- ఎంపికైన వారికి నెలకు రూ. 9,600 స్టైపెండ్
- ఇంటర్మీడియెట్ విద్యాశాఖ కీలక నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు, వృత్తి విద్యా కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియెట్ విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రీజినల్ డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా ఐదు జిల్లాల్లో అప్రెంటిస్‌షిప్- కమ్ జాబ్ మేళా–2026 నిర్వహించనున్నట్టు ప్రకటించింది. జులై 6 నుంచి 14 వరకు ఈ మేళాలు జరుగనున్నాయి. ‘యువర్ స్కిల్స్, యువర్ ఫ్యూచర్, అవర్ మిషన్’ అనే థీమ్‌తో, స్కిల్ ఇండియా మిషన్, నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ కింద ఈ డ్రైవ్‌ను చేపడుతున్నారు.
ప్రముఖ పరిశ్రమల్లో శిక్షణతో పాటు నేరుగా ఉద్యోగ నియామకాలు చేపట్టడమే ఈ మేళా ప్రధాన ఉద్దేశ్యం. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.9,600 స్టైపెండ్ లభిస్తుంది. 2023–2026 బ్యాచ్‌లకు చెందిన వృత్తి విద్యా విద్యార్థులు, మార్చి/జూన్ 2026లో ఇంటర్ పూర్తి చేసిన ఫ్రెషర్లు, అలాగే గత మూడేండ్లలో ఉత్తీర్ణులైన వారు ఈ మేళాకు హాజరు కావచ్చు. అయితే, గతంలో ఎక్కడా అప్రెంటిస్‌షిప్ చేయని వారు మాత్రమే దీనికి అర్హులు.
జిల్లాల వారీగా షెడ్యూల్..
మేళా జరిగే రోజుల్లో.. ఉదయం సెషన్లో పారామెడికల్ విభాగం వారికి, మధ్యాహ్నం సెషన్లో నాన్-పారామెడికల్ విభాగం వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్టు ఇంటర్మీడియెట్ విద్యాశాక డైరెక్టర్ అభిలాషా అభినవ్ తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని చెప్పారు. కేవలం ఉద్యోగాలే కాకుండా కెరీర్ కౌన్సెలింగ్, ఆన్- ది స్పాట్ షార్ట్ లిస్టింగ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
జులై 6: ఎస్కే పీఎం ప్రభుత్వ వృత్తి జూనియర్ కాలేజీ, కుత్బుల్లాపూర్ (మేడ్చల్–మల్కాజ్గిరి)
జులై 7: కస్తూర్బా గాంధీ జూనియర్ కళాశాల, మారేడ్ పల్లి (సికింద్రాబాద్)
జులై 13: ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజీ, హన్మకొండ -
జులై 14: ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలు, మహబూబ్‌నగర్, నల్గొండ.
