
ఆసియా కప్ కు టీమిండియా వికెట్ కీపింగ్ బ్యాటర్ సంజు శాంసన్ ప్లేయింగ్ 11 లో ఉంటాడా లేదా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఈ మెగా టోర్నీ ముందు వరకు టీమిండియాలో ఖచ్చితంగా ఉంటాడన్న శాంసన్ కు ఇప్పుడు నిరాశ తప్పేలా కనిపించడం లేదు. అటు వికెట్ కీపర్ గా.. ఇటు ఓపెనర్ గా సంజుకు బిగ్ కాంపిటీషన్ ఉంది. నిన్నటివరకు ఓపెనర్ గా కాకపోయినా కనీసం వికెట్ కీపర్ గా అయినా జట్టులో ఉండడం ఖాయమనుకున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న సమాచార ప్రకారం.. జితేష్ శర్మ ప్లేయింగ్ 11లో ఉండనున్నట్టు తెలుస్తోంది.
ఇండియా తరపున ఇప్పటివరకు తొమ్మిది టీ20 మ్యాచ్ లాడిన జితేష్ శుక్రవారం (సెప్టెంబర్ 5) ప్రాక్టీస్ సెషన్ లో చెమటోడ్చాడు. చాలా సేపు వికెట్ కీపింగ్ చేస్తూ కనిపించాడు. మరోవైపు సామ్సన్ హై క్యాచింగ్, త్రోడౌన్లు చేస్తూ కనిపించాడు. జితేష్ గ్లౌజులతో ఉన్న క్లిప్‌లను చూస్తే.. వికెట్ కీపింగ్ బాధ్యతలకు అతడే మొదటి ఎంపిక అనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే సంజు స్పెషలిస్ట్ బ్యాటర్ గా ఆడాలి. జట్టులో ప్రస్తుతం సంజు ఆడడానికి ఎక్కడా ఖాళీ లేదు. ఒకవేళ జితేష్ గనుక తుది జట్టులో ఉంటే శాంసన్ బెంచ్ కే పరిమితమవ్వాల్సి వస్తోంది.
ALSO READ : మహిళల ప్రపంచ కప్.. ప్రారంభోత్సవ వేడుకకు పాకిస్థాన్ ఔట్
ఈ మెగా టోర్నీకి అభిషేక్ శర్మ, శుభమాన్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగడం దాదాపుగా ఖాయమైంది. అభిషేక్ శర్మ ఓపెనింగ్ స్థానానికి ఎలాంటి ఢోకా లేదు. అతను బౌలింగ్ కూడా చేయగలడు కాబట్టి తుది జట్టులో ఖచ్చితంగా ఉంటాడు. వైస్ కెప్టెన్, ఓపెనర్ కావడంతో అభిషేక్ తో గిల్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. అదే జరిగితే సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్ లో ఆడాలి. తిలక్ వర్మ, సూర్య, హార్దిక్, రింకూ సింగ్, అక్షర్ పటేల్ వరుసగా మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో బరిలోకి దిగనున్నారు. వికెట్ కీపర్ జితేష్ శర్మ జట్టులోకి వస్తే శాంసన్ కు అవకాశం ఉండదు. మిడిల్ ఆర్డర్ లో శాంసన్ ఆడలేకపోవడం అతనికి మైనస్ గా మారొచ్చు.