IND vs ENG: బ్యాట్‌కి బంతికి ఆమడదూరం..టెక్నాలజీ సాయంతో బతికిపోయిన రూట్

IND vs ENG: బ్యాట్‌కి బంతికి ఆమడదూరం..టెక్నాలజీ సాయంతో బతికిపోయిన రూట్

హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియం లో ప్రారంభమైన తొలి టెస్టులో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు టెక్నాలజీ సహాయంతో ఔట్ నుంచి బయటపడ్డాడు. మొదటి సెషన్ లో భాగంగా 15 ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అశ్విన్ వేసిన ఈ ఓవర్ చివరి బంతికి స్వీప్ ఆడేందుకు ప్రయత్నించగా.. అది కాస్త మిస్ అయ్యి రూట్ ప్యాడ్ కు తాకింది. బంతి వికెట్లను తాకుతుందని అశ్విన్ చెప్పడంతో కెప్టెన్ రోహిత్ శర్మ రివ్యూ కోరాడు. 

రిప్లేలో బంతి బ్యాట్ కు తగులుతున్నట్లుగా కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్ బాల్ ట్రాకింగ్ చూడకుండానే నాటౌట్ గా ప్రకటించాడు.  సరిగా గమనిస్తే బంతి బ్యాట్ కు చాలా దూరంగా వెళ్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. అయినా అల్ట్రా ఎడ్జ్ లో మాత్రం బంతి తగిలినట్లుగా చూపిస్తుంది. దీంతో రూట్ 0 పరుగుల దగ్గర ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. లంచ్ సమయానికి 18 పరుగులతో క్రీజ్ లో ఉన్న రూట్..ఎంత ప్రభావం చుపిస్తాడో చూడాలి. 
   
ఈ మ్యాచ్ లో తొలి సెషన్ ముగిసేసరికి 27 ఓవర్లలో ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. క్రీజ్ లో స్టార్ ఆటగాడు రూట్(18), బెయిర్ స్టో(32) ఉన్నారు. బెన్ డకెట్ 35 పరుగులు చేసి పర్వాలేదనిపించగా.. జాక్ క్రాలి (20),పోప్(1) విఫలమయ్యారు. భారత బౌలర్లలో అశ్విన్ కు రెండు, జడేజాకు ఒక వికెట్ దక్కింది.