జూబ్లీహిల్స్ పీఠం ఎవరిది..? షెడ్యూల్ ప్రకటనతో ప్రధాన పార్టీల ఫోకస్.. నవంబర్ 11న పోలింగ్

జూబ్లీహిల్స్ పీఠం ఎవరిది..? షెడ్యూల్ ప్రకటనతో  ప్రధాన పార్టీల ఫోకస్..  నవంబర్ 11న పోలింగ్
  • గెలుపుపై ప్రధాన పార్టీల ఫోకస్..
  • మూడు పార్టీలకూ కీలకం​
  • జోరు మీదున్న కాంగ్రెస్​.. అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ధీమా
  •     సిట్టింగ్ ​స్థానాన్ని కాపాడుకునే పనిలో బీఆర్​ఎస్
  •     మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించడం వెనుక ‘సెంటిమెంట్’ వ్యూహం
  •     ఉనికి కోసం బీజేపీ ఆరాటం.. 
  • అభ్యర్థి ఎంపిక కోసం త్రీమెన్ ​కమిటీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: 
జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికకు నగరా మోగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్​ ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన ఈ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం బై పోల్​ షెడ్యూల్​ను ప్రకటించింది. దీంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్​, బీఆర్​ఎస్​, బీజేపీ గెలుపుపై ఫోకస్​ పెట్టాయి. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉన్న అసెంబ్లీ సీటు కావడం, త్వరలో జీహెచ్​ఎంసీ ఎన్నికలు జరగనుండడంతో మూడు పార్టీలకు ఈ బైపోల్​ కీలకంగా మారింది. ఇప్పటికే  నేతలు సెగ్మెంట్​లో కలియతిరుగుతున్నారు. ఇప్పుడు షెడ్యూల్​ కూడా రావడంతో మరింత బిజీ కానున్నారు. 

ఈ నెల 13 నుంచి నామినేషన్లు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్​ ఈ నెల 13న విడుదల కానుంది. అదేరోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. షెడ్యూల్​ ప్రకటించినందున హైదరాబాద్​ జిల్లాలో ఎన్నికల కోడ్​ అమల్లోకి వచ్చింది. ఈ నెల 13 నుంచి  21 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు.

22న స్క్రూటినీ, 24న విత్ డ్రాకి అవకాశం ఇచ్చారు. వచ్చే నెల 11న పోలింగ్ జరుగుతుంది. అదే నెల 14న కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3,98,982 మంది ఉన్నారు.

రెండు మూడు రోజుల్లో అభ్యర్థి ప్రకటన

జూబ్లీహిల్స్​లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్​ పార్టీ పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా అభ్యర్థి ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తున్నది. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డితో కాంగెస్​ రాష్ట్ర ఇన్​చార్జ్​ మీనాక్షి నటరాజన్ , పీసీసీ చీఫ్  మహేశ్ కుమార్ గౌడ్ మరోసారి సమావేశమై నాలుగు పేర్లతో కూడిన ఆశావహుల జాబితాను సిద్ధం చేయనున్నారు. ఎన్నికల షెడ్యూల్ ​కూడా వచ్చినందున హైకమాండ్ గురువారంలోగా అభ్యర్థిని ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తున్నది. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్.. జూబ్లీహిల్స్​లోనూ బీసీలకే టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. 

ఈ మేరకు సోమవారం మీడియాతో జరిగిన చిట్ చాట్ లో బీసీలకే జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వనున్నట్లు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీ కోటాలో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. నియోజకవర్గ ఇన్​చార్జులుగా ఉన్న మంత్రుల  సిఫార్సులకు తోడు ఇప్పటికే కాంగ్రెస్ నిర్వహించిన సర్వేల ఆధారంగా టికెట్ ఖరారుచేసే అవకాశం ఉంది. అభ్యర్థిని ప్రకటించనప్పటికీ బై పోల్​ ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్​ రెండు, మూడు రోజుల్లో బస్తీ బాటకు రెడీ అవుతున్నది. 

ఇక్కడ పార్టీ ఇన్​చార్జులుగా ఉన్న మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు ఇప్పటికే స్థానిక నేతలు, కేడర్​తో పలుదఫాలు సమావేశమయ్యారు. షెడ్యూల్ ​రాకముందే బస్తీల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు షెడ్యూల్​ రావడంతో  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ​చైర్​పర్సన్లు, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ సీనియర్లు ఆయా డివిజన్లలో ముమ్మర ప్రచారానికి సిద్ధమవుతున్నారు. 

సిట్టింగ్​ స్థానాన్ని కాపాడుకునే పనిలో బీఆర్ఎస్​

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ పార్టీకి సిట్టింగ్ స్థానం కావడంతో తిరిగి దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పటికే  కంటోన్మెంట్​ను కోల్పోయిన ఆ పార్టీ, ఎట్టిపరిస్థితుల్లోనూ జూబ్లీహిల్స్​ను కోల్పోవద్దనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే మిగతా అన్ని పార్టీల కన్నా ముందుగానే అభ్యర్థిని ప్రకటించి, ప్రచారం ప్రారంభించింది. 

సెంటిమెంట్​కూడా కలిసివస్తుందనే ఉద్దేశంతో మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతనే గులాబీ పార్టీ తన అభ్యర్థిగా ప్రకటించింది. టికెట్ ఖాయం కాకముందే గోపీనాథ్ ఇద్దరు కూతుర్లు అక్షర, దిశిర నియోజకవర్గంలోని డివిజన్లలో ఇంటింటి ప్రచారం మొదలు పెట్టారు. అభ్యర్థిని ప్రకటించాక లీడర్లతోపాటు కార్యకర్తలు కూడా రంగంలోకి దిగారు. ఈ ఉప ఎన్నిక గెలుపు బాధ్యతలను పార్టీ వర్కింగ్ ​ప్రెసిడెంట్​ కేటీఆర్ తన​ 
భుజానికెత్తుకున్నారు. 

డివిజన్ల వారీగా సిటీ ఎమ్మెల్యేలకు ఇన్​చార్జ్​ బాధ్యతలు అప్పగించారు. కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ యాక్టివ్​గా పనిచేస్తున్నారు. కేడర్​తో భేటీ అవుతూ దిశానిర్దేశం చేస్తున్నారు.  నియోజకవర్గంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండడంతో వారి ఓట్లు పడేలా మైనారిటీ నేతలతోనూ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.​ ‘కాంగ్రెస్​ బాకీ కార్డ్’ పేరుతో ఇంటింటి ప్రచారం సాగిస్తున్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ప్రజల్లోకి వెళ్తున్నారు. రెండు మూడు రోజుల కింద ఎమ్మెల్యే హరీశ్ రావు యూసుఫ్ గూడ డివిజన్ లో బైక్ ర్యాలీ తీసిన అనంతరం ఇంటింటికీ బాకీ కార్డులను పంచారు.


అభివృద్ధి, సంక్షేమాన్నే నమ్ముకున్న కాంగ్రెస్

తమ రెండేండ్ల పాలనను చూసి జూబ్లీహిల్స్ ఓటర్లు తమను గెలిపిస్తారని కాంగ్రెస్​ నమ్ముతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలనే ఆ పార్టీ ప్రధానంగా నమ్ముకుంది. మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్​, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు, 60 వేలకుపైగా ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై ప్రచారం చేస్తున్నది. ఈ నియోజకవర్గంలో మైనారిటీల ఓట్లు మూడో వంతు ఉండడంతో వారి మద్దతు కూడగట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 

మజ్లిస్​ పార్టీ సపోర్టు కూడా తమకే ఉండటంతో కలిసి వస్తుందని కాంగ్రెస్​ భావిస్తున్నది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్​లో కాంగ్రెస్ ఒక్క సీటునూ గెలుచుకోలేక పోయింది. కానీ, ఆ తర్వాత కంటోన్మెంట్​కు జరిగిన ఉప ఎన్నికలో గెలవడం ద్వారా గ్రేటర్​లో ఖాతా తెరిచింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా కంటోన్మెంట్ ఫలితమే రిపీట్​ అవుతుందని కాంగ్రెస్​ భావిస్తున్నది. 

బీజేపీ నేతలకు అగ్ని పరీక్ష!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీకి అగ్నిపరీక్షగా మారింది. కాంగ్రెస్​కు తామే ప్రత్యామ్నాయమని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి రాష్ట్ర పాలనా పగ్గాలు చేపడ్తామంటున్న ఆ పార్టీ పెద్దలకు.. ఇది కీలకంగా మారింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్​ పార్లమెంట్ పరిధిలో జూబ్లీహిల్స్ ఉండడం, రాంచందర్​రావు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి ఎన్నిక కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

మొన్నటిదాకా సడీసప్పుడు లేని ఆ పార్టీ ఇటీవలే అభ్యర్థి ఎంపికపై దృష్టిపెట్టింది. ఇందుకోసం ముగ్గురు సభ్యులతో కమిటీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు ప్రకటించారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు, సీనియర్ నేత కోమల ఆంజనేయులు ఉన్నారు. కాగా, జూబ్లీహిల్స్​ నుంచి దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, అట్లూరి రామకృష్ణ తదితరులు పోటీకి ఆసక్తిచూపుతున్నారు. వీరితో పాటు సినీ నటి జయసుధ పేరు కూడా తెరపైకి వచ్చింది. వీరిలో కేడర్​ మద్దతు ఎవరికి ఉందో త్రిమెన్​ కమిటీ తేల్చి హైకమాండ్​కు నివేదించనుంది.  త్వరలోనే జీహెచ్​ఎంసీ ఎన్నికలు కూడా ఉండడంతో నగరంలోని కేడర్ అంతా జూబ్లీహిల్స్ ఎన్నికలకు పనిచేయాలని బీజేపీ రాష్ట్ర కమిటీ ఆదేశించింది. ఈ క్రమంలోనే పార్టీ కార్పొరేటర్లంతా ఇక్కడ ప్రచారానికి సిద్ధమవుతున్నారు.

హడావుడి మొదలు 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు షెడ్యూల్​ వెలువడటంతో ప్రధాన పార్టీల్లో హడావుడి మొదలైంది. అధికార కాంగ్రెస్​తోపాటు బీజేపీ, బీఆర్ఎస్​ పార్టీలు ఇక్కడ విజయం కోసం వ్యూహరచనలు చేస్తున్నాయి. తాము అధికారంలోకి వచ్చాక చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయనే కాంగ్రెస్​ ధీమాతో ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్​లో ఒక్క సీటూ గెలవని ఆ పార్టీ.. ఆ తర్వాత కంటోన్మెంట్​ ఉప ఎన్నికలో గెలవడం ద్వారా గ్రేటర్​ హైదరాబాద్​లో బోణీ కొట్టింది. 

అదే జోష్​తో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్​లోనూ విజయం సాధించాలని భావిస్తున్నది. అటు వరుస ఓటములతో కుదేలైన బీఆర్ఎస్​కు ఈ సిట్టింగ్​స్థానాన్ని తప్పక నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి! దీంతో ఆ పార్టీ  ప్రధానంగా సెంటిమెంట్​నే నమ్ముకున్నది. మాగంటి గోపీనాథ్ మృతితో ఖాళీ అయిన ఈ సీటులో ఆయన భార్య సునీతనే అభ్యర్థిగా ప్రకటించి, ప్రచారం చేస్తున్నది. మరోవైపు కాంగ్రెస్​కు తామే ప్రత్యామ్నాయమని చెప్తున్న బీజేపీకి.. జీహెచ్​ఎంసీ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ ఉప ఎన్నిక అగ్నిపరీక్షలా మారింది.