
- 9 మంది అనుమానితుల గుర్తింపు
- సర్వర్ రూమ్ ధ్వంసం చేసి.. పెరియార్ హాస్టల్‌పై దాడి
- ఫొటోలు విడుదల చేసిన పోలీసులు
- ఎవర్నీ అరెస్ట్ చేయలే.. విచారిస్తమని వెల్లడి
- న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది: జేఎన్‌యూఎస్‌యూ ప్రెసిడెంట్
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) గొడవల్లో ట్విస్ట్… సర్వర్ రూమ్ ధ్వంసం చేసి, పెరియార్ హాస్టల్‌పై దాడి చేసిన అనుమానితుల్ని గుర్తించినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఇష్యూలో జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఆయిషీ ఘోష్ కూడా ఉన్నట్టు పోలీసులు చెప్పారు.దాడి ఘటనలో లెఫ్ట్ వింగ్ కు చెందిన నాలుగు పార్టీల ప్రమేయం ఉందంటూ ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. దాడికి పాల్పడిన అనుమానితులు తొమ్మిది మంది పేర్లను, ఫొటోలను పోలీసులు బయటపెట్టారు. హాస్టల్లోని స్టూడెంట్లపై దాడిలో జేఎన్‌యూ ఎస్‌యూ ప్రెసిడెంట్ఆయిషీ ఘోష్ సహా తొమ్మిదిమందిని గుర్తించామని చెప్పారు. ఈ కేసులో మొదటినుంచి గందరగోళం సృష్టిస్తున్నారని పోలీసులు ఆరోపించారు. అబద్ధాలనే నిజాలుగా ప్రచారం చేశారని చెప్పారు. ఆదివారం నాటి దాడికి ముందు జరిగిన విషయాలు బయటపడకుండా జాగ్రత్త పడ్డారని వివరించారు. ఈ గొడవకంతటికీ సెంటర్ పాయింట్ వింటర్ రిజిస్ట్రేషన్ అంటూ ఢిల్లీ డీసీపీ(క్రైమ్) జాయ్ టిర్కే వివరించారు.
‘వింటర్’ రిజిస్ట్రేషన్‌పై గొడవ
వింటర్ సెమిస్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలంటూ వర్సిటీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను జేఎన్‌యూఎస్‌యూ తో పాటు స్టూడెంట్ ఫ్రంట్ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ ఐ), ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్(ఏఐఎస్ఎఫ్), ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్అండ్ డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్(ఏఐఎస్ఏడీఎస్ఎఫ్) యూనియన్లు వ్యతిరేకించాయి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో స్టూడెంట్లు ఆసక్తి చూపించగా ఈ యూనియన్లు అడ్డుకున్నాయి. దీంతో ఈ నెల 15 నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపడతామని వర్సిటీ ప్రకటించింది. దీనిని ఎలాగైనా అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఈ నెల 3న స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) సహా మరో 3 గ్రూపులకు చెందిన స్టూడెంట్లు వర్సిటీ సర్వర్ రూమ్‌ను ధ్వంసం చేసి, సర్వర్‌ను ట్యాంపర్ చేశారు. ఇందులో జేఎన్‌యూ ఎస్‌యూ ప్రెసిడెంట్ఆయిషీ ఘోష్ కూడా ఉన్నారు. ఘోష్ సహా 9 మందిని గుర్తించామని డీసీపీ టిర్కే వివరించారు. దీనికి సంబంధించిన ఫొటోలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. ‘ఈ నెల 5న మధ్యాహ్నం 3:30 గంటలకు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఐడీఏ, డీఎస్ఎఫ్ గ్రూపులకు చెందిన విద్యార్థులు పెరియార్ హాస్టల్లోని విద్యార్థులపై దాడి చేశారు. అందులోనూ ఓ పథకం ప్రకారం కొన్ని రూములను టార్గెట్ చేశారు. ఈ దాడి కోసమే వర్సిటీ సర్వర్ రూమ్ ను ధ్వంసం చేశారు. అందువల్లే పెరియార్ హాస్టల్లో జరిగిన గొడవ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కాలేదు. అదేరోజు రాత్రి కొంతమంది దుండగులు ముసుగులు ధరించి, హాస్టల్లోకి చొరబడి ఆయిషీ ఘోష్ సహా మిగతా వారిపై దాడిచేశారు’ అని పోలీసులు వివరించారు. వర్సిటీలో గొడవలకు సంబంధించి మొత్తం 3 కేసులు నమోదయ్యాయని, రెండు వాట్సాప్ గ్రూపులకు చెందిన 70 మంది అడ్మిన్లను గుర్తించామని తెలిపారు. అయితే, శుక్రవారం నాటికి ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అనుమానితులకు నోటీసులు పంపించామని, త్వరలోనే వారిని విచారిస్తామని డీసీపీ పేర్కొన్నారు.
దాడి వీళ్ల పనే..!
- ఆయిషీ ఘోష్, జేఎన్‌యూఎస్‌యూ ప్రెసిడెంట్
- వికాస్పటేల్, ఎంఏ కొరియన్ స్టడీస్
- పంకజ్ మిశ్రా, స్కూల్ ఆఫ్ సైన్స్
- చుంచున్ కుమార్, జేఎన్‌యూ మాజీ స్టూడెంట్
- యోగేంద్ర భరద్వాజ్, పీహెచ్డీ స్కాలర్
- డోలన్ సమనత, స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్
- సుచేత తాలుక్దార్, స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్
- ప్రియా రంజన్, స్కూల్ ఆఫ్ లాంగ్వేజ్అండ్ కల్చరల్ స్టడీస్ వస్కర్ విజయ్
భయపడే సమస్యే లేదు
పోలీసులు ఆరోపిస్తున్నట్లు నేను ఎలాంటి దాడులు చేయలే.. దేనికీ భయపడను. పోలీసులు ఏ ఆధారంతో నాపై ఆరోపణలు చేస్తున్నారో తెలియడంలేదు. ఆరోపణలకు సరైన ఆధారాలు ఉంటే బయటపెట్టాలి. నాపై జరిగిన దాడికి సంబంధించి సాక్ష్యాలు ఉన్నాయి. భౌతిక దాడులకో.. పోలీసు కేసులకో భయపడతామని అనుకోవద్దు. దేశ న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. నాకు తప్పకుండా న్యాయం జరుగుతుందనే భావిస్తున్నా. ఈ కేసుల విషయంలో హెచ్చార్డీ మినిస్ట్రీ కల్పించుకుని ప్రొటోకాల్ ఎంక్వైరీ జరిపించాలి. – ఆయిషీ ఘోష్, జేఎన్‌యూ ఎస్‌యూ ప్రెసిడెంట్
గొడవపై తప్పుడు ప్రచారం
జేఎన్‌యూలో గొడవకు సంబంధించి క్రిమినల్ కేసు నమోదైంది. దీనిపై క్రైంబ్రాంచ్విచారణ కొనసాగుతోంది. అయితే, ఈ కేసుకు సంబంధించి జరుగుతున్న ప్రచారంలో అవాస్తవాలే ఎక్కువ ఉన్నాయి. – రంధావా, ఢిల్లీ పోలీస్ పీఆర్వో