
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక మాకు సవాల్: బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్రావు
- రాజకీయ సమీకరణాలు మారినయ్
- మీడియాపై దాడులను ఖండిస్తున్నట్లు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ముఖ్య నేతలతో చర్చించి 20 రోజుల్లో కొత్త వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసుకుంటామని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్.రాంచందర్ రావు తెలిపారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలతో పాటు దక్షిణ తెలంగాణపై ఎక్కువ ఫోకస్ పెడతామని చెప్పారు. పార్టీ తల్లి లాంటిదని.. ఎవరూ మోసం చేయొద్దని అన్నారు. పార్టీలో గ్రూపులు లేవని స్పష్టం చేశారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీకి ఒక పెద్ద సవాల్ అని, గతంలో ఉన్న రాజకీయ సమీకరణాలు ఇప్పుడు మారిపోయాయని చెప్పారు.
ఈ సారి జూబ్లీహిల్స్‌లో బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం ఉపఎన్నికలో పోటీ చేస్తుందా లేదా అనేది ఇంకా తెల్వదని, ఒకవేళ పోటీ చేయకపోతే బీఆర్ఎస్‌కు మద్దతిస్తుందా, కాంగ్రెస్‌కు మద్దతిస్తుందా అనేది చూడాలన్నారు. సాధారణంగా ఉప ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉండవని, పైగా ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు అని, ఈ రెండింటినీ దాటుకొని బీజేపీ ఓట్లు సాధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా దృష్టి సారిస్తున్నామన్నారు.
అక్బరుద్దీన్ కాలేజీని కూల్చాల్సిందే..
సల్కం చెరువు భూమిలో అక్రమంగా నిర్మించిన అక్బరుద్దీన్ ఒవైసీ కాలేజీ బిల్డింగ్‌ను వెంటనే కూల్చేయాలని, లేకపోతే ప్రజల పక్షాన ఆ పని తామే చేస్తామని రామచందర్‌రావు ప్రకటనలో హెచ్చరించారు. ‘‘అక్బరుద్దీన్‌కు ఒక న్యాయం.. పేదోడికి ఒక న్యాయమా? మూసీ పరివాహక ప్రాంతాల్లోని పేదల ఇండ్లను కూల్చేశారు. అక్రమంగా కట్టిన కాలేజీని వదిలేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో చెరువు శిఖం భూములు అని తెలియక డబ్బులు పెట్టి ఇండ్లు కట్టుకున్న వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజల ఇండ్లను కూల్చేశారు. అక్బరుద్దీన్ కాలేజీల్లో చదివే వాళ్ల జీవితాలే ముఖ్యమా? మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది మంది పేదల జీవితాలు మీకు పట్టవా?’ అని రామచందర్ రావు పేర్కొన్నారు. గతేడాది కాలేజీకి నోటీసులిచ్చి, విద్యాసంవత్సరం ముగిసిన వెంటనే కూల్చేస్తామని చెప్పి, ఇప్పుడు మాట మార్చడం సరికాదని తెలిపారు.
చిత్తుగా ఓడించినా బీఆర్ఎస్‌కు బుద్ధి రాలే
బీఆర్ఎస్ లీడర్లు మీడియా సంస్థలపై దాడులు చేయడాన్ని రాంచందర్రావు ఖండించారు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థలపై బీఆర్ఎస్ మూకలు దాడులకు ప్రయత్నిస్తున్నాయని పోలీసుల నుంచి సమాచారం వచ్చిందని, ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు. ప్రజలు బీఆర్ఎస్ ను చిత్తుచిత్తుగా ఓడించినా బుద్ధి రాలేదని, ఏం చేయాలో తెల్వక మీడియా సంస్థలపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కొన్ని రోజుల కింద మహాన్యూస్ పై దాడి చేశారని, ఇప్పుడు ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై దాడికి సిద్ధమయ్యారని మండిపడ్డారు.