జూబ్లీహిల్స్ ఫలితం నవంబర్ 14న.. ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ...కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

జూబ్లీహిల్స్ ఫలితం నవంబర్ 14న.. ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ...కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
  • 42 టేబుల్స్​.. 10 రౌండ్స్​..కౌంటింగ్​కు పకడ్బందీ ఏర్పాట్లు
  • ఉదయం 8 గంటలకు ప్రారంభం.. గంటన్నరలోపే ట్రెండ్
  • విజేత ఎవరనే దానిపై ఉదయం 11.30 గంటలలోపే క్లారిటీ!
  • మొదట షేక్​పేట డివిజన్ ​ఓట్ల లెక్కింపు
  • తర్వాత వరుసగా వెంగళ్​రావు నగర్​, రహమత్​నగర్​, యూసుఫ్​గూడ, 
  • సోమాజిగూడ, బోరబండ, ఎర్రగడ్డ డివిజన్ల ఓట్ల కౌంటింగ్​
  • యూసుఫ్‌‌గూడలోని కోట్ల విజయభాస్కర్​రెడ్డి ఇండోర్​ స్టేడియం వేదిక
  • సెంటర్​ పరిసరాల్లో భారీ బందోబస్తు.. 144 సెక్షన్​ అమలు
  • గెలుపోటములపై జోరుగా బెట్టింగ్స్​

హైదరాబాద్ / హైదరాబాద్ సిటీ, వెలుగు:  జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం శుక్రవారం తేలనుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్​తో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తం 10 రౌండ్లలో కౌంటింగ్​ చేపట్టనున్నారు. గంట గంటన్నర లోపు ట్రెండ్​ తెలిసే అవకాశం ఉంది. ఉదయం 11.30 గంటల వరకు విజయం ఎవరిదనే దానిపై క్లారిటీ రావొచ్చని ఎన్నికల అధికారులు తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్​ మృతితో అనివార్యమైన ఈ ఉప ఎన్నికలో.. విజయం కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డి పోరాడాయి. ఈ నెల 11న పోలింగ్​ జరుగగా..  48.49 శాతం ఓటింగ్​ నమోదైంది. 

సెంటర్​ పరిసరాల్లో 144 సెక్షన్​ అమలు

యూసుఫ్‌‌గూడలోని కోట్ల విజయభాస్కర్​రెడ్డి ఇండోర్​ స్టేడియంలో కౌంటింగ్​ ఉంటుంది. అక్కడ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించి.. ప్రక్రియ సజావుగా సాగేందుకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ ఉప ఎన్నికలో 59 మంది అభ్యర్థులు (నోటాతో కలిపి) పోటీలో ఉన్నందున, 42 కౌంటింగ్ టేబుల్స్​ ఏర్పాటు చేశారు. మొత్తం ప్రక్రియ గరిష్టంగా 10 రౌండ్లలో పూర్తయ్యే అవకాశం ఉందని, లెక్కింపు పనులను ఈసీ సాధారణ పరిశీలకులు పర్యవేక్షించనున్నారని, 186 మంది సిబ్బందిలో సూపర్​వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు నియమించామని ఎన్నికల అధికారులు తెలిపారు.

 అప్‌‌డేట్స్‌‌ను ఎల్ఈడీ స్క్రీన్లు, ఈసీ యాప్‌‌ ద్వారా అందుబాటులో ఉంచుతామన్నారు. కౌంటింగ్ సెంటర్‌‌లోకి అభ్యర్థులు, వారి ఎన్నికల ప్రతినిధులు, అనుమతిచ్చిన కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇతరులెవరికీ అనుమతి ఉండదని చెప్పారు. కౌంటింగ్ సెంటర్ పరిసరాల్లో సెక్షన్ 144 అమలులో ఉంటుందని, ఉల్లంఘనలపై చర్యలు తప్పవని సీఈవో హెచ్చరించారు.

మొదట షేక్​పేట డివిజన్​ ఓట్ల లెక్కింపు

జూబ్లీహిల్స్​ అసెంబ్లీ నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు ఉండగా.. 1,94,631 మంది ఓటు వేశారు. 48.49శాతం పోలింగ్ నమోదైంది.  407 పోలింగ్​ బూత్​లలో ఓటింగ్​ జరిగింది.  నియోజకవర్గంలో మొత్తం 7 డివిజన్లు ఉండగా.. మొదట షేక్​పేట డివిజన్​ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత వరుసగా వెంగళ్​రావు నగర్​, రహమత్​నగర్​, యూసుఫ్​గూడ, సోమాజిగూడ, బోరబండ, ఎర్రగడ్డ డివిజన్ల ఓట్ల లెక్కింపు ఉంటుంది. 

పార్టీల్లో ఉత్కంఠ

జూబ్లీహిల్స్‌‌లో విజేత ఎవరనేదానిపై ప్రధాన పార్టీల నాయకుల్లో ఉత్కంఠ నెలకొన్నది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయని, తమ విజయం ఖాయమని కాంగ్రెస్  నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ అభ్యర్థి నవీన్​ యాదవ్​కు భారీ మెజార్టీ వస్తుందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం కావని, తమ అంచనాలే నిజమవుతాయని బీఆర్ఎస్  నాయకులు అంటున్నారు. తమ అభ్యర్థి మాగంటి సునీత విజయం సాధిస్తారని వాళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీల మధ్య ఓట్లు చీలి తమ అభ్యర్థి లంకల దీపక్​రెడ్డికి కలిసి వస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్‌‌లోనూ వెలువడే ఫలితం ఉత్కంఠను పెంచనుంది. ఐదారు రౌండ్లలోపే గెలుపు అవకాశాలు తేలనున్నాయి. 

జోరుగా బెట్టింగులు 

జూబ్లీహిల్స్ బైపోల్​ రిజల్ట్​పై రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలతో పాటు బెట్టింగ్ రాయుళ్లు కూడా తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నిక ఫలితంపై రూ. కోట్లలో పందేలు కడుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో, కాంగ్రెస్ అభ్యర్థి విజయంపై బెట్టింగ్ వేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. మొన్నటి దాకా కాంగ్రెస్ , బీఆర్ఎస్ రెండింటిపై పోటాపోటీగా బెట్టింగ్స్ వేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీ విషయంలో ఇప్పుడు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.  గెలుపోటములతో పాటు అభ్యర్థులు సాధించే మెజారిటీపై కూడా భారీగా బెట్టింగ్​లు నడుస్తున్నట్లు సమాచారం.  

డివిజన్ వారీగా పోలైన ఓట్లు... 

బోరబండ డివిజన్ లో మొత్తం ఓటర్లు 53,211 మంది ఉండగా..29,760 (55.92%) ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 52 పోలింగ్ బూత్​లు ఏర్పాటు చేశారు. 
    
రహమత్ నగర్  డివిజన్​లో మొత్తం 74,387 ఓట్లు ఉండగా.. 40,610 (54.59%) ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 75 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. 
    
ఎర్రగడ్డ డివిజన్​లో 58,752 మంది ఓటర్లు ఉండగా.. 29,112 (49.55%)  ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 60 పోలింగ్​ బూత్​లు ఏర్పాటు చేశారు.  
    
వెంగళ్​ రావు నగర్ డివిజన్​లో 53,595 ఓట్లు ఉండగా..  25,195 (47%) ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ  56 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు.  
    
షేక్ పేట్ డివిజన్ లో  71,062 మంది ఓటర్లు ఉండగా..  31,182 (43.87%) ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 70 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. 
    
యూసుఫ్‌‌గూడ డివిజన్ లో 55,705 మంది  ఓటర్లు ఉండగా.. 24,219 (43.47%) ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 58 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. 
    
సోమాజిగూడ డివిజన్​లో 34,653 మంది ఓటర్లు ఉండగా..  14,553 (41.99%) ఓట్లు పోలయ్యాయి.  ఇక్కడ 36  పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. 

అన్ని ఏర్పాట్లు పూర్తి: ఆర్వీ కర్ణన్​

జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. గురువారం యూసఫ్ గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ఏర్పాట్లను ఆయన మీడియాకు వివరించారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని..ముందుగా  పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేస్తామన్నారు. 

 జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ..  కౌంటింగ్ కోసం ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అన్ని విభాగాల పోలీసు బృందాలు అందుబాటులో ఉంటాయని,  కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, రిటర్నింగ్ అధికారి పి సాయిరాం, విజిలెన్స్ అదనపు ఎస్పీ నరసింహా రెడ్డి  పాల్గొన్నారు.