లోక్ సభ సీట్లు పెంచితే దక్షిణాదికి అన్యాయం: జిలకర శ్రీనివాస్‌‌

లోక్ సభ సీట్లు పెంచితే దక్షిణాదికి అన్యాయం:  జిలకర శ్రీనివాస్‌‌

హైదరాబాద్, వెలుగు: జనాభా ప్రాతిపదికన లోక్‌‌సభ సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జిలకర శ్రీనివాస్‌‌ ఆందోళన వ్యక్తం చేశారు. సౌత్‌‌ సేన ఆధ్వర్యంలో గురువారం సిటీలో సమావేశంలో ఆయన మాట్లాడారు. కుటుంబ నియంత్రణ కఠినంగా అమలు చేయడంతో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరగలేదని చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ సక్రమంగా అమలు కాకపోవడంతో అక్కడ జనాభా భారీగా పెరిగిందని తెలిపారు. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే లోక్ సభలో ఉత్తరాది ఆధిపత్యం పెరిగిపోతుందన్నారు.

ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్‌‌ లాంటి కొన్ని పెద్ద రాష్ట్రాల్లో అధిక లోక్‌‌సభ సీట్లు సాధించే పార్టీనే కేంద్రంలో అధికారం చేపట్టే అవకాశం ఏర్పడుతుందన్నారు. కేంద్రంలో అధికారంలోకి రావడానికి దక్షిణాది రాష్ట్రాల అవసరమే లేకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. దక్షిణాదిలో సుప్రీంకోర్టు బెంచ్, మరో పార్లమెంట్, కేంద్ర సెక్రటేరియెట్‌‌ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సౌత్‌‌ సేన నాయకులు రాములు, రవి, శ్రీకాంత్, రమేశ్, జగదీశ్‌‌ తదితరులు పాల్గొన్నారు.