
- భారత్ అప్రమత్తం.. పరిస్థితిని సమీక్షించిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ
న్యూఢిల్లీ: సింగపూర్, హాంగ్ కాంగ్లో కరోనా కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తున్నది. కొత్త వైరస్‌ను జేఎన్.1 వేరియంట్‌గా గుర్తించారు. ఒమిక్రాన్ బీఏ.2.86 నుంచి ఇది మార్పు చెందింది. కొత్త వేరియంట్‌తో సింగపూర్‌లో కేసులు భారీగా పెరిగిపోయాయి. ఈ నెల మొదటి వారంలోనే 14,200 కేసులు నమోదయ్యాయి. హాస్పిటళ్లన్నీ పేషెంట్లతో నిండిపోయాయి. దీంతో అధికారులు అప్రమత్తమై వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వైరస్ అడ్డుకట్టకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే, హాంగ్ కాంగ్ లోనూ కొత్త వేరియంట్ వ్యాప్తి చెందింది. ఈ నెలలో హాంగ్ కాంగ్ లో మొత్తం 1,042 కరోనా కేసులు రిజిస్టర్ అయ్యాయి. కొత్త వేరియంట్‌తో 31 మంది చనిపోయారు. గత 12 నెలల్లో కరోనా వైరస్‌తో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి. సింగపూర్, హాంగ్ కాంగ్లో కరోనా కేసులు పెరిగిపోయిన నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది.
కేంద్ర వైద్యశాఖ దేశంలోని పరిస్థితిపై సోమవారం సమీక్ష నిర్వహించింది. దేశంలో పరిస్థితి ప్రస్తుతం సాధారణంగానే ఉందని అధికారులు తెలిపారు. మన దేశంలో ఈ నెల 12 నుంచి 167 కొత్త కేసులు నమోదయ్యాయి. కేరళలో 69, మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34, కేరళలో 8, గుజరాత్ లో 6, ఢిల్లీలో 3, హర్యానా, రాజస్థాన్, సిక్కింలో ఒక్కో కేసు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం 257 కరోనా కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు.