పీఎం ఫసల్ బీమాలో చేరడం మంచి నిర్ణయం : చిన్నారెడ్డి

పీఎం ఫసల్ బీమాలో చేరడం మంచి నిర్ణయం :   చిన్నారెడ్డి

హైదరాబాద్, వెలుగు: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో రాష్ట్ర ప్రభుత్వం చేరడం మంచి పరిణామమని  రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి అన్నారు. దీనివల్ల  రాష్ట్ర రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. సీఎం  రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నదని తెలిపారు. అతివృష్టి, అనావృష్టి వల్ల పంటల కు నష్టం జరిగిన సందర్భంలో పీఎం ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకు మేలు జరుగుతుందన్నారు. పంట నష్ట పరిహారాన్ని  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయని వెల్లడించారు.  నామమాత్రం గా రైతుల నుంచి ప్రీమియం తీసుకుంటా రని వివరించారు.  2020 నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కనీస ప్రీమియం కూడా కట్టకుండా రైతులకు అన్యాయం చేసిందని ఆరోపించారు. రైతులు చెల్లించే నామమాత్రపు ప్రీమియంను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.