
- కామారెడ్డి జిల్లాలో 18 కొనుగోలు సెంటర్లు
- క్వింటాల్ ధర రూ.2,400
కామారెడ్డి, వెలుగు : పంట దిగుబడులు రైతుల చేతిలోకి రాగానే మార్కెట్లో ధరలు తగ్గుతున్నాయి. సమస్యను అధిగమించి రైతులకు మద్దతు ధర దక్కేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మక్క రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా ప్రభుత్వం మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు సెంటర్లు ప్రారంభించనుంది. కామారెడ్డి జిల్లాలో 18 సెంటర్ల ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదించారు.
ప్రభుత్వం కూడా సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. మద్దతు ధర క్వింటాల్‌కు రూ,2,400 ఉంది. సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన ఆదేశాలు 2 రోజుల్లో రానున్నట్లు అధికారులు చెబుతున్నారు.
47,515 ఎకరాల్లో సాగు..
వానాకాలం సీజన్లో కామారెడ్డి జిల్లా లో 47,515 ఎకరాల్లో మక్క సాగైంది. ఇప్పటికే పంట కోతకు వచ్చింది. పలు ఏరియాల్లో మక్క పంట కోసి అరబోస్తున్నారు. పంట ఉత్పత్తులు నిల్వ ఉంచుకునే సౌకర్యాలు లేక వెంటనే అమ్మేస్తున్నారు.
ఇదే అదునుగా భావించి వ్యాపారులు తక్కువ ధరకు కొంటున్నారు. క్వింటాల్‌కు రూ. 200 నుంచి రూ.300 వరకు తగ్గుతుంది. ప్రభుత్వ కొనుగోలు సెంటర్లు ఏర్పాటైతే రేటు పెరిగే అవకాశం ఉంది. ఇటీవల రాష్ర్ట మంత్రి, అధికారులు సమీక్షించారు. ఆయా చోట్ల సెంటర్లు ఏర్పాటు చేయటానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు . ఏ ఏరియాలో ఏర్పాటు చేయాలనే దానిపై ప్రపోజల్స్ పంపాలని మార్క్ఫెడ్ అధికారులకు సూచించారు. దిగుబడులు వచ్చే ఏరియాల్లో సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
సెంటర్లు ఏర్పాటు చేసే ప్రాంతాలు..
బాన్సువాడ మండలం హన్మాజీపేట, బిచ్కుంద మండలం పుల్కల్, పెద్దకొడప్గల్ మండలం పెద్ద కొడప్గల్, పిట్లం మండలంలోని మార్కెట్ కమిటీ, భిక్కనూరు మండలంలోని అంతంపల్లి, బస్వాపూర్, మాచారెడ్డి మండలం సోమార్ పేట, రాజంపేట మండలంలో ఆర్గొండ, రాజంపేట, గాంధారి మండలంలోని మార్కెట్‌యార్డు, ముదోలి, సదాశివనగర్ మండలం భూంపల్లి, ఉత్తునూర్, సదాశివనగర్, తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్, దేమికలాన్, తాడ్వాయిల్లో సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు.
నిజామాబాద్ జిల్లాలో 26 సెంటర్లు
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో వానాకాలం 52 వేల ఎకరాల్లో మక్క జొన్న సాగైంది. ఎకరానికి 18 క్వింటాళ్ల దిగుబడి ప్రకారం 9.36 లక్షల క్వింటాళ్ల మక్కల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకుగాను 26 కొనుగోలు సెంటర్లను గురువారం ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో 44 సెంటర్లు..
నిజామాబాద్ జిల్లాలో 52 వేల ఎకరాలు, కామారెడ్డి జిల్లాలో 51 వేల ఎకరాల్లో మక్కజొన్న సాగైంది. రెండు జిల్లాల్లో మక్క కోతలు ప్రారంభమయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 18, నిజామాబాద్ జిల్లాలో 26 సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే ప్రారంభిస్తాం. మిగితా మొత్తాన్ని మార్క్‌ఫెడ్‌తో కొనుగోలు చేయడానికి సెంటర్లు ఓపెన్ చేస్తున్నం. 90 రోజులు సెంటర్లు నడుపుతాం. మహేశ్‌కుమార్, డీఎం, మార్క్ ఫెడ్