
- అన్ని వర్గాలనూ రేవంత్ సర్కార్ మోసం చేసింది: జేపీ నడ్డా
- కాంగ్రెస్ పరాన్నజీవి.. ప్రాంతీయ పార్టీల బలహీనతే ఆ పార్టీ బలం
- అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడుపుతున్నరు
- వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకివస్తుందని ధీమా
- హైదరాబాద్‌లో బీజేపీ బహిరంగ సభ
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలనూ కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తున్నదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. అబద్ధపు హామీలు, మాయమాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. సీఎం రేవంత్ పాలనను ఎండగట్టేందుకు, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజెప్పేందుకు బీజేపీ నడుం బిగించిందని తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని సరూర్ నగర్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో నడ్డా మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు మాయ లోళ్లు అని విమర్శించారు.‘‘సీఎం రేవంత్‌రెడ్డి కూడా మాయమాటలు చెప్పేటోడే. రేవంత్ సర్కార్.. మాయా సర్కార్.. మ్యాజిక్సర్కార్.. ప్రజల కళ్లలో మట్టి కొట్టే సర్కార్. రేవంత్ రెడ్డి.. మాయల ఫకీర్‌లా డ్రామాలాడుతున్నారు’’ అంటూ విమర్శలు గుప్పించారు. ‘‘రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా రూ.15 వేలు, కౌలు రైతులు, రైతు కూలీలకు రూ. 12 వేలు, ఆటో డ్రైవర్లకు రూ. 12 వేలు ఇస్తామన్నారు.. అవన్నీ ఏమైనయ్? విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు.. ఆ భరోసా ఏమైంది? మహిళలకు రూ. 2,500, కల్యాణలక్ష్మి కింద రూ. లక్ష, తులం బంగారం ఏది? నిరుద్యోగులకు ఇస్తానన్న భృతి ఎక్కడ?” అని ప్రశ్నించారు. అన్ని వర్గాలనూ కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని, అందుకే కాంగ్రెస్ నాయకులను మాయలోళ్లు అని అంటున్నానని చెప్పారు.
కాంగ్రెస్.. కాలిబూడిదయ్యే కొర్రాయి
దేశంలో ఎక్కడ చూసినా ప్రాంతీయ పార్టీలపైనే కాంగ్రెస్ ఆధారపడిందని, బీజేపీతో నేరుగా తలపడి ఒక్క రాష్ట్రంలోనూ గెలవలేదని నడ్డా అన్నారు. ‘‘కాంగ్రెస్‌పార్టీ పరాన్నజీవి.. వేరే పార్టీలతో జతకట్టి వాటిని కూడా ముంచేస్తుంది. రీజనల్ పార్టీలే కాంగ్రెస్‌పార్టీని గెలిపిస్తాయి. తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో రీజనల్పార్టీలతో జత కట్టి ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నది. ఇతర పార్టీల బలహీనతలే కాంగ్రెస్ బలం” అని విమర్శించారు. ‘‘కాంగ్రెస్ అబద్ధపు హామీలతో కర్నాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. కానీ ఏ ఒక్క రాష్ట్రంలోనూ హామీలు అమలు చేయడం లేదు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నది. కాంగ్రెస్‌పార్టీ కాలి బూడిదయ్యే కొర్రాయి లాంటిది. ఒక్కసారి కాంగ్రెస్ ను ప్రజలు తిరస్కరిస్తే, మళ్లీ ఆ పార్టీని ఆదరించరు. 60 ఏండ్లుగా తమిళనాడులో, 30 ఏండ్లుగా గుజరాత్ లో, 20 ఏండ్లుగా ఉత్తరప్రదేశ్ లో, 25 ఏండ్లుగా బిహార్ లో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. రానున్న రోజుల్లో తెలంగాణలోనూ కాంగ్రెస్ కు అదే గతి పడుతుంది” అని అన్నారు.
కేంద్రం రూ.1.60 లక్షల కోట్లు ఇచ్చింది..
రాష్ట్రంలో అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని నడ్డా విమర్శించారు. అప్పులు చేస్తూ పాలన సాగించే ప్రభుత్వాలు ఎక్కువకాలం మనుగడ సాగించలేవని అన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.1.60 లక్షల కోట్లు ఇచ్చిందని వెల్లడించారు. ‘‘వివిధ గ్రాంట్ల కింద రూ.1.12 లక్షల కోట్లు, వరంగల్‌కు రూ. 27 కోట్లు, టెక్స్టైల్, రైల్వేకు రూ.20 కోట్లు, మూడు వందేభారత్ రైళ్లు, భారత్ మాల ప్రాజెక్టు కింద హైదరాబాద్–ఇండోర్, సూరత్– చెన్నై–హైదరాబాద్, హైదరాబాద్–విశాఖపట్నం ఎకనామిక్కారిడార్లు, బీబీనగర్‌లో ఎయిమ్స్ప్రాజెక్టులను కేంద్రం ఇచ్చింది. బీజేపీ ఇవ్వని హామీలను కూడా నెరవేర్చుతుంది.. కానీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కూడా అమలు చేయదు” అని అన్నారు.
తెలంగాణ ఫ్యూచర్ బీజేపీనే..
బీజేపీతోనే తెలంగాణలో మార్పు సాధ్యమని నడ్డా అన్నారు. ‘‘కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలు, యువత, కార్మికులు.. ఇలా అందరూ ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లం దరికీ బీజేపీ అండగా ఉంటుంది. వాళ్ల సమస్యలపై పోరాడుతుంది. తెలంగా ణలో అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం. లోక్‌సభ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిద ర్శనం. మహారాష్ట్రలో మళ్లీ అధికారంలోకి వచ్చాం. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ విజయం సాధిస్తాం” అని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీనే తెలంగాణ ఫ్యూచర్ అని చెప్పారు. ‘‘ప్రతిపక్షాలన్నీ ఒక్కటైనా మోదీ మూడోసారి ప్రధాని అయ్యారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీనే గెలుస్తున్నది. మా పార్టీ ఒంటరిగా 13 రాష్ట్రా ల్లో అధికారంలో ఉంది. మరో 6 రాష్ట్రాల్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో అధికారంలో ఉంది. బీజేపీతో నేరుగా తలపడ్డ ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ గెలవలేదు. ఒక రాష్ట్రంలో బీజేపీ ఒకసారి అధికారంలో వస్తే, ఇక అక్కడ పర్మనెంట్ గా ఉంటుంది. భవిష్యత్తులో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం” అని చెప్పారు.
ఏడాదిలో కొత్త రేషన్ కార్డు ఒక్కటన్నా ఇచ్చారా? : కిషన్ రెడ్డి
ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన రేవంత్ సర్కార్..ఏడాది పూర్తయినా అమలు చేయలేదని కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించారు. ఏడాది కాలంలో ఒక్క కొత్త పింఛన్, ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని తెలిపారు. " బీఆర్ఎస్, -కాంగ్రెస్ పార్టీలవి ఒకే డీఎన్ఏ. అవి రెండూ ఒకే తానుముక్కలు. పాలనలో కేసీఆర్-, రేవంత్ రెడ్డి కవల పిల్లల్లాంటివారు. బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ పార్టీ అవినీతి, కుటుంబ, అహంకార పాలన కొనసాగిస్తున్నది. పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు ఇస్తే.. బీజేపీకి8 సీట్లు ఇచ్చారు.
ALSO READ | నడ్డా.. అడ్డగోలు మాటలొద్దు.. 21 వేల కోట్ల రుణమాఫీ చేశాం: సీఎం రేవంత్ రెడ్డి
దీన్ని బట్టి చూస్తే.. రాష్ట్రంలో బీజేపీ బలపడాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించి, బీజేపీ జెండా ఎగరేసేంత వరకు ప్రజల తరఫున పోరాటం చేస్తాం" అని కిషన్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. అర్బన్ నక్సల్స్ చేతిలో కాంగ్రెస్ సర్కార్ బందీగా మారిందన్నారు. రేవంత్ రెడ్డి భాష, చెప్పే అబద్ధాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని.. ఆయనను ప్రజలెవరూ సీఎంగానే గుర్తించడం లేదని ఎద్దేవా చేశారు. ఎన్నడైనా రైతుల కోసం, మహిళల కోసం, నిరుద్యోగుల కోసం కొట్లాడి రేవంత్ జైలుకు పోయిండా? అని ప్రశ్నించారు. సంక్రాంతిలోగా ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ నేతలను గల్లీల్లో తిరగనీయమని హెచ్చరించారు. ఈసారి మేయర్ పీఠం బీజేపీదేని బండి సంజయ్ పేర్కొన్నారు.