రాజకీయ దురుద్దేశంతోనే నాపై భూకబ్జా కేసు: జోగినపల్లి సంతోష్

రాజకీయ దురుద్దేశంతోనే నాపై భూకబ్జా కేసు: జోగినపల్లి సంతోష్

రాజకీయ దురుద్దేశంతోనే తనపై భూ కబ్జా కేసు పెట్టారని మండిపడ్డారు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్. తాను డబ్బు పెట్టి కొన్న ఆస్తిపై అనవసరంగా నిందలు వేస్తున్నారని అన్నారు. షేక్ పేటలోని సర్వే నెంబర్ 129/54లో ఉన్న 904 గజాల ఇంటి స్థలం తాను శ్యామ్ సుందర్ అనే వ్యక్తి నుంచి 2016 లో కొన్నానని చెప్పారు జోగినపల్లి సంతోష్ కుమార్. దీన్ని పూర్తిగా చట్టబద్ధంగా కొనుగోలు చేసినట్లు తెలిపారు. ల్యాండ్ కు 3కోట్ల 81లక్షలు చెల్లించి బాజాప్తా సేల్ డీడ్ ద్వారా, రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేశానన్నారు జోగినపల్లి సంతోష్ కుమార్. 

తన ఆస్తిపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జోగినపల్లి సంతోష్ కుమార్. తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదని.. తాను కొన్న భూమిపై ఎవరైనా విచారణ చేసుకోవచ్చని ప్రకటించారు. దీనిపై న్యాయపరంగా ఎదుర్కోవడానికి తాను సిద్దమన్నారు. 32 సంవత్సరాలుగా లేని వివాదం కొత్తగా ఇప్పుడే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. రాజకీయకక్షతో బురదచల్లాలని చూస్తే సహించేది లేదన్నారు. తప్పుడు ఆరోపణలు చేసి, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించాలని చూస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్. 

అంతకుముందు మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్ కుమార్ పై  బంజారాహిల్స్  పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ల్యాండ్​కబ్జాకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. నకిలీ డాక్యుమెంట్స్, ఫ్యాబ్రికేటెడ్ డోర్ నెంబర్ల సృష్టించి ల్యాండ్ కబ్జాకు యత్నించినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈమేరకు నవయుగ కంపెనీ ప్రతినిధి చింతా మాధవ్  పోలీసులకు ఫిర్యాదు చేశారు.