జూబ్లీహిల్స్ ఎన్నికల పనులు స్పీడప్

జూబ్లీహిల్స్ ఎన్నికల పనులు స్పీడప్
  • 127 పోలింగ్ స్టేషన్లలో407 పోలింగ్ బూత్​లు
  • ఒక్కో పోలింగ్ బూత్​కు4 చొప్పున 1,628 ఈవీఎంలు రెడీ
  • 509 కంట్రోల్ యూనిట్లు,509 వీవీ ప్యాట్లు సిద్ధం 

హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. పోలింగ్ కు 13 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తో పాటు ఎన్నికల పరిశీలకులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. పోలింగ్ అధికారులు, సిబ్బందితో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 127 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. 

వీటి పరిధిలో 407 పోలింగ్ బూత్ లను సిద్ధం చేయనున్నారు. ప్రతి పోలింగ్ బూత్‌‌‌‌లో 4 చొప్పున 1,628 ఈవీఎంలను రెడీ చేశారు. వీటితో పాటు 509 కంట్రోల్ యూనిట్లు, 509 వీవీ ప్యాట్లు కూడా అందుబాటులో ఉంచారు. ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. పోలింగ్ కు ఒక రోజు ముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో పోలింగ్ సామగ్రిని సిబ్బందికి అందజేయనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో మంచినీరు, టాయిలెట్ల వంటి కనీస వసతులు తప్పనిసరిగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైతే మోబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయనున్నారు. 

రంగంలోకి కేంద్ర బలగాలు

పోలింగ్​ ప్రశాంతంగా పూర్తయ్యేందుకు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. మంగళవారం 8 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలు జూబ్లీహిల్స్‌‌‌‌కు చేరుకున్నాయి. ఒక్కో కంపెనీకి సంబంధించి 90 మంది చొప్పున 720 మంది చేరుకున్నారు. వీరితో పాటు 1,666 మంది లోకల్ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే గుర్తించిన 65 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల సమీపంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలు నియోజకవర్గం బార్డర్లలో తనిఖీలు చేపట్టనున్నాయి.