
వింతలు అనగానే ప్రపంచంలో ఉన్న ఏడు వింతలు గుర్తొస్తాయి. ప్రపంచ వింతలన్నీ ఏదో ఒక గొప్ప చరిత్ర గురించి తెలియజేస్తాయి. ప్రపంచ ఏడు వింతలు కూడా నిర్జీవాలే కాకుండా అన్నీ మానవ నిర్మితాలు. కాని మానవులే తమకున్న సహజత్వానికి తోడుగా ప్రత్యేకంగా అద్భుతాలను సృష్టిస్తే మనం వారిని వింతగా చూస్తుంటాం. ఈ ప్రపంచంలో తమకంటూ ఓ ప్రత్యేకత ఉండాలనే తాపత్రయంతో వీరు చేసిన నమ్మలేని అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా ఓ మహిళ 13 బొమ్మలకు తల్లి అయింది. అంతేకాదు ఆ పిల్ల బొమ్మలకు లక్షల రూపాయిలు వెచ్చించింది. నిత్యం చిన్న పిల్లలకు డైపర్లు మార్చినట్టే తూర్పు లండన్ లో నివసించే బొమ్మల పిల్ల తల్లి జెస్ ఎల్లిస్ డాల్స్ బేబీస్‌కు డైపర్లు మార్చి ముద్దాడుతుంది.
తూర్పు లండన్ లో నివసించే జెస్ ఎల్లిస్ ఓ కార్పొరేట్ కంపెనీలో HR గా పనిచేస్తుంది. HR అంటే కంపెనీలో కీలకమైన ఉద్యోగం. ప్రతి ఒక్క ఉద్యోగితో ఆమెకు సంబంధాలుంటాయి. అయితే ఆమె ఓ వింత కేసును వెలుగులోకి తెచ్చింది. ఆమెకు బొమ్మలంటే పిచ్చో.... ప్రాణమో తెలియదు కాని .. ఈమె ఏకంగా 13 బేబీ డాల్స్ ను లక్షల రూపాయిలు వెచ్చించి కొనుగోలు చేసింది. జెస్ ఎల్లిస్ ఫస్ట్ కొన్న బొమ్మకు 25 వేల రూపాయిలకు పైగా ఖర్చు చేసి దానికి రెబక్కా అనే పేరు పెట్టింది. ఆ తరువాత మరికొన్ని బొమ్మలను కొనుగోలు చేసింది. వాటికి షామ్, బ్రూక్లిన్, జాన్, లిల్లీ, అన్నలీస్, అరియా, కుకీ, చార్లీ, పిప్పా , జూన్ అని ఇలా పేర్లు పెట్టింది. ఈ బొమ్మలను కొనేందుకు ఆమె £6,000 (రూ. 6 లక్షల 18 వేలకు పైగా) వెచ్చించింది. వాటిలో అత్యంత ఖరీదైన బొమ్మ కుకీ ని £1,700 (రూ. లక్ష 75వేలకు పైగా) కు కొనుగోలు చేసింది.
జెస్ ఎల్లిస్ కొన్న బేబీ బొమ్మలను తన స్వంత పిల్లల మాదిరిగా చూసుకుంటుంది. రోజు వాటికి డైపర్లు మార్చడం.. వాటితో ఆడుకోవడం.. వాటికి కథలు చెప్పడం వంటివి చేస్తుంది.తాను బయటకు వెళ్లినప్పుడు బేబీ డాల్స్ ను కూడా తీసుకెళ్తుంది. జెస్ ఎల్లిస్ మే 2020 నుంచి బొమ్మలను సేకరించడం మెదలు పెట్టింది. జెఎస్ ఎల్లిస్ తనకు కాబోయే భర్త అఅవేరీ రాసెన్ పేస్ట్రీ చెఫ్ తాను బొమ్మల తల్లిని అని చెప్పింది. దీంతో ఆయన కూడా బేబీ బొమ్మలకు డైపర్లు మార్చడంలో సహాయపడతాడని తెలిపింది. తనకు పిల్లలంటే చాలా ఇష్టమని... బిడ్డను ఒడిలో పెట్టుకోవడం వల్ల ఎంతో ప్రశాంతత లభిస్తుందని జెస్ అంటున్నారు. తన తండ్రి ఆండ్రూ దీనిని వింతగా భావించినా.. తన ఆనందం చూసి తాను కూడా సంతోషపడతాడని తెలిపింది.
జెస్ తన ఇష్టాన్ని పార్ట్ టైమ్ జాబ్ గా మార్చుకుంది. ఆమె బొమ్మలను తయారు చేస్తూ ఆన్ లైన్ లో విక్రయించడం మొదలు పెట్టింది. అయితే ఒక బొమ్మను తయారు చేయడానికి మూడు వారాలు పడుతుందని తెలిపింది. ఆమె బొమ్మలను విక్రయించి £2000 ( రూ. 2 లక్షల 06 వేలకు పైగా) సంపాదించింది.