రాబోయే పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉన్న ప్రశ్నలు

రాబోయే పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉన్న ప్రశ్నలు

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ ఉదయ్​ ఉమేశ్​ లలిత్​ నియమితులు కానున్నారు. 49వ సీజేఐగా ఆయన పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో రాబోయే పోటీ పరీక్షల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తుల నియామకం, వివాదాలు, కొలీజీయం వ్యవస్థ,  జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్​, రద్దు, జడ్జెస్​ తీర్పులపై ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంది. 

ఆర్టికల్​ 124(2) ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరినీ మంత్రి మండలి సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తాడు.  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకంలో రాష్ట్రపతి కేంద్ర మంత్రి మండలితోపాటు సుప్రీంకోర్టులోని ఇతర న్యాయమూర్తులు, అవసరమని భావిస్తే హైకోర్టు న్యాయమూర్తులనూ సంప్రదిస్తారు.   సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో రాష్ట్రపతి మంత్రి మండలి సలహాతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి,  ఇతర న్యాయమూర్తులు, అవసరమని భావిస్తే హైకోర్టు న్యాయమూర్తులనూ సంప్రదిస్తారు. ప్రధాన న్యాయమూర్తి నియామకంలో సాధారణంగా సీనియార్టీ సూత్రం అనుసరిస్తారు. 
వివాదాలు 
ప్రధాన న్యాయమూర్తి నియామకం, అర్హతల గురించి ప్రత్యేకంగా రాజ్యాంగంలో పేర్కొనలేదు. అత్యంత సీనియర్​ న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు.1956 నుంచి 1973 వరకు అత్యంత సీనియర్​ న్యాయమూర్తిని మాత్రమే ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. కానీ ఆ తర్వాత రెండు సందర్భాల్లో సీనియర్​ న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించే పద్ధతిని ఉల్లంఘించారు. 
కేశవానంద భారతి కేసు(1973)లో ప్రభుత్వానికి వ్యతిరేకమైన తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. దీంతో సీనియర్​ న్యాయమూర్తులైన జె.ఎం.షెలాట్​, కె.ఎస్​.హెగ్డే, ఎ.ఎన్.గ్రోవర్​లను కాదని, సీనియార్టీలో నాలుగో స్థానంలో  ఉన్న ఎ.ఎన్​.రేను ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. 
అడిషనల్​ డిస్ట్రిక్ట్​ మేజిస్ట్రేట్​ జబల్​పూర్​ వర్సెస్​ శివకాంత్​ శుక్లా(1977) కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటంతో హెచ్​.ఆర్​. ఖన్నా  అనే సీనియర్​ న్యాయమూర్తిని కాదని సీనియారిటీలో రెండో స్థానంలో ఉన్న ఎం.ఎం.బేగ్​ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. 
– 1993లో సుప్రీంకోర్టు సెకండ్​ జడ్జెస్​ కేసులో అత్యంత సీనియర్​ న్యాయమూర్తిని మాత్రమే ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని తీర్పును ఇచ్చింది. అప్పటి నుంచి ఈ నియమాన్ని ఉల్లంఘించలేదు. 

జడ్జెస్​ కేసులు 
ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి సంప్రదించినప్పుడు.. ఆయన అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై 1981 తర్వాత మూడు సందర్భాల్లో సుప్రీంకోర్టు విభిన్న తీర్పులు ఇచ్చింది. వీటిని జడ్జెస్​ కేసులు అంటారు. ఈ మూడు జడ్జెస్​ కేసుల్లోనూ నియామక ప్రక్రియ పట్ల ఆర్టికల్​ 143 ఆధారంగా 
రాష్ట్రపతి  సుప్రీంకోర్టు సలహా కోరారు. 

ఫస్ట్​ జడ్జెస్​ కేసు (1981): ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించడమంటే అతని అభిప్రాయాన్ని తెలుసుకోవడం మాత్రమే. అంటే ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయాన్ని పాటించడం రాష్ట్రపతి తప్పనిసరి కాదు. 
సెకండ్​ జడ్జెస్​ కేసు(1993): ఈ కేసులో ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయాన్ని రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నది. ప్రధాన న్యాయమూర్తి తన అభిప్రాయాన్ని మరో ఇద్దరు సీనియర్​ న్యాయమూర్తులను సంప్రదించి తెలియజేయాలి.

థర్డ్​ జడ్జెస్​ కేసు(1998): ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్ట్రపతి సలహా కోరినప్పుడు ప్రధాన న్యాయమూర్తి, మరో నలుగురు సీనియర్​ న్యాయమూర్తులతో కూడిన కొలీజీయాన్ని సంప్రదించాలి. ఏకాభిప్రాయం  ఆధారంగా తన నిర్ణయాన్ని కొలీజీయం తెలియజేస్తుంది. ఈ నలుగురిలో ఏ ఇద్దరు అభిప్రాయాన్ని వ్యతిరేకించినా కొలీజీయం ఆ సలహాను రాష్ట్రపతికి ఇవ్వకూడదు. 

ఫోర్త్​ జడ్జెస్​ కేసు(2015): సుప్రీంకోర్టు అడ్వకేట్స్​ ఆన్ రికార్డ్​ అసోసియేషన్​ వర్సెస్​ యూనియన్​ ఆఫ్​ ఇండియా కేసులో సుప్రీంకోర్టు జాతీయ న్యాయ నియామకాల కమిషన్​ చట్టం – 2014, 99వ రాజ్యాంగ సవరణ–2014 చెల్లదని తీర్పు ఇచ్చింది. ఇది న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తికి భంగం కలిగిస్తుందనే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. దీంతో న్యాయమూర్తుల నియామక ప్రక్రియ తిరిగి పాత కొలీజీయం పద్ధతిలోనే జరుగుతోంది. 

తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులు
ఆర్టికల్​ 126 ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి అనుకోని పరిస్థితుల్లో ఖాళీ అయినప్పుడు లేదా ప్రధాన న్యాయమూర్తి తాత్కాలికంగా విధులకు గైర్హాజరైనప్పుడు లేదా ఏ కారణంతోనైనా ప్రధాన న్యాయమూర్తి విధులను నిర్వర్తించలేనప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఒకరిని రాష్ట్రపతి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా 
నియమిస్తాడు.

జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్​

కొలీజీయం వ్యవస్థలోని లోపాలను సరిదిద్దుతూ న్యాయమూర్తుల నియామకంలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని సాధించాలనే లక్ష్యంతో జాతీయ న్యాయమూర్తుల నియామకాల కమిషన్​ బిల్లును 2014 ఆగస్టు 13న లోక్​సభ, 14న రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లును ఆ తర్వాత సగం కంటే ఎక్కువ రాష్ట్రాల శాసనభలూ ఆమోదించాయి. ఈ కమిషన్​కు 99 వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. 
కమిషన్​ నిర్మాణం: 
చైర్మన్​: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సభ్యులు: ఈ కమిషన్​లో ఆరుగురు సభ్యులు ఉంటారు.  ఇద్దరు సీనియర్​ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. కేంద్ర న్యాయశాఖ మంత్రి. పౌర సమాజం నుంచి ఇద్దరు ప్రముఖులు. పౌర సమాజం నుంచి నియమించే ఇద్దరు ప్రముఖులను ప్రధాన మంత్రి అధ్యక్షుడిగా ఉన్న కమిటీ ఎంపిక చేసింది.
కమిటీ నిర్మాణం
అధ్యక్షుడు:  ప్రధాన మంత్రి
సభ్యులు:  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్​సభలో ప్రతిపక్ష నాయకుడు 
నియమ నిబంధనలు: ఇద్దరు సభ్యుల్లో ఒకరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వర్గం లేదా మహిళై ఉండాలి. వీరి పదవీకాలం మూడేండ్లు. ఒక్కసారి పదవీకాలం పూర్తయిన తర్వాత మళ్లీ నియమించకూడదు. 
కమిషన్​ విధులు: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లోని న్యాయమూర్తుల ఖాళీలను గుర్తించి ప్రభుత్వానికి తెలియజేస్తుంది. నియామకానికి సంబంధించి సిఫారసులు చేస్తుంది. 
నియామక ప్రక్రియ: అత్యంత సీనియర్​ న్యాయమూర్తినే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు. సమర్థత, ప్రతిభ ఆధారంగా ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు. దేశంలోని హైకోర్టుల్లోని న్యాయమూర్తుల్లో అత్యంత సీనియర్ న్యాయమూర్తిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు. హైకోర్టు న్యాయమూర్తులను నియమించే సందర్భంలో హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిని, ఇద్దరు సీనియర్​ న్యాయమూర్తులను, సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్​లను సంప్రదించాలి. 

ఆర్టికల్​ 124  సుప్రీంకోర్టు ఏర్పాటు, నిర్మాణం గురించి తెలుపుతుంది. న్యాయమూర్తుల సంఖ్యను పార్లమెంట్​ ఒక సాధారణ చట్టం ద్వారా పెంచుతుంది. ప్రారంభంలో సుప్రీంకోర్టుకు ఒక ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు న్యాయమూర్తులు ఉండేవారు. సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య సవరణ చట్టం–2019 ప్రకారం 33 మంది న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో ఉంటారు. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తితో కలుపుకొని మొత్తం 34 మంది న్యాయమూర్తులు ఉన్నారు.

ఆర్టికల్​ 124(3) ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి కింది ఈ అర్హతలు ఉండాలి.  భారత పౌరుడై ఉండాలి. ఏదైనా హైకోర్టులో లేదా వివిధ హైకోర్టుల్ల వరుసగా కనీసం 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి. లేదా ఏదైనా హైకోర్టులో లేదా వివిధ హైకోర్టుల్లో వరుసగా 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి. రాజ్యాంగంలో న్యాయమూర్తి పదవికి ఉండాల్సిన కనీస వయసు ప్రస్తావన లేదు.