ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

అలంపూర్, వెలుగు: ఐదో శక్తిపీఠంగా విరాజిల్లుతున్న జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి కల్యాణం కమనీయంగా జరిగింది.  ఆదివారం ఉదయం మూలనక్షత్రం సమయాన ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో ఈ కార్యాన్ని నిర్వహించారు. అంతకుముందు ప్రభుత్వం తరఫున వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌‌ రెడ్డి, ఎమ్మెల్యే అబ్రహం, ఏపీ తరఫున కర్నూల్ కలెక్టర్‌‌‌‌ కోటేశ్వర రావు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకను చూసేందుకు  భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు.  సాయంత్రం వేళ జోగులాంబ అమ్మవారికి  సింహ వాహన సేవ నిర్వహించారు. ఈవో సురేందర్ కుమార్, ఆలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ రాజు పాల్గొన్నారు. 

కేసీఆర్‌‌‌‌కు అమ్మ ఆశీస్సులు ఉండాలి

జోగులాంబను దర్శించుకున్న అనంతరం మంత్రి నిరంజన్‌‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నామని చెప్పారు.  ఉద్యమం సమయంలో కేసీఆర్‌‌‌‌ అమ్మవారి పాదాల చెంత నుంచే  పాదయాత్ర మొదలుపెట్టారని గుర్తుచేశారు.  అమ్మవారి చల్లని చూపు వల్ల సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడంతో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు.  రాష్ట్రం అన్నిరంగాల్లో మొదటి స్థానంలో ఉందని,  దేశాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు  సీఎం కేసీఆర్‌‌‌‌ మహోత్తర కార్యక్రమానికి  శ్రీకారం చుడుతున్నారన్నారు.  అమ్మవారి ఆశీస్సులతో ఈ కార్యం విజయవంతం కావాలని కోరారు.  మంత్రి వెంట ఎమ్మెల్యే అబ్రహం,  జడ్పీ చైర్‌‌‌‌పర్సన్‌‌ సరిత, మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ ఉన్నారు.  

సన్నాసుల విమర్శలు పట్టించుకోం

ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి                                                 

కొత్తకోట,వెలుగు: పనీపాటా లేకుండా చౌరస్తాలో కూర్చొని అభివృద్ధిపై విమర్శలు చేస్తున్న సన్నాసులను పట్టించుకోవాల్సిన అవసరం లేదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.   కొత్తకోట పట్టణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మహత్మా గాంధీ విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  రోడ్డు విస్తరణ చేసి చౌరస్తాలో గాంధీ విగ్రహం పెట్టడంతో కొత్తకోటకు కొత్తకళ వచ్చిందన్నారు.

గతంలో ఇరుకు రోడ్లతో ట్రాఫిక్ సమస్యలు ఉండేవని, తెలంగాణ వచ్చాక రోడ్లను విస్తరించడంతో పాటు డ్రైనేజీలు నిర్మిస్తున్నామన్నారు.  పార్టీలకతీతంగా సీఎంఆర్‌‌‌‌ఎఫ్‌‌, కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు ఇస్తున్నామన్నారు.  తాను అభివృద్ధిని మరిచి,  కొందరు సన్నాసులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. వాళ్లు ఎన్ని కుప్పిగంతులు వేసినా ప్రజలు పట్టించుకోరని,  వచ్చే ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ  మెజారిటీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారుఉ. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, వైస్ చైర్మన్ వామన్ గౌడ్,  మున్సిపల్ చైర్మన్ సుకేషిని విశ్వేశ్వర్, పీఏసీఎస్‌‌ చైర్మన్ వంశీచందర్ రెడ్డి, ఎంపీపీ గుంత మౌనిక, జిల్లా అధికార ప్రతినిధి  ప్రశాంత్,  పట్టణ అధ్యక్షుడు బాబు రెడ్డి పాల్గొన్నారు.

సద్దుల సంబురానికి ఏర్పాట్లు చేయండి

కలెక్టర్ ఎస్.వెంకట్ రావు 

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: జడ్పీ మైదానంలో ఈ నెల 3న నిర్వహించనున్న సద్దుల బతుకమ్మ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్ రావు ఆదేశించారు. ఆదివారం సంబంధిత ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్‌‌ నిర్వహించారు. ఈ  ఉత్సవాలకు  పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చీఫ్‌‌గెస్టుగా రానున్నారని,   జిల్లా ఆఫీసర్లు వారి కుటుంబాలతో సహా హాజరు కావాలని సూచించారు.

పట్టణంలోని ప్రతి వార్డు నుంచి మెప్మా మహిళలు బతుకమ్మలను తీసుకురావాలని,  ప్రతి మండలం నుంచి కనీసం పెద్ద బతుకమ్మతో ఒక బృందం హాజరు కావాలని కోరారు.   సాయంత్రం 5 గంటలకు ఉత్సవాలు ప్రారంభం అవుతాయని, ఉత్తమ బతుకమ్మలకు నగదు బహుమతులు  ఇస్తామని చెప్పారు.  బతుకమ్మల నిమజ్జనానికి కేసాఇర్‌‌‌‌ ఎకో అర్బన్ పార్క్ ముందున్న చెరువుతో పాటు స్టేడియం గ్రౌండ్‌‌లోని స్విమ్మింగ్ పూల్‌‌లో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.  వీసీ అడిషనల్ కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, జిల్లా ఆఫీసర్స్ పాల్గొన్నారు.  

మాటతప్పిన మంత్రి నిరంజన్‌‌ రెడ్డి

బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు మహేశ్

అలంపూర్, వెలుగు:  స్వచ్ఛ అలంపూర్ అయ్యేంత వరకు ఇక్కడ అడుగు పెట్టనని చెప్పిన మంత్రి నిరంజన్‌‌ రెడ్డి మాట తప్పారని బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు మహేశ్ మండిపడ్డారు. ఆదివారం పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌‌మీట్‌‌లో ఆయన  మాట్లాడుతూ ఆగస్టు 12న అలంపూర్ పర్యటనకు వచ్చిన మంత్రి నిరంజన్ రెడ్డి పట్టణంలో పారిశుద్ధ్యం సరిగ్గా లేదని, తాను మళ్లీ వచ్చేకల్లా నీట్‌‌గా మార్చాలని చెప్పారన్నారు.

ముళ్లకంపలు, చెత్తాచెదారం తొలగించే దాకా అలంపూర్‌‌‌‌లో  అడుగుపెట్టననని అన్నారన్నారు. పట్టణం అప్పుడెలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని,  మంత్రి మాత్రం మళ్లీ పర్యటనకు వచ్చారని ఎద్దేవా చేశారు.  జోగులాంబ టెంపుల్‌‌లోనూ కొత్తగా ఒక్క సౌకర్యం కల్పించింది లేదన్నారు. మాట తప్పిన మంత్రి అలంపూర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే బతుకమ్మ చీరలు పంచుడు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని, ఎక్కడిపనులు అక్కడే దర్శనం ఇస్తున్నాయని మండిపడ్డారు.  ఈ కార్యక్రమంలో బీఎస్పీ అలంపూర్ నియోజకవర్గం ఇన్‌‌చార్జి కనకం బాబు, ఉపాధ్యక్షుడు యామని సుంకన్న, మండల అధ్యక్షుడు దేవరపోగు నాగరాజు, నేతలు  ప్రకాశం, సురేశ్, చిన్నమద్దిలేటి పాల్గొన్నారు.

హిందువులంతా ఏకం కావాలి

పెబ్బేరు, మరికల్‌‌ వెలుగు : దేశంలోని హిందువులంతా ఏకం కావాలని ఆర్‌‌‌‌ఎస్‌‌ఎస్‌‌ ముఖ్య వక్త పత్తి కొండ రామన్న పిలుపునిచ్చారు.  ఆర్‌‌‌‌ఎస్‌‌ఎస్‌‌ ప్రాథమిక శిక్షావర్గలో భాగంగా పెబ్బేరులో స్వయం సేవక్‌‌లకు శారీరక, మానసిక విద్యలపై శిక్షణ ఇచ్చారు. మరికల్‌‌లో పద సంచాలన్​ (రూట్​మార్చ్​) నిర్వహించారు. ఈ సందర్భంగా స్వయం సేవకులపై స్థానిక యువకులు  పూలు చల్లారు.  పెబ్బేరులో కొండ రామన్న మాట్లాడుతూ  నిజాం కాలంలో 1947 ఆగస్టు 15 నుంచి 1948 సెప్టెంబర్​ 17 వరకు రజాకార్లు హిందువులను హింసించారని చెప్పారు.  రాజకీయ పార్టీలు ఈ ఘటనలను దాచి పెట్టి.. పబ్బం గడుపుతున్నాయన్నారు.  

సీఎం కేసీఆర్‌‌‌‌పై పోరాటానికి మద్దతియ్యాలె

బండి సంజయ్‌‌ను కోరిన వాల్మీకి నేతలు

వనపర్తి, వెలుగు: వాల్మీకి బోయలకు ఎస్టీ రిజర్వేషన్ కల్పిస్తానని మాట తప్పిన సీఎం కేసీఆర్‌‌‌‌పై పోరాటానికి మద్దతు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌ను ఆ సంఘం నేతలు కోరారు. శనివారం రాత్రి కరీంగనర్‌‌‌‌లో దక్షిణ భారత వాల్మీకి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి నారాయణ ఆధ్వర్యంలో సంజయ్‌‌ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా  నారాయణ మాట్లాడుతూ 2014 ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ వాల్మీకి బోయలను  ఎస్టీ జాబితాలో కలుపుతామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.

రెండుసార్లు అధికారంలోకి వచ్చినా మాట నిలబెట్టుకోలేదని వాపోయారు.  వాల్మీకి బోయలకు తీవ్ర అన్యాయం చేసిన కేసీఆర్‌‌‌‌ను గద్దెదించే వరకు పోరాటం చేసేందుకు మద్దతివ్వాలని కోరారు. ఈ సమావేశంలో వాల్మీకి సంఘం జాతీయ నాయకులు వెంకటరమణ, బీజేపీ వనపర్తి జిల్లా ఇన్‌‌చార్జి బోసు పల్లి ప్రతాప్, జిల్లా అధికార ప్రతినిధి పెద్దిరాజు, భూపాలపల్లి వాల్మీకి సంఘం  నేతలు గోపాల్, వనపర్తి గిరిజన మోర్చా నేతలు కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మన్నెవారిపల్లెకు ఆర్‌‌‌‌అండ్‌‌ఆర్‌‌‌‌ ప్యాకేజీ ఇవ్వాలి

డీసీసీ ప్రెసిడెంట్ వంశీకృష్ణ

అచ్చంపేట, వెలుగు: నక్కల గండి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన మన్నెవారిపల్లి, బాల్యాతండా గ్రామస్తులకు  ఆర్‌‌‌‌అండ్‌‌ఆర్‌‌‌‌ ప్యాకేజీ ఇవ్వాలని డీసీసీ ప్రెసిడెంట్ డాక్టర్​వంశీ కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.  ఈ గ్రామాల్లో ప్రాజెక్టు కారణంగా నీట మునిగిన పంటలను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు కోసం భూములు గుంజుకున్న ప్రభుత్వం నిర్వాసితులకు ఎలాంటి ఉపాధి సౌకర్యాలు కల్పించకపోవడం సరికాదన్నారు.

 ప్రాజెక్టు పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు 20 శాతం రైతులకు పరిహారం  అందలేదని వాపోయారు. వారికి వెంటనే పరిహారం ఇవ్వాలని కోరారు. వరద ఎక్కువయ్యే సమయంలో అక్కారం, బక్కలింగాయ పల్లికి రాకపోకలు బంద్​అవుతున్నాయని, అక్కడ బ్రిడ్జి కట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రామనాథం, నేతలు నర్సయ్య యాదవ్, రాహుల్​ రెడ్డి, రాఘవులు, మల్లి ఖార్జున్, దశరథం  పాల్గొన్నారు. 

చరిత్రను వక్రీకరిస్తున్న రేవంత్ రెడ్డి

మాజీ మంత్రి చిత్త రంజన్‌‌ దాస్ 

కల్వకుర్తి, వెలుగు: టీపీసీసీ చీఫ్ రేవంత్‌‌ రెడ్డి చరిత్రను వక్రీకరిస్తున్నారని మాజీ మంత్రి చిత్త రంజన్‌‌ దాస్ విమర్శించారు. ఆదివారం కల్వకుర్తి తాలూకా అభివృద్ధి సాధన కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్‌‌మీట్ పెట్టి మాట్లాడారు.  రెండు రోజుల కింద మాడ్గులలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ సమావేశంలో రేవంత్‌‌ రెడ్డి పదేపదే అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు.  కల్వకుర్తి  ప్రజలు జైపాల్ రెడ్డిని నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, అయినా ఈ ప్రాంత ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.

జైపాల్ రెడ్డి మాత్రమే కల్వకుర్తిని ఉద్దరించారని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. కేఎల్‌‌ఐ జైపాల్‌‌ రెడ్డితోనే సాధ్యమైందని అంటున్న రేవంత్‌‌ రెడ్డి.. ఆ టైమ్‌‌లో రాజకీయ జీవితం ప్రారంభిచారా..?  అని ప్రశ్నించారు.  కేఎల్‌‌ఐ అంశాన్ని గవర్నర్ ప్రసంగంలో పెట్టేందుకు తాను ఎంతో చొరవ తీసుకున్నానని, ఈ పథకం సాధనలో మాజీ మంత్రి సమరసింహారెడ్డి,  వంగూరు జడ్పీటీసీ కెవిన్ రెడ్డి కృషి చేశారని గుర్తు చేశారు.

కేఎల్‌‌ఐని ఎన్‌‌టీఆర్‌‌‌‌ ప్రారంభిస్తే తర్వాత సీఎంలుగా ఉన్న  చంద్రబాబు,  వైఎస్సార్‌‌‌‌ పనులు చేపట్టారని వివరించారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ సర్పంచ్ పసుల ప్రభాకర్, కుర్మిద్ద మాజీ సర్పంచ్ పుట్ట శేఖర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్దయ్య యాదవ్, నేతలు శశి కుమార్, లక్ష్మయ్య, అంజయ్య గౌడ్,  సలీం, మధు, శేఖర్, శివ కుమార్ గౌడ్,  ఆంజనేయులు,  బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

రాఘవేందర్ డెడ్‌‌బాడీ దొరికింది

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: తెలకపల్లి మండలం తాళ్లపల్లి, కార్వాంగ వాగులో రెండు రోజుల క్రితం గల్లంతైన రైతు రాఘవేందర్‌‌‌‌(25)మృతదేహం ఆదివారం దొరికింది.   పొలం వద్దకు వెళ్లి వస్తుండగా వాగు ప్రవాహం ఎక్కువై కొట్టుకుపోయిన రాఘవేందర్‌‌‌‌ కోసం ఎన్‌‌డీఆర్‌‌‌‌ఎఫ్‌‌ రెస్క్యూ టీం రెండు రోజులుగా గాలిస్తోంది. ఆదివారం వాగులోని కంపచెట్లలో డెడ్‌‌బాడీ కనిపించడంతో బయటికి తీసి.. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడి అక్క నిర్మల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. 

బాపు, శాస్త్రి యాదిలో..

జాతిపిత మహత్మా గాంధీ,  జై జవాన్‌‌ జైకిసాన్‌‌ నినాదమిచ్చిన మాజీ ప్రధాని లాల్‌‌ బహదూర్ శాస్త్రిలను ఉమ్మడి జిల్లా ప్రజలు యాది జేసుకున్నారు. ఆదివారం వారి జయంతి కావడంతో అధికార యంత్రాంగం, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గాంధీ, శాస్త్రి ఫొటోలు, విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. పలుచోట్ల ఎమ్మెల్యేలు గాంధీ విగ్రహాలను ఆవిష్కరించారు.  అనంతరం మహనీయులు దేశానికి చేసిన సేవలను కొనియాడారు. వారి ఆశయ సాధనకు కృషి చేయాలని  పిలుపునిచ్చారు. - నెట్‌‌వర్క్‌‌, వెలుగు

శాకాహారంతోనే ఆరోగ్యం

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: శాకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఉమ్మడి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చెన్నకేశవులు, గుప్తా చెప్పారు. ఆదివారం మహబూబ్‌‌నగర్‌‌‌‌లో ఈ సొసైటీ ఆధ్వర్యంలో  నిర్వహించిన శాకాహార ర్యాలీని డీఎస్పీ మహేశ్ జెండా ఊపి ప్రారంభించారు.   ఈ సందర్భంగా చెన్నకేశవులు, గుప్తా మాట్లాడుతూ మాంసాహారంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. శాకాహారం తీసుకోవడంతో పాటు  ప్రతి రోజు ధ్యానం చేస్తే ఎలాంటి రోగాలు దరి చేరవన్నారు.  సొసైటీ జనరల్ సెక్రటరీ ప్రవీణ్, ట్రైజరర్‌‌‌‌ సత్యనారాయణ, సూర్య ప్రకాష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీపాల్ రెడ్డి  పాల్గొన్నారు.  

ఇథనాల్ ​కంపెనీ స్థానంలో వర్సిటీ పెట్టాలి

కేఏఎన్‌‌పీఎస్ ఆల్‌‌ ఇండియా కన్వీనర్​ బండారి లక్ష్మయ్య

మరికల్, వెలుగు: మరికల్ ​మండలం చిత్తనూర్​వద్ద ఏర్పాటు చేస్తున్న ఇథనాల్​కంపెనీని తొలగించి వ్యవసాయ యూనివర్సిటీ పెట్టాలని కేఏఎన్​పీఎస్​  ఆల్ ఇండియా కన్వీనర్​ బండారి లక్ష్మయ్య డిమాండ్​ చేశారు.  ఆదివారం మరికల్‌‌లో గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇథనాల్​ కంపెనీతో గాలి, నీరు, అడవులు,  సహజ వనరులు కలుషితం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.  ప్రతి గ్రామం తిరిగి కంపెనీ ఏర్పాటు వల్ల జరిగే నష్టాలను ప్రజలకు వివరిస్తామన్నారు.

ఈ నెల 30న మరికల్‌‌లో నిర్వహించే సభకు కంపెనీతో ప్రభావితం అయ్యే  అన్ని గ్రామాల ప్రజలు  హాజరుకావాలని కోరారు.  ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు వెంకట్రాములు, యాదగిరి, నాగేశ్​, చక్రవర్తి, లక్ష్మయ్య, గోవింద్​, మోహనకృష్ణ, చిత్తనూర్​ యువక మండలి సభ్యులు మురళి, రవీందర్​రెడ్డి, మణివర్దన్​రెడ్డి, చింతలయ్య, బాలకృష్ణ, హరీశ్​రెడ్డి పాల్గొన్నారు.

ఆగిన టిప్పర్‌‌‌‌ను ఢీకొట్టిన ఆటో

భార్య మృతి , భర్తకు తీవ్ర గాయాలు

అమనగల్లు, వెలుగు: ఆగి ఉన్న టిప్పర్‌‌‌‌ను ఆటో ఢీకొట్టడంతో భార్య మృతి చెందగా.. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. మాడ్గుల మండలం మన్యతండాకు చెందిన లాలు హైదరాబాద్‌‌లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. దసరా పండుగ కోసం భార్య మంజుల(25)తో కలిసి ఆదివారం స్వగ్రామానికి వస్తుండగా.. కొలుకులపల్లి గేటు సమీపంలో ఆగి ఉన్న టిప్పర్‌‌‌‌ను ఆటోతో ఢీకొట్టాడు.  ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. స్థానికులు రంగారెడ్డి జిల్లా మాల్‌‌ ఆస్పత్రికి తరలించారు.  అక్కడే చికిత్స పొందుతూ భార్య మృతి చెందింది.