
పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భూట్టో కుమారుడు బిలావల్ భుట్టో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై మండిపడ్డారు. పాకిస్తాన్ ను ప్రపంచానికి శత్రుదేశంగా మార్చేశారని ఆరోపించారు. అయితే ఇండియా-పాక్ మధ్య ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై బిలావల్ మాట్లాడారు. ఉగ్ర సంస్థలకు పాక్‌లో స్థానం ఉండబోదని ఇమ్రాన్ అన్న వ్యాఖ్యలపై స్పందించారు. పాకిస్తాన్ తో క్రమంగా అన్ని దేశాలు సంబంధాలు తెంచుకుంటున్నాయన్నారు. ప్రధాని ఇమ్రాన్ తీసుకుంటున్న చర్యలే ఇందుకు కారణమన్నారు. ఉగ్రవాద నియంత్రణకు చర్యలు తీసుకుంటుంటే ప్రపంచ దేశాలు పాక్‌పై ఎందుకు మండిపడుతున్నాయని ప్రశ్నించారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులకు నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయన్నారు. ఇండియాపాక్ మధ్య ఎప్పటి నుంచో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో ఎందుకు ఎక్కువయ్యాయన్నారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిజంగా శాంతిని కోరుకుంటుంటే ముందు ప్రపంచ దేశాల ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు ఉగ్రవాద నియంత్రణ పట్ల నిజాయతీగా ఉన్నట్లయితే మేం చెప్పే మూడు విషయాలను తీవ్రంగా పరిగణలోకి తీసుకోవాలన్నారు. ‘పార్లమెంట్ నేషనల్ సెక్యూరిటీ కమిటీని నియమించండి, ఖనిషేధిత ఉగ్రవాద సంస్థలకు మద్దతివ్వడం ఆపేయండి. లేదా వారికి దూరంగా ఉండండి, మంత్రి వర్గంలో ఉండి నిషేధిత సంస్థలతో బంధాలు కొనసాగిస్తున్న వారిపై విచారణ జరిపి వారిని తొలగించండి’. ఈ మూడు చర్యలు ప్రభుత్వం తీసుకుంటే ఉగ్రవాద నియంత్రణకు పాక్ ప్రభుత్వం కృషి చేస్తుందని మాతో పాటు అందరూ నమ్ముతారన్నారు భుట్టో.