
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే మరోవైపు కొన్నేండ్ల నుంచి ఆహ్లాదాన్ని, చల్లదనాన్ని పంచుతున్న చెట్లు గొడ్డలివేటుకు గురవుతున్నాయి. కొందరు తమ షాపులు, ఇండ్లు బయటకు కనపడటం లేదంటూ గ్రేటర్ వరంగల్ లో చెట్లను విచ్చలవిడిగా నరికేస్తున్నారు. బాలసముద్రం అడ్వకేట్స్ కాలనీలోని ఓ హోటల్ ముందుండే దాదాపు వందేండ్ల భారీ వేపచెట్టును కొద్దిరోజుల కిందట నరికేశారు.
'కుడా' ఆఫీస్ మార్గంలోని ఓ హాస్పిటల్ ఎదుట చెట్లను తొలగించారు. అశోక కాలనీ, కేఎల్ఎన్ రెడ్డి కాలనీ, బాలసముద్రంలో ఇష్టారీతిన చెట్లను నరుకుతున్నారు. ఏకశిలా పార్కు సమీపంలోని కొన్నేండ్ల కిందటి భారీ చెట్టు మొదలుకు నిప్పుపెట్టారు. అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ జిల్లా అయిన ఓరుగల్లు నగరంలోనే చెట్లు నరికివేతకు గురవుతుండగా, ఆఫీసర్లు లైట్ తీసుకుంటుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెట్లను నరికిన చోట్ల కనీసం రీప్లాంటేషన్ కైనా చర్యలు చేపట్టాలని ఓరుగల్లు ప్రజలు కోరుతున్నారు. - హనుమకొండ, వెలుగు