
సాక్రమెంటో (కాలిఫోర్నియా) : సముద్రాల్లో వందల ఏళ్లు జీవించే జీవరాశుల జాబితాలో జెల్లీ ఫిష్ లు కూడా ఉంటాయి. ఏమైందో.. ఏమో.. అచ్చం బ్లూ జెల్లీఫిష్ను తలపించే కొన్ని జలచరాలు అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న పలు సముద్రతీరాలకు వేలాదిగా కొట్టుకొచ్చి చనిపోయాయి. వీటి సైంటిఫిక్పేరు ‘వెలెల్లా వెలెల్లా’ కాగా .. ప్రజలు మాత్రం ‘బై ది విండ్ సెయిలర్’ అని పిలుస్తుంటారని జువాలజిస్టులు చెప్పారు. ఇవి జెల్లీ ఫిష్ జాతికి చెందినవేనన్నారు. అయితే ‘బై ది విండ్ సెయిలర్స్’ వాటికి ఉండే టెంటకిల్స్ (స్పర్శకాలు)ను మనుషులను కుట్టడానికి వాడవని.. నాచు, చేపల గుడ్లను సేకరించి నోటిదాకా అందించడానికి వినియోగిస్తాయని తెలిపారు. ‘బై ది విండ్ సెయిలర్స్’ వాటి పేరుకు తగ్గట్టుగానే.. బలమైన గాలులతో సముద్రంలో తుఫానులు, టోర్నడోలు సంభవించినప్పుడు ఈవిధంగా తీర ప్రాంతాలకు కొట్టుకొచ్చి చనిపోతుంటాయని చెప్పారు.