- మంత్రి జూపల్లి కృష్ణారావు
- కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో పారదర్శకతకు పెద్దపీట
- సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలకు హాజరైన మంత్రి, కలెక్టర్
కొల్లాపూర్, వెలుగు : ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. శనివారం కొల్లాపూర్ క్యాంప్ కార్యాలయంలో 180 మంది లబ్ధిదారులకు రూ.1.81 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పులతో తులం బంగారం ఇవ్వలేకపోతున్నామని, అయితే మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, ఉచిత విద్యుత్ లాంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
సంక్షేమ పథకాల అమలులో ఎవరైనా డబ్బులు అడిగితే నేరుగా తనకు ఫిర్యాదు చేయాలని, దళారీ వ్యవస్థ లేకుండా పారదర్శకంగా లబ్ధి చేకూరుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అంకిరావుపల్లిలో పర్యటించి గ్రామ సమస్యలను సమీక్షించడంతో పాటు, అధికారులతో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై ప్రత్యేక సమావేశం నిర్వహించి అడ్డంకులను తొలగించాలని ఆదేశించారు.
సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో..
కొల్లాపూర్‌లో శనివారం నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాల్లో మంత్రి జూపల్లి, నాగర్ కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ ఉత్సాహంగా పాల్గొన్నారు. గిరిజన సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలతో కలిసి మంత్రి, కలెక్టర్ ఆడిపాడి గిరిజనుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సేవాలాల్ మహరాజ్ చూపిన శాంతి, అహింస మార్గాలు అందరికీ ఆచరణీయమని, విద్యతోనే గిరిజన సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అంతకుముందు కలెక్టర్ గిరిజన తలపాగా ధరించి భారీ ర్యాలీలో పాల్గొని నృత్యం చేశారు.
ఆ తర్వాత హోమ గుండంలో నెయ్యి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, బంజారాల సంప్రదాయ నృత్యాలు, వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ డాక్టర్ లక్ష్మణ్ , కొల్లాపూర్ ఆర్డీవో బన్సీలాల్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫిరంగి, వివిధ శాఖల అధికారులు, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
