హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ఓటమి తమ పార్టీకి సెట్బ్యాక్కాదని బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్అన్నారు. తాము మళ్లీ పుంజుకుంటామని, గోడకు కొట్టిన బంతిలా తిరిగొస్తామని చెప్పారు. ఉప ఎన్నిక ఫలితాలపై విశ్లేషించుకుంటామని తెలిపారు. శుక్రవారం జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్ అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ఎన్నో అక్రమాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు.
‘‘ప్రతి సర్వేలోనూ బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని తేలింది. కానీ చివరి మూడు రోజుల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఓటింగ్ శాతం 48.49 అయినప్పటికీ, అది 65 నుంచి 70% అనుకోవాలి. చాలామంది ఓటర్లు షిఫ్ట్ అయ్యారు. లిస్టులో పేరున్న వాళ్లు ఇక్కడ లేరు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ సొంత తమ్ముడికి ఈ నియోజకవర్గంలో మూడు ఓట్లు ఉన్నాయి. ఇలాంటి వాటిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.
దొంగ ఓట్లు పడ్డాయని మా అభ్యర్థి మొత్తుకున్నా అధికార యంత్రాంగం స్పందించలేదు” అని ఆరోపించారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదని విమర్శించారు. రిజల్ట్ చూశాక బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయం ఫలించినట్టుగానే కనిపిస్తున్నదని.. ఆర్ఎస్ (రేవంత్, సంజయ్) బ్రదర్స్ సమీకరణం బాగానే వర్కౌట్ అయినట్టు కనిపించిందని కామెంట్ చేశారు.
ఒక్క బైపోల్‌కే రేవంత్ ఆగమైండు..
రాష్ట్రంలో జరిగిన ఒక్క ఉప ఎన్నికకే సీఎం రేవంత్ రెడ్డి ఆగమయ్యారని కేటీఆర్ అన్నారు. ‘‘బెంగాల్‌లో బీజేపీ ఎమ్మెల్యే తృణమూల్ కాంగ్రెస్‌లో చేరితే, అక్కడి హైకోర్టు ఆ ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేసింది. ఫిరాయింపుల చట్టం దేశం మొత్తం ఒకేలా ఉండాలి. అక్కడ వచ్చిన తీర్పే ఇక్కడా రావాలి. అలాంటి తీర్పే ఇక్కడ కూడా వస్తుందని మా పార్టీ భావిస్తున్నది.
అప్పుడు రాష్ట్రంలో పది చోట్ల ఉప ఎన్నికలు వస్తాయి. మరి అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇంకెంత ఆగమైతడో.. ఇందిరాగాంధీ, సోనియాగాంధీని పిలుచుకుంటడేమో” అని ఎద్దేవా చేశారు. 2014 నుంచి 2023 వరకు రాష్ట్రంలో ఏడు ఉప ఎన్నికలు జరిగితే, వాటిలో అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఒక్క చోట కూడా గెలవలేదన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి రెండు సీట్లే వచ్చాయన్నారు. ఇప్పుడు బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతయిందని విమర్శించారు.
మత రాజకీయాలు చెయ్యం..
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే బలంగా కొట్లాడతామని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను, ఆరు గ్యారంటీల మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. ‘‘కులం, మతం పేరుతో మేం రాజకీయం చెయ్యం. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు అవసరమైన అంశాలను మాత్రమే చర్చకు పెట్టాం.
క్యాంపెయిన్ టైమ్‌లో మా పార్టీ సీనియర్ నేత హరీశ్ రావు తండ్రి మరణించగా, ఆ బాధను దిగమింగుకొని ఎప్పటికప్పుడు ఇంటి నుంచే ఎన్నిక కోసం పని చేశాం. మా పార్టీ ఎమ్మెల్సీ రవీందర్ రావు సోదరుడు కూడా చనిపోయారు. అయినప్పటికీ ఆయన ఒక్కరోజులోనే ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ విజయం కోసం ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.
నిరాశపడం..
ఈ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత మొక్కవోని ధైర్యంతో కొట్లాడిందని కేటీఆర్ అన్నారు. పార్టీ కార్యకర్తలు చాలా బాగా పని చేశారని మెచ్చుకున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా రెండేండ్లుగా ప్రజా సమస్యలే కేంద్రంగా ప్రభుత్వంపై పోరాడామని, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీనే అని ప్రజలు స్పష్టం చేశారని పేర్కొన్నారు. ‘‘గత రెండేండ్లుగా లగచర్ల ఘటన మొదలుకొని కాంగ్రెస్ చేసిన అనేక అవినీతి అక్రమాలను ఎండగడుతూనే ఉన్నాం. ఇదే విధంగా ప్రజా సమస్యలపై పోరాడుతూ ముందుకెళ్తాం. ప్రజల్లోనే ఉంటూ వాళ్ల కోసమే పోరాటాలు చేస్తాం. కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేసుకునేదాకా నిరాశను దరికి చేరనివ్వం” అని అన్నారు.
