బీసీ జేఏసీ బంద్‌‌కు బీజేపీ మద్దతు..పార్టీ స్టేట్ చీఫ్ ఎన్. రాంచందర్ రావు ప్రకటన

బీసీ జేఏసీ బంద్‌‌కు బీజేపీ మద్దతు..పార్టీ స్టేట్ చీఫ్ ఎన్. రాంచందర్ రావు ప్రకటన
  • బీజేపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని కామెంట్  

హైదరాబాద్, వెలుగు: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల విషయంలో న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల18న బీసీ జేఏసీ ఇచ్చిన రాష్ట్ర బంద్​కు బీజేపీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ప్రకటించారు. బీసీలకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయనను బీసీ జేఏసీ నేతలు ఆర్​.కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇతర నేతలు కలిసి బంద్ కు మద్దతు కోరారు. 

ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. బీసీలకు న్యాయం చేయగలిగిన ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని చెప్పారు. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ పేరిట హామీలు ఇచ్చి చేతకాని పనిని ఇప్పుడు ఇతరులపైకి నెడుతోందని మండిపడ్డారు. బీసీ సంఘాలు, ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారని అన్నారు. 

ఇద్దరు బీజేపీ నేతలకు షోకాజ్ నోటీసులు

మంచిర్యాల జిల్లా నీల్వాయి గ్రామంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు పర్యటన సందర్భంగా గొడవ పడిన ఇద్దరు నేతలకు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మాజీ ఎంపీ వెంకటేశ్ నేత, గోమాస శ్రీనివాస్‌‌కు నోటీసులు ఇచ్చినట్టు క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ రవీందర్ విశ్వనాథ్ బుధవారం ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలోనే ఈ ఇద్దరు నేతలు పరుష పదజాలంతో దూషించుకుని, ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ పార్టీ నియమావళిని అతిక్రమించారని నోటీసుల్లో పేర్కొన్నారు.