జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ స్టార్ట్.. మొదట 101 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ స్టార్ట్.. మొదట 101 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు

హైదరాబాద్: యావత్ తెలంగాణ రాష్ట్రం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. శుక్రవారం (నవంబర్ 14) ఉదయం 8 గంటల నుంచి యూసఫ్‎గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ మొదలైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించనున్నారు.  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో  మొత్తం101 పోస్టల్ ఓట్లు నమోదు అయ్యాయి.

 హోమ్ ఓటింగ్ ద్వారా 101 పోస్టల్ ఓట్లు వేశారు వృద్ధులు, వికలాంగులు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల తర్వాత ఈవీఎంలను ఓపెన్ చేయనున్నారు. ఓట్ల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కౌంటింగ్ కేంద్ర దగ్గర 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు భారీగా బందోబస్తు మోహరించారు. 

మొత్తం 10 రౌండ్లలో కౌంటింగ్​ చేపట్టనున్నారు. గంట గంటన్నర లోపు ట్రెండ్​ తెలిసే అవకాశం ఉంది. ఉదయం 11.30 గంటల వరకు విజయం ఎవరిదనే దానిపై క్లారిటీ రావొచ్చని ఎన్నికల అధికారులు తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్​ మృతితో అనివార్యమైన ఈ ఉప ఎన్నికలో.. విజయం కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డి పోరాడాయి. ఈ నెల 11న పోలింగ్​జరుగగా..  48.49 శాతం ఓటింగ్​నమోదైంది. 

ఈ ఉప ఎన్నికలో 59 మంది అభ్యర్థులు (నోటాతో కలిపి) పోటీలో ఉన్నందున, 42 కౌంటింగ్ టేబుల్స్​ ఏర్పాటు చేశారు. మొత్తం ప్రక్రియ గరిష్టంగా 10 రౌండ్లలో పూర్తయ్యే అవకాశం ఉందని, లెక్కింపు పనులను ఈసీ సాధారణ పరిశీలకులు పర్యవేక్షించనున్నారని, 186 మంది సిబ్బందిలో సూపర్​వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు నియమించామని ఎన్నికల అధికారులు తెలిపారు.

అప్‌‌డేట్స్‌‌ను ఎల్ఈడీ స్క్రీన్లు, ఈసీ యాప్‌‌ ద్వారా అందుబాటులో ఉంచుతామన్నారు. కౌంటింగ్ సెంటర్‌‌లోకి అభ్యర్థులు, వారి ఎన్నికల ప్రతినిధులు, అనుమతిచ్చిన కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇతరులెవరికీ అనుమతి ఉండదని చెప్పారు. కౌంటింగ్ సెంటర్ పరిసరాల్లో సెక్షన్ 144 అమలులో ఉంటుందని, ఉల్లంఘనలపై చర్యలు తప్పవని సీఈవో హెచ్చరించారు.