
జో బైడెన్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. డెలవర్‌లోని క్రిస్టియానా ఆస్పత్రిలో 78 ఏళ్ల బైడెన్ ఫైజర్ టీకా మొదటి డోసు తీసుకున్నారు. బైడెన్ వ్యాక్సినేషన్‌ను అమెరికా ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.. ప్రజల్లో లేనిపోని అపోహాలు పోగొట్టేందుకు ఈ టీకా వేయించుకున్నానని చెప్పారు. వ్యాక్సిన్ గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజలు టీకా వేయించుకునేందుకు సిద్ధంగా ఉండాలని… తాను టీకా రెండో డోసు తీసుకునేందుకు ఎదురు చూస్తున్నానని అన్నారు. అయితే టీకా తీసుకుంటున్న సమయంలో బైడెన్ సతీమణి జిల్ బైడెన్ ఆయన పక్కనే ఉన్నారు. ఆమె అంతకు ముందు రోజే టీకా తీసుకున్నారు. గతంలో బహిరంగంగానే టీకా తీసుకునేందుకు తాను సిద్ధమని ప్రకటించారు బైడెన్.
క్రిస్మస్ సెలవులు, పండుగ క్రమంలో ప్రజలంతా ఒక్కచోట చేరే అవకాశం ఉన్నందున మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అమెరికన్లకు బైడెన్ మరోసారి విజ్ఞప్తి చేశారు.