించారు.

 ఆర్మూర్ లో  జీవన్ మాల్ విషయంలో అధికారం వచ్చిన వెంటనే నోటీసులు ఇచ్చి  హడావుడి చేశారని,  కాంగ్రెస్ నాయకులు, అధికారులకు కొంచెం చెల్లించగానే మళ్లీ సప్పుడు చేయడం లేదన్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డు తెలంగాణా లోనే పెద్దదని కానీ ఒక్క సౌలత్ ఏర్పాటు చెయ్యలేదని ఆయన విమర్శించారు.