
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఢిల్లీలో జోడీగా ఉంటూ.. రాష్ట్రంలో మాత్రం తాము వేర్వేరు అన్నట్టుగా నాటకాలు ఆడుతున్నాయని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఇన్చార్జి, మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. ఆ రెండు పార్టీలు ఒక్కటే కాబట్టి ఓట్ చోరీపై కేటీఆర్ మాట్లాడడం లేదని అన్నారు. ఓట్ చోరీపై రాహుల్ గాంధీ గళం ఎత్తితే ఆయనకు మద్దతుగా కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
టీవీలో మాట్లాడడం అనేది కేటీఆర్‌కు ఫ్యాషన్‌గా మారిందని, సారు.. కారు.. పదహారు అని లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసి సున్నా సీట్లకు పరిమితమై ఫెయిల్యూర్ నాయకత్వమని చాటుకున్నారని విమర్శించారు. ఈ నియోజకవర్గంలో కేవలం రెండు నెలల్లోనే రూ.40 కోట్ల అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. ఇక్కడ నవీన్ యాదవ్‌ను గెలిపించేందుకు 70 శాతం ఓటింగ్ జరిగేలా పార్టీ కార్యకర్తలు కష్టపడాలని.. ఇది మొదటి టార్గెట్ అని సూచించారు.
కాంగ్రెస్‌కు లక్ష ఓట్ల మెజార్టీ వచ్చేలా చేయడం రెండో టార్గెట్ అని చెప్పారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనను ఇక్కడి ప్రజలు చూశారని, 20 వేల ఎకరాల విలువైన భూములను కేసీఆర్ కుటుంబం దోచుకుందని విమర్శించారు. కాంగ్రెస్ గెలుపుతోనే ఇక్కడ అభివృద్ధి సాధ్యమని వివేక్ అన్నారు.
మీ ఇంట్లో మనిషిగా భావించి గెలిపించాలి: నవీన్ యాదవ్
15 ఏండ్లుగా మీతోనే ఉంటున్నానని, ఎక్కడ ఏ సమస్య ఉందో తనకు పూర్తిగా తెలుసని.. మీ ఇంట్లో మనిషిగా భావించి..ఇక్కడి ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కోరారు. రాజకీయ నాయకుడిగా నన్ను చూడకుండా మీ కుటుంబ సభ్యుడిగా భావించి గెలిపించాలని అన్నారు.