- ప్రచారంలో వేగం పెంచని బీజేపీ ట్రయాంగిల్ ఫైట్‌తో
- కాంగ్రెస్‌కు కలిసొస్తుందనే భావనలో కమలం
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ఉప ఎన్నికను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్‌తో పాటు బీజేపీ కూడా గెలుపుపై కన్నేశాయి. ఈ నియోజకవర్గంలో సంపన్న ప్రాంతాలు, మధ్యతరగతి కాలనీలు, బస్తీలు ఉండడంతో ఇక్కడి ఓటర్లు ఇచ్చే తీర్పు.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీల బలాబలాలను స్పష్టంగా ప్రతిబింబిస్తుందని నాయకులు భావిస్తున్నారు.
అధికారంలోకి వచ్చాక జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో, ఇందులో గెలవాలని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. గెలిస్తే తమ ప్రభుత్వ పనితీరుకు ప్రజల నుంచి బలమైన ఆమోదం లభించినట్టవుతుందని భావిస్తున్నది. ఈ విజయం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్లస్ అవుతుందని అనుకుంటున్నది. బై ఎలక్షన్‌లో గెలిస్తే ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని నిరూపితమవుతుందని, తద్వారా సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చినట్టవుతుందని, పాలనా విషయంలో సీఎం మరింత స్పీడ్‌గా ముందుకు వెళ్లడానికి బూస్ట్ అవుతుందని భావిస్తున్నది.
ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఈ ఎన్నికలో విజేతను నిర్ణయించే అంశాల్లో సంక్షేమ పథకాలు, స్థానిక అభివృద్ధి అంశాలతో పాటు ఓట్ల చీలిక కీలకం కానుంది. నియోజకవర్గంలోని సుమారు 35 శాతం మైనారిటీ ఓటర్లు, 60 శాతానికి పైగా ఉన్న బస్తీ ఓటర్లే.. ఇక్కడ ఫలితాన్ని నిర్దేశించే అవకాశం ఉంది. ఎంఐఎం మద్దతు ఉండటంతో మైనారిటీ ఓట్లను ఏకం చేయడంలో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ భావిస్తున్నది.
బీఆర్‌ఎస్‌కు బీజేపీ మద్దతు?
లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన బీజేపీ.. సిటీలో బలపడేందుకు ప్రయత్నిస్తున్నది. కానీ ఆ పార్టీ ప్రచారంలో వెనుకంజలో ఉన్నట్టు కనిపిస్తున్నది. ఈ నియోజకవర్గంలో ఏర్పడిన ట్రయాంగిల్ ఫైట్ కాంగ్రెస్‌కు కలిసొస్తుందనే భావనలో బీజేపీ ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ కావాలనే ప్రచార వేగం తగ్గించి, అంతర్గతంగా బీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తున్నదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సహకరించిందని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్‌కు బీజేపీ సపోర్టు చేస్తూ, ట్రయాంగిల్ ఫైట్ లేకుండా చూస్తున్నదని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉండేలా చేస్తున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బీఆర్ఎస్‌కు సవాల్..
బీఆర్‌ఎస్‌కు ఈ ఉప ఎన్నిక సవాల్‌గా మారింది. సిట్టింగ్స్థానాన్ని కాపాడుకునేందుకు ఆ పార్టీ తంటాలు పడుతున్నది. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో నెలకొన్న సంక్షోభం, లోక్‌సభ ఎన్నికల్లో ఓటు బ్యాంకు గణనీయంగా పడిపోవడం, ఈసారి ఎంఐఎం మద్దతు లేకపోవడంతో బీఆర్‌ఎస్ కష్టాలు ఎదుర్కొంటున్నది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతను బరిలోకి దించినప్పటికీ, సానుభూతి వర్కవుట్ అవుతుందో లేదోనని ఆ పార్టీలో ఆందోళన నెలకొన్నది.
