రవీంద్ర భారతిలో ఈశ్వరీబాయి జయంతి వేడుకలు

రవీంద్ర భారతిలో ఈశ్వరీబాయి జయంతి వేడుకలు

హైదరాబాద్ : జెట్టి ఈశ్వరీబాయి 104 వ జయంతి వేడుకలను రవీంద్రభారతిలో నిర్వహించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్  ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, మాజీ మంత్రి గీతారెడ్డి (ఈశ్వరీబాయి కూతురు)తో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా హాజరయ్యారు. ప్రముఖ సామాజిక వేత్త  కేకే రాజాకు ఈశ్వరీబాయి మెమోరియల్ అవార్డును ప్రదానం చేశారు. 

మహిళలకు స్వేచ్ఛ ఉంటేనే అన్ని రంగాల్లోనూ రాణించగలరని తమ తల్లి నమ్మేవారని ఈశ్వరీబాయి ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌ జే.గీతారెడ్డి చెప్పారు. ఇవాళ మహిళలకు అన్ని రంగాల్లో సమాన హక్కులు, ప్రాధాన్యత లభిస్తుందంటే ఈశ్వరీబాయి లాంటి వాళ్లు నమ్మిన, ఆచరించిన సిద్దాంతాలే కారణమని అన్నారు. తమ తల్లి ఈశ్వరీబాయి జయంతికి హాజరైన వారికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. 

ప్రజాప్రతినిధిగా ఉన్న సమయంలో ఈశ్వరీబాయి చేసిన సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని, దానిలో భాగంగానే ఆమె జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేశారు. దళిత వర్గాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో చేశారని చెప్పారు.