బేబీ పౌడర్ అమ్మకాలకు ఫుల్ స్టాప్

బేబీ పౌడర్ అమ్మకాలకు ఫుల్ స్టాప్

మెడికల్ ఉత్పత్తుల సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కీలక నిర్ణయం తీసుకుంది. టాల్కమ్ పౌడర్ విక్రయాలను 2023 నుంచి ప్రపంచ వ్యాప్తంగా నిలిపివేయనున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న పౌడర్ లో క్యాన్సర్ కారక ఆస్ బెస్టాస్ అవశేషాలున్నాయని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. టాల్కం పౌడర్ కు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా 38 వేల కేసులు నడుస్తున్నట్లు తెలుస్తోంది. కోర్టుల కేసుల కారణంగా.. టాల్కమ్ పౌడర్ విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. క్యాన్సర్ కారకాలు ఏమీ లేవని కోర్టులకు నివేదించింది. అయితే.. 1971 నుంచి 2000 వరకు జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్ లో కొద్ది మొత్తంలో ఆస్ బెస్టాస్ ఉన్నట్లుగా ఆ కంపెనీ అంతర్గత రికార్డుల్లో పేర్కొన్నారనే వాదనలు ఉన్నాయి.

దీనిపై 2018లోనే రాయిటర్స్ ఓ కథనాన్ని ప్రచురించడం ప్రకంపనలు సృష్టించింది. తాజాగా.. మక్కలతో కూడిన కార్న్ స్టార్చ్ ఆధారిత పౌడర్ ను తయారు చేయాలని నిర్ణయించడం జరిగిందని కంపెనీ వెల్లడించింది.1984 నుంచి బేబీ టాల్కం పౌడర్ కు పెట్టింది పేరుగా జాన్సన్ అండ్ జాన్సన్ నిలిచింది. అయితే.. పౌడర్ వల్లే తాము క్యాన్సర్ బారిన పడ్డామని బాధితులు, మృతుల బంధువులు కోర్టు మెట్లు ఎక్కారు. ఈ ఆరోపణలను తొలుత నుంచి కంపెనీ ఖండిస్తూ వచ్చింది. బాధితులకు అనుకూలంగా కోర్టులు తీర్పునిచ్చాయి. 22 మంది మహిళలకు రూ. 200 కోట్ల డాలర్లకు పైగా పరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడు 2023 నుంచి టాల్కమ్ పౌడర్ విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.