- ప్రారంభించిన నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట, వెలుగు : ఫ్రీ బస్సు సర్వీసుతో ఊట్కూరు మండలం కొత్తపల్లి, పాతపల్లి, మొగ్దుంపూర్ గ్రామాలకు చెందిన మొత్తం 63 మంది విద్యార్థులు ప్రత్యక్ష లబ్ధి పొందనున్నట్లు నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఊట్కూరు మండలం బిజ్వార్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్కు అదే గ్రామానికి చెందిన అంబాత్రయ క్షేత్రం వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీజీ రూ.40 లక్షల వ్యయం గల పాఠశాల బస్సును అందజేశారు.
శనివారం కలెక్టర్ స్వామీజీతో కలిసి పాఠశాల బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు పాఠశాలకు సురక్షితంగా, సకాలంలో చేరుకునే రవాణా సౌకర్యం కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఉచిత పాఠశాల బస్సు ఒక వరం అన్నారు.
ఈ సౌకర్యాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో గోవిందరాజులు, ఆర్టీవో మేఘా గాంధీ, తహసీల్దార్ చింత రవి, ఎంపీడీవో కిషోర్ కుమార్, సర్పంచులు అంజయ్య, నర్సింలు, తెరప్, తిరుమలేశ్, పాఠశాల హెచ్ఎం కిశోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకనుగుణంగా పాలన అందించాలి
కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని సర్పంచులు సద్వినియోగం చేసుకుని ప్రజల అంచనాలకు అనుగుణంగా గ్రామాలలో మంచి పరిపాలన అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. శనివారం కేంద్రానికి సమీపంలోని సింగారం మలుపు దారి వద్ద గల వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల 3వ , 4వ బ్యాచ్ శిక్షణా కార్యక్రమ ముగింపులో కలెక్టర్ పలు సూచనలు చేశారు.
