V6 News

జాన్సన్ & జాన్సన్‌కు భారీ షాక్: బేబీ పౌడర్ కేసులో రూ.360 కోట్లు ఫైన్ వేసిన కోర్టు

జాన్సన్ & జాన్సన్‌కు భారీ షాక్: బేబీ పౌడర్ కేసులో రూ.360 కోట్లు ఫైన్ వేసిన కోర్టు

ప్రముఖ ఫార్మా దిగ్గజం జాన్సన్ & జాన్సన్ కంపెనీకి అమెరికాలో మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తమ టాల్క్ ఆధారిత బేబీ పౌడర్ వాడటం వల్లే క్యాన్సర్ వచ్చిందంటూ ఇద్దరు మహిళలు వేసిన కేసులో వారికి పరిహారంగా 40 మిలియన్ డాలర్లు చెల్లించాలని కాలిఫోర్నియాలోని కోర్టు తీర్పు ఇచ్చింది. భారతీయ కరెన్సీ లెక్కల ప్రకారం ఈ మెుత్తం విలువ దాదాపు రూ.360 కోట్లుగా ఉంది.

కాలిఫోర్నియాకు చెందిన మోనికా కెంట్, డెబోరా షుల్ట్జ్ అనే ఈ ఇద్దరు మహిళలు.. దాదాపు 40 సంవత్సరాల పాటు స్నానం చేసిన తర్వాత జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్‌ను ఉపయోగించామని తెలిపారు. ఈ కారణంగానే వారికి అండాశయ క్యాన్సర్ వచ్చిందని కోర్టులో వాదించారు. కెంట్ 2014లో, షుల్ట్జ్ 2018లో క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది. దీని వల్ల చికిత్సలో భాగంగా సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చిందని, కీమోథెరపీ కూడా చేయించుకున్నట్లు వారు కోర్టుకు తెలిపారు.

J&J తమ టాల్క్-ఆధారిత ఉత్పత్తుల ప్రమాదం గురించి అనేక సంవత్సరాలుగా తెలిసినప్పటికీ, వినియోగదారులను అప్రమత్తం చేయడంలో విఫలమైందని కోర్టు నిర్ధారించింది. అయితే కంపెనీ ఈ విషయంపై దురుద్దేశంతో వ్యవహరించిందనడానికి లేదా మోసం చేసిందనడానికి మాత్రం ఆధారాలు లేవని జ్యూరీ పేర్కొంది. అయినప్పటికీ నిర్లక్ష్యం, సరైన హెచ్చరిక ఇవ్వకపోవడం వల్లే వారికి క్యాన్సర్ వచ్చిందని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పుపై అప్పీల్ కోసం మరో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. 

తమ ఉత్పత్తులు సురక్షితమని, క్యాన్సర్‌కు కారణం కావని, వాటిలో ఆస్బెస్టాస్ లేదని కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ పదేపదే వాదిస్తోంది. ఈ కేసులో సైన్స్ ఆధారాలు లేవని J&J తరపు న్యాయవాదులు వాదించారు. ప్రస్తుతానికి J&J కంపెనీపై బేబీ పౌడర్ కారణంగా క్యాన్సర్ వచ్చిందని ఆరోపిస్తూ 67వేల మందికి పైగా వ్యక్తులు దావాలు వేశారు. గతంలో కూడా కంపెనీకి వ్యతిరేకంగా కొన్ని తీర్పులు రాగా, వాటిలో అత్యధికంగా 4.69 బిలియన్ డాలర్ల వరకు పరిహారం ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. అయితే కొన్ని కేసుల్లో కంపెనీ కూడా గెలిచింది. టాల్క్ కేసుల నుంచి బయటపడటానికి కంపెనీ గతంలో దివాలా ప్రక్రియ ద్వారా ప్రయత్నించినప్పటికీ అది మూడుసార్లు విఫలమైంది.

ALSO READ : తగ్గిన బంగారం వెండి..

2020లో J&J తమ టాల్క్ ఆధారిత బేబీ పౌడర్ అమ్మకాలను అమెరికాలో నిలిపివేసి, దాని స్థానంలో కార్న్‌స్టార్చ్ ఆధారిత పౌడర్‌ను ప్రవేశపెట్టింది. చట్టపరమైన పోరాటం, భారీ పరిహారాల నేప‌థ్యంలో తాజా కోర్టు తీర్పు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల దృష్టిని మరోసారి ఆకర్షిస్తోంది.