
ఐపీఎల్ 2025 కి మధ్యలో బ్రేక్ రావడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రతికూలంగా మారింది. లీగ్ మ్యాచ్ ల వరకూ ప్లేయర్లు అందరూ అందుబాటులో ఉన్నప్పటికీ ప్లే ఆఫ్స్ కు ముందు ఆ జట్టు కీలక ఆటగాళ్ల సేవలను కోల్పోనుంది. ఈ లిస్ట్ లో ముగ్గురు ఫారెన్ ప్లేయర్లు ఉండడం నిరాశను కలిగిస్తుంది. ఐపీఎల్ సీజన్ లోని మిగిలిన మ్యాచ్ లు శుక్రవారం (మే 16) నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలా జరిగితే షెడ్యూల్ మే 30 వరకు కొనసాగించాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజల్ వుడ్ , సౌతాఫ్రికా పేసర్ లుంగీ ఎంగిడి, వెస్టిండీస్ ఆల్ రౌండర్ రొమారియో షెపర్డ్ వారి స్వదేశానికి వెళ్లనున్నారు.
2025 టెస్ట్ ఛాంపియన్స్ షిప్ ఫైనల్ జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరగనుంది. ఆస్ట్రేలియా తరపున హేజల్ వుడ్ కీలక ఫాస్ట్ బౌలర్ కాగా.. సౌతాఫ్రికా టెస్ట్ జట్టులో ఎంగిడి రెగ్యులర్ ఫాస్ట్ బౌలర్. వీరు ప్లే ఆఫ్స్ సమయానికి స్వదేశానికి పయనమవడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం జోష్ హేజల్ వుడ్ భుజం గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. అతడిని ఐపీఎల్ ఆడించే ఉద్దేశ్యం ఆస్ట్రేలియాకు క్రికెట్ కు లేనట్టు సమాచారం. ఈ ఆసీస్ బౌలర్ ఇప్పటికే స్వదేశానికి చేరుకున్నాడు. ఎంగిడి, షెపర్డ్ త్వరలోనే తమ దేశానికి వెళ్లనున్నారు.
వెస్టిండీస్ ఆల్ రౌండర్ రొమారియో షెపర్డ్ ప్లే ఆఫ్స్ మ్యాచ్ లకు అందుబాటులో లేకపోవడానికి కారణం లేకపోలేదు. ఈ విండీస్ ఆల్ రౌండర్ ఇటీవలే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం వెస్టిండీస్ వన్డే జట్టులో స్థానం దక్కించుకున్నాడు. దీంతో స్వదేశానికి పయనం కాక తప్పట్లేదు. 15 మంది స్క్వాడ్ లో షెపర్డ్ స్థానం దక్కించుకున్నాడు. వెస్టిండీస్ మే 21- 25 మధ్య ఐర్లాండ్‌తో మూడు వన్డేలు ఆడనుంది. అదే సమయంలో ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు జరుగుతాయి.
ఈ ముగ్గురు లేకపోతే ఆర్సీబీ కాస్త బలహీనంగా మారే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా జోష్ హేజల్ వుడ్ గాయం ఆ జట్టును ఆందోళనకు గురి చేస్తుంది. ఈ సీజన్ లో ఆర్సీబీ ఆడిన 11 మ్యాచ్ ల్లో 8 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం 16 పాయింట్లతో ఉన్న పటిదార్ సేన.. తర్వాత జరగబోయే మూడు మ్యాచ్ ల్లో ఒకటి గెలిచినా ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. కనీసం రెండు మ్యాచ్ లు గెలిచినా ప్లే టాప్-2 లో ఉండే అవకాశం ఉంది. మిగిలిన మూడు మ్యాచ్ లు లక్నో సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్,కోల్ కతా నైట్ రైడర్స్ తో ఆడాల్సి ఉంది.