
- జేఎన్‌వీసీ అలుమ్నీ అసోషియేషన్ పేరుతో ప్రతి ఏటా ఒక్కచోటికి..
- సేవా కార్యక్రమాల్లో ఆదర్శం
చొప్పదండి, వెలుగు: చొప్పదండిలోని జవహర్ నవోదయ విద్యాలయంలో చిన్నతనంలో చదువుకుని ప్రయోజకులైన విద్యార్థిని, విద్యార్థులు ఈ విద్యాలయాన్ని మరిచిపోకుండా ఏటా సేవా కార్యక్రమాలు చేపడుతూ తమ వంతు సాయం అందిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్జిల్లా రూరల్విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు 1986లో చొప్పదండిలో జవహర్నవోదయ విద్యాలయం ఏర్పాటైంది. అందులో చదివిన విద్యార్థులంతా ప్రస్తుతం ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. తమకు విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులను చేసిన విద్యాలయాన్ని వారు మర్చిపోకుండా జేఎన్‌వీసీ అలుమ్నీ పేరుతో అసోషియేషన్ఏర్పాటు చేసుకొని ఏటా పూర్వ విద్యార్థులు కలుసుకుంటున్నారు. విద్యాలయంతోపాటు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు విద్య, సౌకర్యాల పరంగా సహాయ సహకారాలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
వైద్యరంగంలో స్థిరపడిన పూర్వ విద్యార్థులతో మెగాహెల్త్ క్యాంపు
నవోదయ విద్యాలయంలో చదివి ఎంఎస్, ఎంబీబీఎస్, హోమియోపతి, ఆయుర్వేద విభాగాల్లో డాక్టర్లుగా పనిచేస్తున్న 65 మంది ఇటీవల స్కూల్లో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. 450 మంది విద్యార్థులు, 50 మంది టీచర్లు, వారి కుటుంబసభ్యులు, 200 మంది తల్లిదండ్రులకు ఉచిత వైద్య పరీక్షలు, తనిఖీలు చేసి దాదాపు రూ.లక్ష విలువైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు.
మెడికల్ సపోర్ట్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు
కరోనాసమయంలో పూర్వ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులకు వైద్యపరమైన సలహాలు, సూచనలు అందించేందుకు, అనారోగ్యంతో ఉన్నవారికి సకాలంలో వైద్య సేవలు అందించేందుకు పూర్వ విద్యార్థులైన డి.విశ్వనాథ్, డా.అనిల్ కనపర్తి ఆధ్వర్యంలో ఓవాట్సాప్ గ్రూప్ ఏర్పాటైంది. ఇద్దరితో మొదలైన ఈ గ్రూప్‌లో ప్రస్తుతం నవోదయలో చదివిన 300 మందికి పైగా పూర్వ విద్యార్థులున్నారు. ఈ గ్రూప్ ద్వారా నవోదయలో చదివిన పూర్వ విద్యార్థులు, వారి ఫ్యామిలీ మెంబర్స్, రిటైర్డ్ స్టాఫ్‌కు వైద్య పరమైన సూచనలు, సలహాలు అందిస్తున్నారు.
పూర్వ విద్యార్థుల సహకారంతో రూ. 15లక్షల సీసీ రోడ్డు ఏర్పాటు
నవోదయలో విద్యార్థులు రాకపోకలు సాగించడానికి సీసీ రోడ్డు అత్యవసరం కాగా పలువురు పూర్వ విద్యార్థులు స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి సీసీ రోడ్డుకు రూ.15లక్షలు మంజూరు చేసి ఇటీవలే శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా విద్యార్థుల సౌకర్యార్థం 1000 లీటర్ల సామర్థ్యం గల వాటర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. స్కూల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థికి రూ.50వేల విలువైన ఎలక్ట్రికల్ త్రీవీలర్ సైకిల్ అందించారు. ప్రతి సంవత్సరం విద్యార్థులకు కెరీర్ పరంగా వారికి విలువైన సూచనలు, సలహాలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.