- ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస
- పోలీసులు, గ్రామస్థుల మధ్య తోపులాట
- సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో ఉద్రిక్తత
పటాన్ చెరు : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం రాళ్లకత్వలో స్టోన్ క్రషర్ల ఏర్పాటుపై శనివారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. క్రషర్లు వద్దని వ్యతిరేకించిన ప్రజలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. జిన్నారం మండలంలో ఇప్పటికే 13 స్టోన్ క్రషర్లు ఉండగా, కొత్తగా మాదారంలో 3, కాజీపల్లి, రాళ్లకత్వ, ఊట్లలో ఒక్కొక్కటి చొప్పున క్రషర్ల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనికోసం అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, సంగారెడ్డి ఆర్డీఓ మెంచు నగేశ్ సమక్షంలో రాళ్లకత్వలో ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు. ఉన్న క్రషర్లతో ఇబ్బందులు పడుతున్నామని, మళ్లీ కొత్తగా ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని కాజీపల్లి, మాదారం, రాళ్లకత్వ గ్రామస్తులు అడ్డుపడ్డారు. సభలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగి తోపులాటకు దారితీసింది. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఆగ్రహించిన జనాలు టెంట్లు కూల్చేయగా పోలీసులు అందరినీ తరిమేశారు. చివరకు మిగిలినవారితోనే అడిషనల్ కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ విషయమై జడ్పీ చైర్మన్ కుంచెల ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలు వద్దంటున్నా.. అధికారులు ఎందుకంత ఉత్సాహం చూపిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. రైతుల పొలాలు సర్వే చేయమని దరఖాస్తులు పెట్టుకుంటే నెలలు గడుస్తున్నా స్పందించని అధికారులు..బడా వ్యాపారుల కోసం ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ పాత క్రషర్లతోనే ఇబ్బందులు పడుతుంటే కొత్తవి ఏర్పాటు చేయాలని చూడడం సరికాదన్నారు.
అభ్యంతరాలను రిపోర్ట్ చేస్తాం...
క్రషర్ల ఏర్పాటుపై వస్తున్న అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం. ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని న్యాయం చేసే విధంగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం. ప్రభుత్వ నిర్ణయం మేరకు క్రషర్ల ఏర్పాటుపై చర్యలు తీసుకుంటాం. - వీరారెడ్డి, అడిషనల్ కలెక్టర్
