జర్నలిస్టులందరికీ ఒకే అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాలి : వజ్జె వీరయ్య యాదవ్

జర్నలిస్టులందరికీ ఒకే అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాలి : వజ్జె వీరయ్య యాదవ్

సూర్యాపేట, వెలుగు:  జీవో 252  జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ఉందని టీయూడబ్ల్యూజే (హెచ్- 143)జిల్లా సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు వజ్జె వీరయ్య యాదవ్ విమర్శించారు.  జర్నలిస్టుల అక్రిడిటేషన్ కోసం తీసుకొచ్చిన నూతన జీవో 252 ని వ్యతిరేకిస్తూ శనివారం కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  జర్నలిస్టులకు అన్యాయం చేసే విధంగా ఈ జీవోని తీసుకురావడాన్ని టీయూడబ్ల్యూజే (హెచ్- 143) తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. గతంలో డెస్క్ జర్నలిస్టులు, సాధారణ జర్నలిస్టులకు అందరికి ఒకే విధంగా ఉన్న అక్రిడిటేషన్ కార్డుల స్థానంలో తాజాగా డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డు, సాధారణ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డు పేరిట జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా నూతన జీవో ఉందన్నారు. 

ఏ కార్డుతో ఏ ప్రయోజనం ఉంటుందో స్పష్టత ఇవ్వక పోవడం, గతంలో ఉన్న సంఖ్య కంటే తక్కువగా తాజా జీవో ద్వారా అక్రిడిటేషన్ కార్డులను కుదించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు అయోమయంగా ఉన్న జీవోని 252 ని తక్షణమే సవరించాలని  డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయ ఏవో సంతోష్ కిరణ్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు నాయకులు గుండా శ్రీనివాస్ గుప్తా, ఫణీంద్ర, హరి కిషన్, బొజ్జ ఎడ్వర్డ్, చల్లా చంద్ర శేఖర్, ఊటుకూరి రవీందర్, రాపర్తి మహేష్, పెద్దింటి శ్యాంసుందర్ రెడ్డి, గుణగంటి సురేష్, అమరగాని నాగేందర్, వల్దాస్ ప్రవీణ్, సైదిరెడ్డి, చారి,యాకయ్య,పురుషోత్తం,అయినాల శ్రీనివాస్,వీరన్న నాయక్,సతీష్ తదితరులు పాల్గొన్నారు.

రెండు కార్డుల విధానాన్ని రద్దు చేయాలి

నల్గొండ, వెలుగు: జీవో 252లోని స్పష్టతలేని నిబంధనలను వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు శాంతియుతంగా నిరసన చేపట్టారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, డెస్క్, కేబుల్, ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఐక్యంగా పాల్గొని, రెండు కార్డుల విధానం, అక్రిడిటేషన్లలో కోతలు, ఫ్రీలాన్స్- పార్ట్ టైం జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ ఇవ్వాలని స్పష్టంగా డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా దీర్ఘకాలిక ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తూ, జర్నలిస్టుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని టీయుడబ్ల్యూజే జిల్లా అద్యక్షుడు గుండగొని జయ శంకర్ తెలిపారు. కార్యక్రమంలో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.