ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా ఆశలు ఇంకా మిగిలే ఉన్నాయి. నాలుగో రోజు బ్రూక్, రూట్ సెంచరీలతో చెలరేగినా కీలక సమయంలో భారత జట్టు వికెట్లు తీయడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఇంగ్లాండ్ విజయం సాధించాలంటే 35 పరుగులు అవసరం. మరోవైపు భారత జట్టు నాలుగు వికెట్లు తీస్తే విజయం సాధిస్తుంది. ఈ నేపథ్యంలో చివరి రోజు ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. గాయంతో బాధపడుతున్న క్రిస్ వోక్స్ బరిలోకి దిగుతాడా లేదా అనే విషయంలో సందేహాలు నెలకొన్నాయి.
తొలి రోజు ఆటలో భాగంగా వోక్స్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. భుజానికి బలంగా గాయం కావడంతో గ్రౌండ్ వదిలి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రెండు ఇన్నింగ్స్ ల్లో బౌలింగ్ చేయలేదు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వోక్స్ ఐదవ టెస్ట్ నుంచి వైదొలిగినట్టు అధికారికంగా ప్రకటించింది. తొలి ఇన్నింగ్స్ లో వోక్స్ బ్యాటింగ్ కూడా చేయలేదు. దీంతో రెండో ఇన్నింగ్స్ లో ఈ ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్.. బ్యాటింగ్ ఆడతాడా లేదా అనే విషయంలో సస్పెన్స్ కొనసాగింది. వోక్స్ బ్యాటింగ్ ఆడతాడా లేదా అనే విషయంలో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ రూట్ క్లారిటీ ఇచ్చాడు.
నాలుగో రోజు ముగిసిన తర్వాత రూట్ విలేఖరి సమావేశంలో మాట్లాడుతూ.. ఇలా అన్నాడు " ఐదో రోజు వోక్స్ బ్యాటింగ్ ఆడకూడదనే అనుకుంటున్నాను. అతను గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ఒకవేళ జట్టు అవసరం ఉంటే వోక్స్ బ్యాటింగ్ కు వస్తాడు". అని రూట్ అన్నాడు. దీంతో చివరి రోజు టీమిండియా సిరీస్ సమం చేయాలంటే నాలుగు వికెట్లు తీయాల్సిందే. ఈ మ్యాచ్ విషయానికి వస్తే
374 రన్స్ భారీ టార్గెట్ ఛేజింగ్‌లో హ్యారీ బ్రూక్ (98 బాల్స్‌లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 111), జో రూట్ (152 బాల్స్‌లో 12 ఫోర్లతో 105) సెంచరీలతో దంచడంతో ఓ దశలో 301/3తో నిలిచిన ఇంగ్లండ్ గెలుపు లాంఛనమే అనిపించింది. కానీ, ఈ టైమ్‌లో ఇండియా బౌలర్లు మ్యాజిక్ చేశారు.
వెంటవెంటనే మూడు వికెట్లు పడగొట్టి మన టీమ్‌ను మళ్లీ రేసులోకి తెచ్చారు. దాంతో నాలుగో రోజు, ఆదివారం వర్షంతో ఆట ముగిసిన సమయానికి ఇంగ్లండ్ 76.2 ఓవర్లలో 339/6తో నిలిచింది. ప్రసిధ్ కృష్ణ (3/109), మహ్మద్ సిరాజ్ (2/95) అదరగొట్టారు. ప్రస్తుతం జెమీ స్మిత్ (2 బ్యాటింగ్), ఒవర్టన్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉండగా ఇంగ్లండ్‌కు మరో 35 రన్స్ అవసరం కాగా.. ఇండియాకు 4 వికెట్లు కావాలి. సోమవారం ఉదయం 3.4 ఓవర్ల తర్వాత కొత్త బాల్ అందుబాటులోకి రానుండటం ప్లస్ పాయింట్ కానుంది.
