- ఫీజులు మూడు రెట్లు పెంపు, డ్రెస్ కోడ్‌కు వ్యతిరేకంగా స్టూడెంట్ల ఆందోళన
- వర్సిటీ నుంచి ఏఐసీటీఈ ఆడిటోరియం వద్దకు వెళ్లేందుకు యత్నం
- కాన్వొకేషన్లో ఉప రాష్ట్రపతి ప్రసంగిస్తుండగా ఘటన
- ఆడిటోరియం ముట్టడి
న్యూఢిల్లీ:
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో స్టూడెంట్ల ఆందోళనతో ఉద్రిక్తత ఏర్పడింది. అధికారులు యాంటీ–స్టూడెంట్ పాలసీ అవలంబిస్తున్నారంటూ స్టూడెంట్లు నిరసనలకు దిగారు. ఫీజు పెంపు, డ్రెస్ కోడ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. సోమవారం ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ)లో వర్సిటీ కాన్వొకేషన్ జరుగుతోంది. కార్యక్రమానికి ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడు, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ హాజరయ్యారు. దీంతో ఏఐసీటీఈ వరకు మార్చ్ నిర్వహించేందుకు స్టూడెంట్లు ప్రయత్నించారు. నిరసన తీవ్రం కాకముందే ఉప రాష్ర్టపతి వెంకయ్య అక్కడి నుంచి వెళ్లిపోగా.. మంత్రి నిషాంక్ మాత్రం 6 గంటల పాటు ఆడిటోరియంలోనే ఉండిపోయారు.
వీసీ వల్లే ఇదంతా..
‘‘జేఎన్‌యూఎస్‌యూ ప్రెసిడెంట్ అయిషే ఘోష్, వైస్ ప్రెసిడెంట్ సాకేత్ మూన్తో మాట్లాడాం. మంత్రికి దారి ఇవ్వాలని కోరాం. ప్రొటెస్టర్లు గేట్ నుంచి పక్క కు తప్పుకోవాలని అడిగాం. కానీ వాళ్లు ఒప్పుకోలేదు” అని ఓ అధికారి చెప్పారు. తర్వాత స్టూడెంట్యూనియన్ ప్రతినిధులు.. మంత్రి పోఖ్రియాల్‌తో సమావేశమయ్యారు. డిమాండ్లను పరిశీలిస్తామని వారికి ఆయన హామీ ఇచ్చారు. దీంతో ఆయన వెళ్లేందుకు వారు దారిచ్చారు. తర్వాత వీసీని కలవాలంటూ స్టూడెంట్లు నినాదాలు చేశారు. ‘‘ఇదంతా జరగడానికి వీసీనే కారణం. ఆయనతో మేం మాట్లాడాలి” అని డిమాండ్ చేశారు. డ్రాఫ్టు హాస్టల్ మాన్యువల్‌లో పేర్కొన్న ఫీజుల పెంపు, డ్రెస్ కోడ్, కర్ఫ్యూ టైమింగ్స్ వంటి వాటిని తొలగించాలన్నారు. హాస్టల్మాన్యువల్ను వెనక్కి తీసుకునే వరకు తాము స్ట్రైక్ విరమించమని స్పష్టం చేశారు.
బ్యారికేడ్లు దాటుకుని..
జేఎన్యూకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏఐసీటీఈ గేట్లు మూసేసిన పోలీసులు.. అక్కడ భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాడే జేఎన్‌యూ నార్త్, వెస్ట్ గేట్ల వద్ద, ఏఐసీటీఈ ఆడిటోరియం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. 11.30 సమయంలో దూసుకొచ్చిన స్టూడెంట్లు.. బారికేడ్లు దాటుకుని ఆడిటోరియం వద్దకు చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్లకార్డులు ప్రదర్శించిన స్టూడెంట్లు డప్పులు కొడుతూ నిరసనలు తెలిపారు. ‘ఢిల్లీ పోలీస్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. వైస్ చాన్స్‌లర్ ఎం.జగదీశ్‌కుమార్ దొంగ అంటూ అరిచారు.
ఆడిటోరియంలోనే మంత్రితో చర్చలు
హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్.. ఏఐసీటీఈ ఆడిటోరియంలో 6 గంటల పాటు చిక్కుకు పోయారు. సోమవారం ఉపరాష్ర్టపతి వెంకయ్య నాయుడుతో కలిసి జేఎన్‌యూ మూడో కాన్వొకేషన్‌కు వెళ్లారు. కార్యక్రమం జరుగుతుండగా.. స్టూడెంట్లు ఆందోళన చేపట్టారు. దీంతో వెంకయ్య ముందుగానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. మంత్రి నిషాంక్ మాత్రం అక్కడే చిక్కుకుపోయారు. చర్చలు జరిపిన తర్వాత సాయంత్రం 4.15 కు స్టూడెంట్లు ఆయన్ను వదిలిపెట్టారు. కాన్వొకేషన్తర్వాత ఆయన రెండు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండగా.. ఆలస్యం కావడంతో వాటిని రద్దు చేసుకున్నారు.
ఇది చరిత్రాత్మక దినం. మేం బారికేడ్లను దాటి లోపలికి వెళ్లాం. కాన్వొకేషన్ వేదికను చేరుకున్నాం. మంత్రితో సమావేశమయ్యాం. మేమంతా కలిసి ఉండటం వల్లే ఇది సాధ్యమైంది.- జేఎన్‌యూఎస్‌యూ ప్రెసిడెంట్ ఘోష్

